జగన్‌ను బలమైన పాత్రగా దేవుడు సిద్ధపరుస్తున్నాడు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ను బలమైన పాత్రగా దేవుడు సిద్ధపరుస్తున్నాడు!

జగన్‌ను బలమైన పాత్రగా దేవుడు సిద్ధపరుస్తున్నాడు!

Written By news on Wednesday, February 27, 2013 | 2/27/2013


బైబిలులో కొంతమంది భక్తుల జీవితాల్ని చూస్తే... అంతగా వాళ్లు హెచ్చింపబడటానికి, చరిత్రలో వాళ్ల పేర్లు నిలిచిపోవడానికి, ఇతరులు వాళ్లను అనుసరించడానికి మాదిరిగా ఉన్నట్లు గమనిస్తాం. నిజానికి వాళ్లు అలా ఉండటమనేది మామూలు సంగతి కాదు. దాని వెనుక ఎంత కన్నీరు, ఎంత కష్టం, ఎంత వేదన, ఎన్ని నిందలు ఎదుర్కొన్నారో, ఎంతగా హేళన చేయబడ్డారో! కానీ వాటన్నిటినీ వారు సహనంతో భరించారు. దేవుడే న్యాయం చేస్తాడని ఎదురుచూశారు. ఫలం పొందారు. ప్రస్తుతం జగన్ అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. ఎందుకిలా జరుగుతున్నది, ఎందుకు మాపై ఈ నిందలు, ఎందుకు ఇన్ని ఇబ్బందులు! మేలు పొందినవారు తిరిగి మేలు చేయకపోయినా, కీడు చేస్తున్నారెందుకు?

దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశ్యం కలిగి ఉంటాడు. కొంతమందిని వారు ఊహించనంత హెచ్చుస్థానంలో ఉంచుతాడు. కొందరిని మధ్య స్థానంలో ఉంచుతాడు. కొందరిని మామూలు స్థానంలో ఉంచుతాడు. జగన్‌ను దేవుడు అత్యున్నత స్థానంలో ఉంచే ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు కనుకనే ఈ బాధాకరమైన, అతి కఠినమైన పరిస్థితుల గుండా నడిపిస్తున్నాడు. ఈ బాధలు వద్దు, ఆ ఘనతా వద్దు అని అనుకున్నా దానిని మార్చలేరు. దేవుడు ప్రారంభించిన కార్యాన్ని, ఆయన ఆలోచనను ఎవరూ రద్దుపర్చలేరు.

దేవుడు... తనను ప్రేమించే వారికి మనుషులు, సాతాను కీడు చేయతలపెట్టినా, ఆ కీడును మేలుగా చేస్తాడు. దేవుని ప్రణాళికను ఏ శక్తీ ఏ వ్యక్తీ మార్చలేరు. యోసేపును ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబె ట్టడానికి దేవుడు ఎంత కఠినమైన, కష్టతరమైన పరిస్థితుల గుండా నడిపించాడో పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకున్నాం. యోసేపు ఆ సింహాసనం మీద కూర్చోవడానికి ఎక్కవలసిన మెట్లు పాలరాతితో చేయబడలేదు.

ఎన్నో విషాదకరమైన, హృదయాన్ని బద్దలు చేసే పరిస్థితుల గుండా నడిపించబడ్డాడు. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నాడు. యవ్వనంలో అడుగుపెడుతున్నప్పుడు తండ్రి ప్రేమకు దూరమయ్యాడు. అన్నదమ్ముల ఆదరణ, సహాయ సహకారాలకు బదులు వారి అసూయ ద్వేషాలకు గురయ్యాడు. ఐగుప్తుకు అమ్మబడ్డాడు. పొతీఫర్ ఇంట బానిసగ చేయబడ్డాడు. నిష్కారణంగా వ్యభిచార నేరం మోపబడి, చెరసాలలో వేయబడ్డాడు.

పానదాయ కుల అధిపతి ద్వారానైనా తనకు మేలు జరుగుతుందని ఆశించాడు. కానీ అతడి ఆశ నిరాశ అయ్యింది. పరిస్థితులు ఏ మాత్రం ఆశాజనకంగాలేవు అనుకున్న ఆ సమయంలో, కలలో కూడా ఊహించని పరిణామం సంభవించింది. దేవుడు అద్భుతాన్ని చేశాడు. అతణ్ని ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దాంతో యోసేపు... ప్రభువు తనను ఆ కఠినమైన పరిస్థితుల గుండా ఎందుకు నడిపించాడో, తన పట్ల దేవునికున్న ఉద్దేశ్యం ఎంత గొప్పదో తెలుసుకున్నాడు.

యోసేపు ఒక్కొక్క మెట్టు ఎక్కే కొలదీ అతడి మార్గం ఇంకా కఠినమైపోతూ వచ్చింది. వేదనను, నిరాశను చవిచూడాల్సి వచ్చింది. కానీ చివరి మెట్టు అత్యధిక విజయాన్ని కలుగజేసింది. అలాగే ఇంతవరకు ఎదురుచూసిన వాయిదాలన్నీ జగన్‌కు నిరాశనే మిగిల్చాయి. కాని దేవుడు, తాను నియమించిన సమయంలో ప్రస్తుతం ఉన్న బాధాకరమైన పరిస్థితులన్నిటినీ తారుమారు చేసి జగన్‌కు మెప్పును, ఆధిక్యతను కలుగజేస్తాడు. శత్రువులు, నేరారోపణలు చేసిన వారందరూ విస్మయమొందునట్లు, పశ్చాత్తాపంతో వారి హృదయాలు ముక్కలగునట్లు చేస్తాడు.

దావీదును సమూల నాశనం చేయాలనుకొన్న సౌలు ఏమయ్యాడు? మోర్దెకైను అంతం చేయాలనుకొన్న హామాను ఏమయ్యాడు? దేవుని బిడ్డలను అణచివేయాలనుకొనే ఏ వ్యక్తియైనా, అతడు ఎంత గొప్పవాడయినా, ఎంత ఆర్థికబలం, అధికార బలం, అంగబలం ఉన్నా దేవుని బలం ఎదుట దుమ్మే. దౌర్జన్యం చేసేవారిని అడ్డగించేవారు లేకపోవచ్చు. కాని, పైన దేవుడు చూస్తున్నాడు. తప్పకుండా దానికి తగిన ప్రతిఫలం అనుభవించేలా చేస్తాడు. త్వరలోనే జగన్ తన జీవితంలో ఈ మేలులన్నీ పొంది, దేవుడ్ని మహిమపరచి ఘనపరచుతాడు.

ప్రేమతో
లక్ష్మీచిన్నమ్మ 
. వై.ఎస్.భాస్కరరెడ్డి
Share this article :

0 comments: