కేవలం ఫైన్‌లు వేస్తూ, వసూళ్లు చేసుకోవడంపైనే... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేవలం ఫైన్‌లు వేస్తూ, వసూళ్లు చేసుకోవడంపైనే...

కేవలం ఫైన్‌లు వేస్తూ, వసూళ్లు చేసుకోవడంపైనే...

Written By news on Saturday, February 23, 2013 | 2/23/2013

ఉగ్రవాదుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం
కేంద్రంలో ఎన్‌ఐఏ, రాష్ట్రంలో ఆక్టోపస్ ఏం చేస్తున్నాయి?
దాడులపై కచ్చితమైన సమాచారాన్ని ఎందుకు రాబట్టలేకపోతున్నారు

 ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే ఎలాంటి చర్యలకైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని ఆ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఉగ్రవాదులు మారణకాండకు తెగబడుతూ రెచ్చిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుణపాఠం నేర్చుకోవడం లేదన్నారు. తీవ్రవాదుల ఘాతుకాల నుంచి ప్రజలను రక్షించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయని విమర్శించారు. ‘‘ముంబై ఘటన తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ సంస్థ ఉగ్రవాద కదలికలపై ముందే పసిగట్టి అవాంఛిత ఘటనలను నిరోధించాలి. అయితే ఇప్పటిదాకా ఎన్‌ఐఏ సమర్థంగా పనిచేసిన దాఖలాలు ఒక్కటీ లేవు. ఉగ్రవాద నిర్మూలన కోసం రాష్ట్రంలో ‘అక్టోపస్’ను ఏర్పాటు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉంది’’ అని అన్నారు. కేంద్ర హోంమంత్రిగా సుశీల్‌కుమార్ షిండే అనర్హుడని మైసూరారెడ్డి మండిపడ్డారు. నిర్దిష్ట సమాచారం ఇవ్వకుండా కంటి తుడుపు చర్యల మాదిరి అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశామని చెప్పడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ‘‘కేంద్రం అధీనంలో ఎన్‌ఐఏ, ఐబీ, రా వంటి అత్యున్నత సంస్థలు ఉన్నప్పటికీ కచ్చితమైన సమాచారం ఎందుకు రాబట్టలేకపోతున్నారు? నిర్దిష్ట సమాచారం రాష్ట్రాలకు ఎందుకు అందజేయలేకపోతున్నారు?’’ అని ప్రశ్నించారు.

సీఎం ఏం చర్య తీసుకున్నారు: దాడులు జరగొచ్చని రెండ్రోజుల ముందే కేంద్రం నుంచి సమాచారం వస్తే ముఖ్యమంత్రి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని మైసూరా డిమాండ్ చేశారు. సీఎం అధీనంలో ఉండే ఆక్టోపస్‌ను సమావేశపరిచి ఏమైనా అప్రమత్తం చేశారా అని ప్రశ్నించారు. నగర కమిషనర్ అనురాగ్‌శర్మ దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతానికి వెళ్లొచ్చిన కొద్దిసేపటికే జంట పేలుళ్లు జరిగాయంటే భద్రతాలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు. రాష్ట్ర పోలీసులు కేవలం ఫైన్‌లు వేస్తూ, వసూళ్లు చేసుకోవడంపైనే నిమగ్నమయ్యారని విమర్శించారు.

క్షతగాత్రులను ఆదుకునేందుకు సిద్ధం...

పేలుళ్ల కారణంగా క్షతగాత్రులైన వారిని ఆదుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రక్తదానం అవసరమైతే 9849032888, 9652278978 ఫోన్ నంబర్లలో సంప్రదించాల్సిందిగా ఆయన సూచించారు.
Share this article :

0 comments: