వారిది చీకటి లెక్క - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వారిది చీకటి లెక్క

వారిది చీకటి లెక్క

Written By news on Thursday, February 7, 2013 | 2/07/2013

* అందుకే ప్రభుత్వంపై అవిశ్వాసం రాదు
* కాంగ్రెస్, టీడీపీ చెట్టాపట్టాలపై షర్మిల ధ్వజం 
* చంద్రబాబుపై ఎన్ని కేసులున్నా ఈ సర్కారు విచారణ చేయదు
* ప్రతిఫలంగా చంద్రబాబు అవిశ్వాసం పెట్టరు
* రెండు పార్టీల ఉమ్మడి ఎజెండా ఒకటే.. ఒకరే.. అదే జగన్
* రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ నుంచి ‘మరో ప్రజాప్రస్థానం’ పునఃప్రారంభం 
* జగనన్న బయట ఉంటే వారికి మనుగడ ఉండదనే జైల్లో పెట్టించారు
* మూడేళ్లుగా అన్ని ఎన్నికల్లోనూ.. మ్యాచ్‌ఫిక్సింగ్
* సమాచార చట్టం కమిషనర్ పదవులను కూడా రెండు పార్టీలూ చెరిసగం పంచుకున్నాయి 


‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు పాదయాత్రలు అంటూ పల్లెల వెంట తిరుగుతున్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. నిజానికి ఆయనకు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు కావాల్సినంత మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రజా సమస్యలు పట్టని ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి వెంటనే దించేయవచ్చు. కానీ ఆయన ఆ పని చేయనుగాక చేయను అంటారు. దానికీ ఒక లెక్కుంది. ఇద్దరి మధ్యా చీకటి ఒప్పందం ఉంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ‘‘చంద్రబాబు నాయుడు మన దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడని తెహల్కా తేల్చి చెప్పినా.. దాని మీద ఈ ప్రభుత్వం విచారణ చేయదట.

కమ్యూనిస్టు పార్టీ వారు.. చంద్రబాబు అవినీతి మీద ఒక పుస్తకమే రాశారు. అయినా కూడా ఎవరూ బాబుపై విచారణ చేయరట. కాంగ్రెస్ ప్రభుత్వం వారు చంద్రబాబు మీద కేసులు పెట్టరు. విచారణ చేయరు. అందుకు ప్రతిఫలంగా చంద్రబాబు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టరు. అదీ వాళ్ల చీకటి ఒప్పందం’’ అని షర్మిల అన్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికీ, దానితో కలిసి అంటకాగుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరికీ నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర ఏడు వారాల విరామం తరువాత బుధవారం పునఃప్రారంభమైంది. మోకాలి గాయంతో డిసెంబరు 15న పాదయాత్రకు విరామం ప్రకటించిన రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ నుంచే షర్మిల 58వ రోజు యాత్ర ప్రారంభించారు. తనతో పాటు కదంతొక్కిన భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ఆమె ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

చిదంబరం వద్దకు ఎంపీలను పంపి..: మొన్నటికి మొన్న జగనన్నకు బెయిల్ వస్తుందనుకున్న మరుసటి రోజున చంద్రబాబు నాయుడు ఒక పక్క పాదయాత్ర చేస్తూనే మరోవైపు తన ఎంపీలను ఆర్థిక మంత్రి చిదంబరం వద్దకు పంపించారు. ఈయన పాదయాత్ర చేస్తున్నాడు కదా.. ప్రజా సమస్యలపై మాట్లాడ్డానికి తన ఎంపీలను ఢిల్లీకి పంపించారేమో అనుకున్నాం.

కానీ అందుకు కాదు. జగనన్న విషయంలో జడ్జిలను ప్రభావితం చేసేలా.. ఆస్తులను అటాచ్ చేయించడం కోసం ఆయన తన ఎంపీలను పంపారు. చిదంబరమేమో చంద్రబాబు కోసమే ఆ కుర్చీలో కూర్చున్నట్లు వెంటనే.. ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సిఫార్సు చేసేశారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రతిపక్షం, పాలక పక్షం ఒక్కటి కాదు. మన రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్షం, పాలకపక్షం కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయి. మూడేళ్లుగా అన్ని ఎన్నికల్లోనూ ఒకరికొకరు సాయం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి సమాచార కమిషనర్ల పదవులను కూడా పంచుకున్నారు. ఇంత భయంకరంగా, ఇంత నిస్సిగ్గుగా ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు.

ఇద్దరి ఉమ్మడి ఎజెండా.. జగన్
తెలుగుదేశం పార్టీకే చెందిన చిన్న, పెద్ద నాయకులు కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైందని ఆరోపణలు చేస్తున్నారు. మేమేగనుక కుమ్మక్కైతే... జగనన్న ఆస్తుల మీద, కార్యాలయాల మీద, సాక్షి మీద, ఆయన బంధువుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయని అడుగుతున్నా. మేం కుమ్మక్కై ఉంటే జగనన్న మీద ఇన్ని కేసులు పెట్టి.. 8 నెలలుగా కనీసం బెయిల్ కూడా రాకుండా చేసి ఎందుకు జైల్లో పెడతారని అడుగుతున్నా. జగనన్న గనుక మీరన్నట్లు కుమ్మక్కై ఉంటే ఇప్పటికే ఏ మినిస్టరో.. ఏ ముఖ్యమంత్రో అయి ఉండేవారు. నిజానికి కుమ్మకైంది కాంగ్రెస్ పార్టీ, టీడీపీనే. ఈ రెండు పార్టీలూ కుట్రలు పన్ని.. జగనన్నను జైలుకు పంపాయి. వీళ్లిద్దరి ఉమ్మడి ఎజెండా..వాళ్ల టార్గెట్ ఒకరే.. ఆయనే జగన్. జగనన్న బయటే ఉంటే, ప్రజల సమస్యలపై ధర్నాలు, దీక్షలు చేస్తుంటే.. కాంగ్రెస్, టీడీపీలకుఇక మనుగడ ఉండదని జగనన్నను జైలు పాలు చేశాయి.

చంద్రబాబు వ్యతిరేకించలేదు కాబట్టే..
అధికారం వారి చేతిలో ఉందికదా అని సీబీఐని ఇష్టం వచ్చినట్లు వాడుకొని జగనన్నను నాలుగు గోడల మధ్య బందీగా చేశారు. సీబీఐ అనే సంస్థ కేంద్రం చేతిలో కీలు బొమ్మ అని సీబీఐ మాజీ డెరైక్టర్ జోగీందర్ సింగ్ స్వయంగా చెప్పారు. జగన్ తమ పార్టీలో ఉండి ఉంటే ఈపాటికే ఏ మంత్రో, ముఖ్యమంత్రో అయి ఉండేవారని కేంద్ర మంత్రి ఆజాద్ కూడా అన్నారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినందుకే జగన్‌పై ఈ కేసులూ, విచారణ అని ఆయన చెప్పకనే చె ప్పారు. చంద్రబాబు నాయుడు వ్యతిరేకించ లేదు కాబట్టే ఆయన మీద ఏ కేసులూ, విచారణలూ లేవు. చిరంజీవి బంధువుల ఇంట్లో మంచం కింద రూ. 70 కోట్లు దొరికింది. ఒక్కొక్క పెట్టెలో ఒక రూ. కోటి పెట్టి దాచుకున్నారట. ఆయన తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు కాబట్టి ఏ విచారణలూ లేవు. మన రాష్ట్రంలోనే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను లిక్కర్ డాన్ అని సొంత పార్టీ వాళ్లే చెప్తున్నా.. ఆయన మీద విచారణ చేయరు. అలా ఉన్నాయి ఈ నీచ రాజకీయాలు.
Share this article :

0 comments: