గల్ఫ్ బాధితులకు చేయూత ,తిరిగి రావడానికి వైఎస్సార్సీపీ ఏర్పాట్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గల్ఫ్ బాధితులకు చేయూత ,తిరిగి రావడానికి వైఎస్సార్సీపీ ఏర్పాట్లు

గల్ఫ్ బాధితులకు చేయూత ,తిరిగి రావడానికి వైఎస్సార్సీపీ ఏర్పాట్లు

Written By news on Friday, February 1, 2013 | 2/01/2013

వంద మందికి టికెట్ల అందజేత 
దుబాయ్‌లో పర్యటించిన ప్రతినిధి బృందం

సాక్షి, హైదరాబాద్: అనధికారికంగా పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దుబాయ్‌లో ఉద్యోగాలు చేసుకుంటూ పట్టుబడిన వారిని, ఎలాంటి కేసులు లేకపోయినా అధీకృత పత్రాలు లేని కారణంగా జైల్లో ఉంచిన వారిని కూడా సొంత రాష్ట్రానికి పంపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు దాతల సాయంతో ఏర్పాట్లు చేశారు. దుబాయ్ ప్రభుత్వం ఐదేళ్లకు ఒకసారి ప్రకటించే ‘అమ్నెస్టీ’ కింద విడుదల చేసిన వారిలో తొలివిడతగా 30 మందిని ఈనెల 29న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్‌కు పంపారు. మలి విడతగా మరో 20 మంది ఈ నెల నాలుగోతేదీన ఇక్కడకు రావడానికి ఏర్పాట్లు చేశారు. త్వరలో మరో యాభై మంది వరకూ వచ్చే అవకాశం ఉందని గురువారం రాత్రి దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్ ‘సాక్షి’కి తెలిపారు. వీరందరికీ విమాన టికెట్లకు అయిన ఖర్చులను వైఎస్సార్ కాంగ్రెస్ సమకూర్చింది. అలాగే కలాని ఎం.లాల్ సైతం పలువురికి విమానటికెట్ల ఖర్చును భరిం చారు. ఎన్నారై విభాగం విజ్ఞప్తి మేరకు అమెరికాలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు దారులు 20 మందికి విమాన టికెట్ల ఖర్చును భరించడానికి సిద్ధమయ్యారు. దుబాయ్‌లో ఉన్న పార్టీ శ్రేయోభిలాషులు పృథ్వీరాజ్ 12 మందికి, ప్రసాద్ (గల్ఫ్ జ్యోతి) ఐదుగురికి, అజయ్ కందిమళ్ల మరో ఐదుగురికి, వాసవీగ్రూప్ వారు ఇద్దరికి టికెట్లను ఏర్పాటు చేశారు. అక్కడినుంచి ప్రవాసులందరినీ రాష్ట్రానికి పంపే కార్యక్రమాన్ని పార్టీ శ్రేయోభిలాషులు ప్రసాద్ కుక్కునూరు, రమేష్‌రెడ్డి, స్వామి, సోమిరెడ్డి, బ్రహ్మానంద్, శామ్యూల్, సత్యం పర్యవేక్షించారు. ఇలా తిరిగివస్తున్న వారిలో కరీంనగర్, నల్లగొండ, ఉభయగోదావరి జిల్లాల వాసులు ఎక్కువగా ఉన్నారని వెంకట్ వివరించారు.

విముక్తికి కృషి: దుబాయ్‌లో ఒక హత్య కేసులో ఇరుక్కుని ఆరేళ్లకు పైగా జైలు శిక్షను అనుభవిస్తున్న కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల వాసులు ఆరుగురిని విడిపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషిని ప్రారంభించింది. పొట్ట కూటి కోసం వెళ్లి జైలుపాలైన ఈ ఖైదీల కుటుంబీకులు గతనెల 22న వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలసి తమ వారిని విడిపించాలని మొరపెట్టుకోగా ఆ మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన విషయం విదితమే. పార్టీ సీజీసీ సభ్యుడు కె.కె.మహేందర్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, ఎన్నారై విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్‌లతో కూడిన ప్రతినిధిబృందం దుబాయ్‌కు వెళ్లి అక్క డి న్యాయవాదులతో సంప్రదింపులు జరిపింది. ఖైదీలు విడుదల కావాలంటే షరియత్ ప్రకారం హత్యకు గురైన నేపాలీ రక్తసంబంధీకులకు రూ.15లక్షలు చెల్లించాల్సి ఉంది.

ఈ మొత్తాన్ని తాను చెల్లిస్తానని అక్కడి ప్రవాస భారతీయుడు కలాని ఎం.లాల్ ముందుకు వచ్చారు. లాల్‌కు మిత్రుడైన ఆర్.జె.రావు ఈప్రతిపాదనను పార్టీ సీజీసీ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డికి చెప్పడంతో ఆయన వెంటనే సమ్మతించి ప్రతినిధి బృందాన్ని దుబాయ్‌కు పంపారు. సుమారు ఎనిమిదేళ్ల కిందట శిక్ష పడిన కేసు కనుక ఖైదీల విడుదలకు న్యాయపరమైన తంతు పూర్తయ్యేటప్పటికి కనీసం 6 నుంచి 8 నెలల సమయం పడుతుందని అక్కడి న్యాయవాదులు పార్టీ నేతలకు వివరించారు. ఈ విషయంలో దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు సహకరించారు. ఈ సందర్భంగా కె.కె.మహేందర్‌రెడ్డి జైల్లో ఉన్న ఖైదీలతో కూడా మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. జైల్లో మగ్గుతున్న వారి కుటుంబీకులు సీఎం, ప్రధాని కార్యాలయాలను ఎన్నిసార్లు సంప్రదించినా ఈ విషయంలో ప్రయోజనం లేక పోయింది. సంక్షేమనిధి నుంచి వీరికి సాయం అందించాల్సిందిగా న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదు. నిరాశలో ఉన్న కుటుంబాల్లో ఈ ప్రయత్నాలు ఆశలను రేకెత్తించాయి.
Share this article :

0 comments: