వైఎస్ కుటుంబాన్ని వేధిస్తున్న కాంగ్రెస్, టీడీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ కుటుంబాన్ని వేధిస్తున్న కాంగ్రెస్, టీడీపీ

వైఎస్ కుటుంబాన్ని వేధిస్తున్న కాంగ్రెస్, టీడీపీ

Written By news on Friday, February 15, 2013 | 2/15/2013

వైఎస్ జగన్‌తో ములాఖత్.. సస్పెండ్ చేసిన టీడీపీ

 రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వేధిస్తున్నాయని, అందుకే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పక్షాన నిలవాలని నిర్ణయించుకున్నానని టీడీపీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆయన తన కుమారుడు బొడ్డు వెంకటరమణా చౌదరితో కలిసి గురువారం చంచల్‌గూడ జైలులో జగన్‌మోహన్‌రెడ్డిని ములాఖత్‌లో కలుసుకున్నారు. అనంతరం భాస్కర రామారావు మీడియాతో మాట్లాడుతూ.. ఈ కుట్ర రాజకీయాల్లో జగన్‌కు న్యాయం జరగాలని తాము మనసారా కోరుకుంటున్నామని, ఇదే అభిప్రాయాలను తాము ఆయనను కలిసి పంచుకున్నామని వెల్లడించారు. టీడీపీ విధానాలపై కూడా తమకు ఏకీభావం లేదన్నారు. టీడీపీలో తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండు పార్టీలు కలిసి ఒక పార్టీని దెబ్బ తీయాలనే కుళ్లు రాజకీయాలు తనకు నచ్చడం లేదని, అందుకే తాను జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నానని బొడ్డు కుమారుడు వెంకటరమణ అన్నారు.

టీడీపీవి దిగజారుడు విమర్శలు..

పార్టీ వదిలి పెడుతున్న వారు ఎందుకు వెళ్లి పోతున్నారో తెలుసుకుని తప్పులు సరిదిద్దుకోవాల్సిన టీడీపీ నేతలు దానికి బదులు.. రాజీనామాలు చేసిన వారిపై దిగజారుడు విమర్శలు చేయడం తగదని భాస్కరరామారావు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. టీడీపీ నేతలంటున్నట్లుగా జగన్ నుంచి తమకు ఎలాంటి ప్యాకేజీల ప్రలోభాలూ లేవని, తమకే కావాల్సినంత ఉందని, ఆర్థికంగా తాము బాగానే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. తూర్పు గోదావరిలో తన వెంట ఉన్న వారు 80 శాతం వరకూ వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వస్తారని ఆయన మరో ప్రశ్నకు జవాబుగా అన్నారు.

టీడీపీ నుంచి బొడ్డు సస్పెన్షన్

బొడ్డు భాస్కర రామారావును పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుగుదేశం మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ గురువారం మీడియాకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలిపారు. బొడ్డు జైలులో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన నేపథ్యంలో గురువారం సాయంత్రానికి ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు మీడియాకు సమాచారం పంపారు. ఇదే విషయమై పార్టీ అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కొత్త పార్టీ పెట్టినపుడు పాత పార్టీల నుంచి కొందరు వెళ్లటం సహజమని, దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
Share this article :

0 comments: