9 గంటల ఉచితమేదీ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 9 గంటల ఉచితమేదీ!

9 గంటల ఉచితమేదీ!

Written By ysrcongress on Tuesday, March 19, 2013 | 3/19/2013


రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌పై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. 2013-14 చివరి బడ్జెట్‌లోనూ ఈ ప్రస్తావన లేనేలేదు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ను ఇస్తామని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఐదేళ్ల కాలంలో ఎప్పుడైనా ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే చివరి బడ్జెట్‌లోనూ 9 గంటల విద్యుత్ మాట ఎత్తకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 9 గంటల ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం పూర్తిగా మరచిపోయినట్టేనని అంటున్నారు. వాస్తవానికి 7 గంటల ఉచిత విద్యుత్ అంటున్నా ప్రస్తుతం కేవలం 3-4 గంటలు మాత్రమే సరఫరా అవుతోంది. ఇలావుండగా వ్యవసాయ, ఇతర వినియోగదారులకు ఇస్తున్న సబ్సిడీకిగానూ 2012-13 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.5,500 కోట్లను కేటాయించింది. సవరించిన అంచనాల్లో ఇది రూ.6,200 కోట్లకు చేరింది. అయితే 2013-14 బడ్జెట్‌లో మాత్రం ఈ మొత్తాన్ని కేవలం రూ.5,700 కోట్లకే ప్రభుత్వం పరిమితం చేసింది. అంటే గత ఏడాదితో పోలిస్తే రూ.500 కోట్ల మేరకు బడ్జెట్ కేటాయింపులు తగ్గాయన్నమాట. 

అంటే రానున్న రోజుల్లో విద్యుత్ కోతలు మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉందన్నమాట. అదేవిధంగా ఇందిరమ్మ గృహాలకు విద్యుద్దీకరణ కోసం కేటాయింపులను సగానికి తగ్గించింది. 2012-13లో రూ.15 కోట్లను కేటాయించగా ఈ బడ్జెట్‌లో రూ.7.5 కోట్లకు తగ్గించింది. మరోవైపు జెన్‌కో నిర్మిస్తున్న 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు విద్యుత్ ప్లాంట్లకు (విజయవాడ, కృష్ణపట్నం, కొత్తగూడెం) ఈక్విటీ రూపంలో మొత్తం వెయ్యి కోట్లు ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన సీఎం 2013-14 బడ్జెట్‌లో రూ.480 కోట్లు ఇస్తామని చెప్పారు. కానీ మాట నిలుపుకోలేకపోయారు. కేవలం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఫలితంగా జెన్‌కో రుణాలపైనే ఆధారపడాల్సి రానుంది. ఇది ప్రజలకు మరింత భారంగా పరిణమించనుంది. ఇప్పటికే విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజానీకానికీ ఈ బడ్జెట్ ఏ మాత్రమూ సాంత్వన ఇచ్చే విధంగా లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

తగ్గిన కేటాయింపులు

2013-14 బడ్జెట్‌లో ఇంధనశాఖకు ప్రభుత్వం రూ.7,117.57 కోట్లను కేటాయించింది. ఇందులో ప్రణాళికేతర వ్యయం రూ.6,542.61 కోట్లు కాగా, ప్రణాళిక వ్యయం రూ.574.96 కోట్లు మాత్రమే. గత ఏడాది రూ.6,632.02 కోట్లను కేటాయించింది. మొత్తం మీద కేటాయింపులు పెరిగినట్టు కనిపిస్తున్నా శాతాల్లో లెక్కిస్తే మాత్రం కేటాయింపులు తగ్గాయి. 2012-13లో మొత్తం బడ్జెట్‌లో ఇంధనశాఖకు 4.74 శాతం నిధులు కేటాయించగా... వచ్చే ఏడాదికి ఈ కేటాయింపులు 4.41 శాతానికి తగ్గిపోయాయి. 

చేనేత బతుకు బుగ్గే..!

చేనేత కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిన నేపథ్యంలో వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొండిచేయి చూపింది. బడ్జెట్‌లో కేవలం రూ.19 కోట్లను మాత్రమే కేటాయించింది. ఇప్పటికే చేనేతకు పావలావడ్డీ బకాయిలు రూ.9 కోట్ల మేర పేరుకుపోయాయి. అంటే ఇందులో రూ.9 కోట్లు పాత బకాయిలకే సరిపోతాయన్నమాట. మరమగ్గాలకు విద్యుత్ సబ్సిడీ బకాయిలు రూ.20 కోట్లకు చేరుకున్నా.. గత రెండేళ్ల మాదిరిగానే ఈ బడ్జెట్‌లోనూ మొండిచేయే చూపి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. చేనేత కార్మికులు, సంఘాలకు రుణాలు విరివిగా ఇచ్చేందుకు వీలుగా రూ.200 కోట్లతో చేనేత బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం స్వయంగా ప్రకటించారు. అయితే, బడ్జెట్లో ఎక్కడా బ్యాంక్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
Share this article :

0 comments: