మీ పాలన తెస్తానని చెప్పగలరా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీ పాలన తెస్తానని చెప్పగలరా?

మీ పాలన తెస్తానని చెప్పగలరా?

Written By news on Friday, March 1, 2013 | 3/01/2013

అవిశ్వాసం అనే ఆయుధాన్ని పక్కనబెట్టి చంద్రబాబు నాటకాలాడుతున్నారు
రాజులా బతికిన రైతన్నలు మీ పాలనలో పొట్టపట్టుకొని వలసలు పోయారు
పూటగడవక కిడ్నీలు అమ్ముకున్నారు
వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు
స్కాలర్‌షిప్‌లు అడిగినందుకు విద్యార్థులను లాఠీలతో కొట్టించారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 77, కిలోమీటర్లు: 1,085.2

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘పొలాన్ని నమ్మి, దుక్కి దున్ని నలుగురికి అన్నం పెట్టి రాజులా బతికిన రైతన్నలు చంద్రబాబు హయాంలో కుదేలైపోయారు. పూట గడవక వందలాది మంది కిడ్నీలు అమ్ముకున్నారు... వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.. లక్షల మంది పొట్టకూటి కోసం వలసలు పోయి ముంబైలాంటి మహానగరాల్లో రోడ్డు పక్కన ప్లాట్‌ఫాం మీద బతుకులు వెళ్లదీశారు. అంత ఘోరంగా ఉండేది ఆయన పాలన. ఆపరిపాలన రైతులకు, పేదలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, మైనార్టీలకు, బీసీలకు, దళితులకు మేలు చేసింది అని అనుకుంటే.. మీ తొమ్మిదేళ్ల పాలన మళ్లీ తెస్తానని ధైర్యంగా చెప్పుకుంటూ ప్రజల మధ్య తిరుగగలరా చంద్రబాబు నాయుడు గారూ...?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సూటిగా ప్రశ్నించారు. బాబుకు ఆ ధైర్యం లేదు.. అందుకే అలా చెప్పుకోలేరని అన్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంతో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో సాగింది. పిడుగురాళ్ల మండల కేంద్రంలో భారీఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

పచ్చని పల్లెలను శ్మశానాలుగా మార్చారు...

చంద్రబాబు హయాంలో విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు ఇవ్వమని అడిగితే వాళ్లను లాఠీలతో కొట్టించారు. పేద విద్యార్థులకు కనీసం మెస్ చార్జీలు పెంచలేదు. రోగమొచ్చి పేదోళ్లు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ కూడా యూజర్ చార్జీలు వసూలు చేసిన దుర్మార్గపు పాలన మీది. దేశానికి అన్నం పెట్టిన రైతన్నల వెన్ను మీద కొట్టారు. కరెంటు చార్జీలు పెంచి వాటిని వసూలు చేయడానికి ప్రత్యేక పోలీసు స్టేషన్లు పెట్టి రైతులను చిత్రహింసలు పెట్టారు. మీరు పెట్టిన అవమానం భరించలేక నాలుగు వేల మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. గీత పనివాళ్లు.. చేనేత కార్మికులు.. అందరూ తల్లడిల్లిపోయారు. ఎరువులు, గ్యాస్‌పై సబ్సిడీ ఇవ్వమని అడిగితే... సబ్సిడీ ఇస్తే ప్రజలు సోమరిపోతులు అయిపోతారని చెప్పిన ఘనులు మీరు. పచ్చగా బతికిన పల్లెలను మీ పాలనతో శ్మశానాలుగా మార్చారు. అంత ఘోరంగా ఉండేది మీ పరిపాలన. ఈ రోజేమో అవే పల్లెల వెంట తిరుగుతూ మళ్లీ నాకు అధికారం ఇవ్వండి.. ఆరు నెలల్లో రాష్ట్రాన్ని గాడిన పెడతా అంటున్నారు.
సాగర్ ఎండబెట్టిన పాపం మీది కాదా?

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి, నారాయణపూర్ డ్యాంల ఎత్తు పెంచి కట్టుకుంది. ఈ నిర్మాణాలు పూర్తై మన రాష్ట్రానికి నీళ్లు రాక పంట పొలాలు ఎండిపోతాయని, అదే జరిగితే చరిత్ర హీనుడిగా మిగిలిపోతావని ఆనాడు వైఎస్సార్ ఎంత చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదు. వ్యవసాయమే దండగన్నారు. బాబు నిద్రపోతుంటే కర్ణాటక ప్రభుత్వం రెండు డ్యాంల నిర్మాణాలను పూర్తి చేసింది. మహారాష్ర్ట ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టుకుంది. అందుకే ఈ రోజు మనకు కృష్ణా జలాలు రాకుండా పోయాయి. సాగర్ ఆయకట్టు అంతా ఎండిపోయింది. ఇవాళ సాగర్ ఆయకట్టును ఎండబెట్టిన పాపం మీది కాదా?

మా ప్రాణాలకు కిరణ్ బాధ్యత వహిస్తారా..

ఇవాళ కరెంటు సమస్య యావత్తు రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతోంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం వల్ల, ముందుచూపు లేకపోవడం వల్ల రాష్ట్రంలో కరెంటు సంక్షోభం ఏర్పడింది. వైఎస్సార్ వ్యవసాయం కోసం ఏడు గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చారు. ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్పుడు కూడా భవిష్యత్తులో చార్జీలు పెంచబోనని హామీ ఇచ్చారు. మరి ఇవాళ వైఎస్సార్ రెక్కల కష్టం మీద వచ్చిన ఈ సర్కారు ఏం చేస్తోంది? పొద్దున రచ్చబండలో ఓ రైతన్న ‘అమ్మా... ఈ ప్రభుత్వం రైతులకు రోజుకు మూడు గంటలు కరెంటు ఇస్తుంది. అది కూడా ఎప్పుడొస్తుందో ఎవ్వరూ చెప్పలేరూ.. వీళ్లు కరెంటు ఎప్పుడిస్తారా? మోటారు ఎప్పుడు వేసుకోవాలా అని కుటుంబంలోని ఒక వ్యక్తి ఎప్పుడూ మోటారు దగ్గర కాపు కాచుకొని కూర్చోవాలమ్మా’ అని చెప్పాడు. ‘అది చిమ్మ చీకటైనా కావచ్చు.. అర్ధరాత్రి అయినా కావచ్చు.. ఆ టైంలో ఆ ప్రాణానికి ఏమైనా హాని జరిగితే ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా అమ్మా..’ అని అడిగాడు.

డైలాగులు ఎందుకు బాబూ...

కరెంటు ఇవ్వని ఈ ప్రభుత్వం బిల్లులు మాత్రం రెండు, మూడు రెట్లు పెంచింది. చార్జీలనీ.. వాటికి సర్‌చార్జీలని ప్రజల నుంచి రూ. 32 వేల కోట్లు వసూలు చేస్తోంది. ఈ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకొని నిలదీయాల్సిన చంద్రబాబునాయుడేమో.. పొద్దున లేచింది మొదలు జగనన్నను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తప్ప మరోటి చేయడం లేదు. అవిశ్వాసం అనే ఆయుధం తన వద్ద పెట్టుకొని... దాన్ని పక్కనబెట్టి, కత్తులు, గొడ్డళ్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీని తుదముట్టించాలని ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారూ.. ఎందుకు ఈ డైలాగులు, డ్రామాలు అని అడుగుతున్నా... అని షర్మిల ప్రశ్నించారు.

గురువారం 77వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పందిరివారిపాలెం శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి జానపాడు మీదుగా పిడుగురాళ్ల మండల కేంద్రానికి చేరింది. పిడుగురాళ్ల శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 12.3 కి.మీ. దూరం ప్రయాణించారు. ఇప్పటివరకు మొత్తం 1,085.2 కి.మీ. యాత్ర పూర్తయ్యింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పాదయాత్ర బస కేంద్రంలో షర్మిలతో గడిపారు. షర్మిల వెంట నడిచిన నేతల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరిత, భూమన కరుణాకర్‌రెడ్డి, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, ఆర్‌కే, అంబటి రాంబాబు, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, పి.గౌతంరెడ్డి, నన్నపనేని సుధ, బండారు సాయిబాబు మాదిగ తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: