గుంటూరుజిల్లాలోకి ఘన స్వాగతం .. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గుంటూరుజిల్లాలోకి ఘన స్వాగతం ..

గుంటూరుజిల్లాలోకి ఘన స్వాగతం ..

Written By news on Saturday, February 23, 2013 | 2/23/2013


నేడు గుంటూరుజిల్లాలోకి మరో ప్రజాప్రస్థానం 
ఘన స్వాగతం పలికేందుకు వైఎస్సార్ సీపీ భారీ ఏర్పాట్లు.
పల్నాటి సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో 
స్వాగత ద్వారాలు. తొలిరోజు 9 కిలోమీటర్లు 
నడవనున్న షర్మిల .పొందుగలలో బహిరంగ సభ
అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభం

పొందుగలకు పండగొచ్చింది.. సంక్రాంతి మళ్లీ వచ్చినట్టు ఊరంతా ఒకటే సంతోషం.. వీధి వీధినా కొలువుదీరిన రంగవల్లులు.. ఇంటింటా మామిడి తోరణాలు.. బంధుగణం స్నేహితుల రాక.. వారికి మర్యాదలు చేస్తూ గ్రామస్తులు .... మరో వైపు కళకళలాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఇళ్లు.. కార్యాలయాలు.. జిల్లా వ్యాప్తంగా వున్న పార్టీ నేతల రాకతో సందడి సందడిగా మారిన పొందుగలకు కొత్త కళ వచ్చింది..ఊరు ఊరంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉరకలేస్తున్నది.. షర్మిలమ్మ కోసం ఎదురుచూస్తున్నది.. మరికొద్ది గంటల్లో పొందుగలలో తొలి అడుగుపెట్టనున్న షర్మిలమ్మకు ఘనస్వాగతం పలకాలని.. ఊరు ఊరంతా ఉవిళ్లూరుతోంది. జగనన్నకు సోదరంటే మాకూ చెల్లెలేనని పెద్దవాళ్లు.. మాఅక్కయ్యేనని చిన్నవాళ్లు.. మాకు కూతురు లెక్కని పెద్దమ్మలు..మా బిడ్డలాంటిదని పెద్దోళ్లు.. మా ఇంటి ఆడపడుచని మహిళలు.. మా మనవరాలని వృద్ధులు.. మా ఊరికి వెలుగని గ్రామస్తులు.. మా కన్నీళ్లు తుడిచే నాయకురాలని కర్షకులు.. మాకు బాసటగా నిలిచే మహిళని బడుగు,బలహీన వర్గాలు ప్రజలు..ఇలా ఒకరేమిటి యావత్ జిల్లా కోటి కళ్లతో ఎదురు చూస్తూ నోరారా ‘రావమ్మా.. షర్మిలమ్మా..రావమ్మా’అంటూ మంగళహారతులిచ్చేందుకు సిద్ధమయ్యారు...

జిల్లా ప్రజలు నిరీక్షిస్తున్న రోజు రానే వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం జిల్లాలోకి ప్రవేశించనున్నది. ఆమెకు స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొన్నది. తొలిగా ఆమె ప్రవేశించనున్న గురజాల నియోజకవర్గంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలావుంటే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని అధికారులుగాని, అధికార పక్షం, విపక్షం నేతలు గానీ కనీసం పరామర్శించకపోవడంతో ఆ వర్గాల నుంచి ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.


ముఖ్యంగా మిర్చి రైతులు దాదాపు రూ.25 కోట్ల వరకు నష్టపోయారు. 20 వేల ఎకరాల్లో శనగ పూత కూడా రాలి పోయింది, పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. విద్యుత్ కోత కారణంగా పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లుతున్నా అధికారులు స్పందించడం లేదు. విద్యుత్ చార్జీలు, పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ అన్ని వర్గాలపై భారాన్ని మోపుతున్న ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అపర భగీరధుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సాగు స్థిరీకరణ కోసం చేపట్టిన పులిచింతల ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతుండటంతో రైతాంగం సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. ఈ వైఫల్యాలకు ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని భుజానమోస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడే కారణమనే భావన సర్వత్రా వినవస్తోంది. 

ఈ అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు, వారికి భరోసా ఇచ్చేందుకు షర్మిల మరో ప్రజాప్రస్థానం ద్వారా ప్రజల్లోకి వస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా వాడపల్లి వంతెన మీదుగా గుంటూరు జిల్లా పొందుగల గ్రామంలోకి ప్రవేశిస్తారని జిల్లా కన్వీనరు మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు తెలిపారు. జిల్లాలో 14 నియోజకవర్గాల్లో సుమారు 300 కిలోమీటర్ల మేర ఆమె పాదయాత్ర జరుగుతుందన్నారు. తొలి రోజు షర్మిల తొమ్మిది కిలోమీటర్ల పాదయాత్ర చేసే విధంగా షెడ్యూల్ రూపొందించారు. నల్లగొండ జిల్లా దామచర్ల మండలం వాడపల్లి బస నుంచి ఉదయం యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి 2.5 కిలోమీటర్లు నడిచి వాడపల్లిలో పర్యటిస్తారు.

అక్కడి నుంచి వంతెన మీదుగా గుంటూరు జిల్లా పొందుగల చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తరువాత 4.5 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి పులిపాడులో ఏర్పాటు చేసిన బసకు చేరుకుంటారుభారీ ఏర్పాట్లు ... మరో ప్రజాప్రస్థానం విజయవంతం చేసేందుకు పార్టీ సీనియర్ నేతలు అనేకసార్లు సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే కార్యకర్తలు, నాయకులకు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి పలు సూచనలు చేశారు. పోస్టర్లు విడుదల, కరపత్రాల పంపిణీ, మైక్‌ల సహాయంతో గ్రామ స్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. గుంటూరు, కృష్ణాజిల్లాల సమన్వయ కర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పాదయాత్ర జరగనున్న నియోజకవర్గాల్లో మైక్‌లతో ప్రచారం చేపట్టారు. 

జిల్లా యువజన విభాగం కన్వీనరు కావటి మనోహరనాయుడు, బీసీ విభాగం కన్వీనర్ దేవెళ్ల రేవతి, పార్టీ నాయకుడు యేటిగడ్డ నరసింహారెడ్డి (బుజ్జి) కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి పోస్టర్లు విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. షర్మిలకు ఘనస్వాగతం పలికేందుకు పలువురు నేతలు వందలాది ద్విచక్ర వాహనాలు, లారీలు, బస్‌లలో పొందుగల గ్రామానికి తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 

పల్నాటి సంస్కృతి ప్రతిబింబించేలా...
పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి పల్నాడు సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో భారీ స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. అద్దంకి- నార్కెట్‌పల్లి హైవేకు ఇరువైపులా వైఎస్సార్, జగన్, విజయమ్మ, షర్మిలల భారీ ఫొటోలతో కూడిన స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. ద్వారాలకు పై భాగంలో రెండు వైపులా కోడి పుంజుల బొమ్మలను ఏర్పాటు చేసి పల్నాటి సంస్కృతిని చాటి చెప్పారు.

భారీగా తరలిరండి: మర్రి రాజశేఖర్ 
జగనన్న సోదరి, మన ఆత్మబంధువు షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పొందుగలకు తరలిరావాలని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. మునుపెన్నడూ, ఎక్కడా జరగని రీతిలో ఆమెకు స్వాగతం పలికేందుకు అంతా కృషి చేయాలి. వివిధ వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను షర్మిలకు వివరించాలని కోరారు. 

పాదయాత్రను విజయవంతం చేయండి : ఎమ్మెల్యే పీఆర్కే
షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను విజయవంతం చేయాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పొందుగల, శ్రీనగర్ గ్రామాలలో షర్మిల చేపట్టనున్న పాదయాత్ర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. షర్మిలమ్మకు బ్రహ్మరథం పట్టి పల్నాటి చరిత్రను రాష్ట్రమంతా చాటిచెప్పేలా కార్యకర్తలు నాయకులు, మహిళలు తరలిరావాలని కోరారు.

Share this article :

0 comments: