జగన్‌ను విచారణ పేరుతో 9 నెలలు జైల్లో పెట్టడం హక్కులను హరించడమే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ను విచారణ పేరుతో 9 నెలలు జైల్లో పెట్టడం హక్కులను హరించడమే

జగన్‌ను విచారణ పేరుతో 9 నెలలు జైల్లో పెట్టడం హక్కులను హరించడమే

Written By news on Saturday, March 2, 2013 | 3/02/2013

అమలాపురం (తూర్పుగోదావరి): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి తొమ్మిది నెలలుగా జైల్లో ఉంచడం ద్వారా ఆయన హక్కులను హరిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌ను జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) విచారణకు స్వీకరించింది. అమలాపురానికి చెందిన ప్రముఖ న్యాయవాది కుడుపూడి అశోక్ గత నెల 18న ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ 261/1/7/2013 కింద కేసు ఫైల్ నంబర్ జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను అశోక్ శుక్రవారం ఇక్కడ మీడియాకు వివరించారు. ‘‘జగన్ సంస్థల్లోకి క్విడ్‌ప్రోకో కింద పెట్టుబడులు వచ్చాయని ఆరోపిస్తూ 2011 ఆగస్టు 10న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తెలుగుదేశం పార్టీకి చెందిన దివంగత నేత ఎర్రన్నాయుడు అందులో ఇంప్లీడ్ అయ్యారు. 

పిటిషన్ దాఖలైన వారంలోనే హైకోర్టు ప్రాథమిక విచారణకు సీబీఐని ఆదేశించింది. జగన్‌తోపాటు 73 మందిపై సీబీఐ 120/బి, 409, 420, 477ఎ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. సీబీఐ గత ఏడాది మే 27న జగన్‌ను విచారణకు పిలిపించి, 29న అరెస్టు చేసింది. ప్రాథమిక న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఈ అరెస్టు జరిగింది. అప్పటి నుంచి తొమ్మిది నెలలుగా ఉద్దేశపూర్వకంగా ఫైనల్ చార్జిషీటు దాఖలు చేయకుండా జాప్యం చేస్తున్నారు. తద్వారా జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు’’ అని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 22, 32 ప్రకారం ఏ వ్యక్తినీ విచారణ పేరుతో నెలలు, ఏళ్ల తరబడి జైలులో ఉంచడానికి వీల్లేదని, అలా చేయడం మానవ హక్కులను హరించడమేనని తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు అశోక్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఫైనల్ చార్జిషీటు దాఖలు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించాలని, తద్వారా జగన్‌కు బెయిల్ వచ్చే అవకాశం కల్పించాలని పిటిషన్‌లో కోరానన్నారు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను ప్రతివాదిగా పేర్కొన్న ఈ పిటిషన్‌ను ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణకు స్వీకరించిందని తెలిపారు.
Share this article :

0 comments: