ఏసీల్లో కాదు.. గ్రామాల్లోకి రండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏసీల్లో కాదు.. గ్రామాల్లోకి రండి

ఏసీల్లో కాదు.. గ్రామాల్లోకి రండి

Written By ysrcongress on Sunday, March 17, 2013 | 3/17/2013


* 24 గంటలూ కరెంటుపోని ఏసీ గదుల్లో ఉండే సీఎంకు, మంత్రులకు ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి?
* సరిగ్గా నీరు, కరెంటు అందక, పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నారు
* తాగడానికి నీళ్లు లేక మహిళలు, చదువుపై భరోసా లేక విద్యార్థులు అల్లాడుతున్నారు
* విద్యుత్ కోతలతో లక్షల్లో కార్మికులు రోడ్డున పడుతున్నారు
* వీరినడిగితే.. ఎందుకు అవిశ్వాసం పెట్టామో చెప్తారు
* పాదయాత్రలో ప్రజల కష్టాలు కళ్లారా చూసి కూడా చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు
15 మంది ఎమ్మెల్యేలకు వందనం..

‘‘అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి కలిసి గీసిన గీతను చెరిపేస్తూ 15 మంది ఎమ్మెల్యేలు తాము ప్రజల పక్షమని చెప్తూ, అవిశ్వాసానికి మద్దతు ఇచ్చి వారి ధైర్యాన్ని చాటుకున్నారు. వారందరికీ వందనం. ప్రజల కోసం తపిస్తూ ఆ 15 మంది ఎమ్మెల్యేలూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు.’’
- షర్మిల

కాబోయే సీఎంను ప్రజలు నిర్ణయించుకున్నారు..

‘‘అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎంత కుమ్మక్కై కుట్రలు పన్నినా అది ఎక్కువ రోజులు సాగదు. కాంగ్రెస్, టీడీపీలు మట్టికొట్టుకుపోయే రోజు త్వరలోనే వస్తుంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు కావాలనేది ఈపాటికే ప్రజలు నిర్ణయించుకున్నారు. అది జగనన్నేనని నిశ్చయించుకున్నారు. వైఎస్సార్ వారసుడిగా రాజన్న కల, ఆశయాలు జగన్ నెరవేరుస్తారని ప్రజల సాక్షిగా మాటిస్తున్నాం. రాజన్న రాజ్యం సాధించే రోజు ఎంతో దూరంలో లేదు. అంతవరకూ వైఎస్సార్ కాంగ్రెస్‌తో ప్రజలందరూ కలిసి కదంతొక్కాలని మా ప్రార్థన.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం ఎందుకు పెట్టిందో అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మొన్న అసెంబ్లీలో అన్నారట. ఇరవై నాలుగ్గంటలూ కరెంటు పోని ఏసీ గదుల్లో గడిపే సీఎంకు, మంత్రులకు ప్రజల కష్టాలు ఎలా అర్థమవుతాయి? ఏసీ గదులు వదిలేసి ఒక్కసారి గ్రామాల్లోకి రండి సీఎంగారూ.. వచ్చి ప్రజల బాధలను చూడండి.. అప్పుడు వైఎస్సార్ సీపీ అవిశ్వాసం ఎందుకు పెట్టిందో ప్రజలే మీకు అర్థమయ్యేలా చెప్తారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. ముఖ్యమంత్రికి హితవు పలికారు. ప్రజల సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కయి ప్రజల్ని గాలికొదిలేసిన టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం గుంటూరు జిల్లా గుంటూరు, పొన్నూరు నియోజకవర్గాల్లో సాగింది. చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామంలో అశేష జనవాహినిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

ప్రజల మాటలు అర్థం కాకుంటే సీఎం అనర్హుడే..

‘‘సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గ్రామాల్లోకి వచ్చి అడిగితే.. ప్రజలే చెప్తారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం ఎందుకు పెట్టిందో! గ్రామాల్లోని రైతులను అడగండి... సరిగ్గా నీరు, కరెంటు అందక, పంటలు ఎండిపోయి దిగుబడి రాక, చేతికొచ్చిన కొద్దిపాటి పంటకూ గిట్టుబాటు ధర దక్కక, పంట వేసిన ప్రతిసారీ అప్పుల పాలవుతున్న తమ తరఫున వైఎస్సార్ సీపీ అవిశ్వాసం పెట్టిందని చెప్తారు. పల్లెల్లో మహిళలను అడగండి.. రోజూ కూలికి వెళ్లినా మూడు పూట్లా తినడానికి సరిపడా డబ్బులు అందక, తాగడానికి గుక్కెడు మంచినీళ్లు లేక అల్లాడుతున్న తమ తరఫున అవిశ్వాసం పెట్టారని చెప్తారు. రాష్ట్రంలోని విద్యార్థుల వద్దకెళ్లండి.. చదువుకోవాలని ఎంతో ఆశగా ఉన్నా తమ తల్లిదండ్రులకు చదివించే స్తోమత లేక, మునుపటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం లాగా ఉచిత చదువులు చదివించే భరోసా లేక అల్లాడుతున్న తమ తరఫున వైఎస్సార్ సీపీ అవిశ్వాసం పెట్టిందని చెప్తారు. గ్రామాల్లోకి వచ్చే తీరిక లేకుంటే హైదరాబాద్ పరిసరాల్లోని పరిశ్రమలకెళ్లి కార్మికులను అడిగితే అవిశ్వాసం ఎందుకు పెట్టారో చెప్తారు. రాష్ట్రంలో అంధకారం నెలకొంది. నెలకు 12 రోజులు పరిశ్రమలకు విద్యుత్ కోతలు. దీంతో వేలకొద్దీ కర్మాగారాలు, పరిశ్రమలు మూతబడి ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్న లక్షల మంది కార్మికులను అడగండి.. తమ తరఫున అవిశ్వాసం పెట్టారని వారే చెప్తారు. వీరు చెప్పిన మాటలు, తాను చెవులారా విన్న మాటలు కూడా కిరణ్‌కుమార్‌రెడ్డికి అర్థం కాకుంటే ఆ కుర్చీకి ఆయన అనర్హుడనే అర్థం చేసుకోవాలి.

ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు: 

అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇతర పక్షాలతో కలిసి ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెడితే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతు పలికారు. పాదయాత్రలో రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూసి కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపకుండా ప్రభుత్వానికి అండగా నిలిచారు. ప్రజల పక్షాన నిలవాల్సిన ప్రతిపక్షం, పాలక పక్షానికి కొమ్ముకాసింది. దుర్మార్గపు పాలన సాగిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు చంద్రబాబు అండగా నిలబడి సర్కారు పడిపోకుండా కాపాడారు. చంద్రబాబు ఒకప్పుడు సొంత మామను వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, పార్టీని లాగేసుకున్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం సాక్షిగా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారు.

టీడీపీ, కాంగ్రెస్ పండుగ చేసుకుంటున్నాయి..

అసెంబ్లీలో అవిశ్వాసం తీర్మానం వీగిపోవడంతో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పండుగ చేసుకుంటున్నాయి. కానీ రాష్ట్రంలో ప్రజలందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అధికార, ప్రతిపక్ష కుట్రలు, కుమ్మక్కులు చూసి ప్రజాస్వామ్యం కన్నీరు పెట్టుకుంటోంది. ఇదే కుట్రలు, కుతంత్రాలు, స్వార్థ రాజకీయాలతో అమాయకుడైన జగనన్నను జైల్లో పెట్టారు. అధికారం వారి వద్ద ఉందని సీబీఐని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు. అధర్మానికి ఆయుష్షు తక్కువ. జగనన్న ఏ తప్పూ చేయలేదు కనుక గర్వంగా చెప్తున్నాం. త్వరలోనే జగనన్న తిరిగివస్తారు. రాజన్న రాజ్యం వైపు నడిపిస్తారు. ఈ కుట్రలు ఎంతో కాలం నిలవవు.’’

14.2 కిలోమీటర్ల యాత్ర..

పాదయాత్ర 92వ రోజైన శనివారం షర్మిల 14.2 కిలోమీటర్లు నడిచారు. గుంటూరు నగరం శివారు సంగడిగుంట నుంచి యాత్ర ప్రారంభించి బుడంపాడు, నారాకోడూరు, వేజెండ్ల మీదుగా యాత్ర చేశారు. వేజండ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన 15 అడుగుల వైఎస్ భారీ విగ్రహాన్ని చూసి షర్మిల ముగ్ధురాలయ్యారు. వేజండ్ల గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. ప్రత్యర్థి పార్టీలకు పట్టున్న గ్రామాలుగా చెప్పుకుంటున్న చోట కూడా షర్మిల యాత్రకు అపూర్వ ఆదరణ లభించింది. శనివారం నాటి యాత్రలో పార్టీ నేతలు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, మర్రి రాజశేఖర్, గౌతం రెడ్డి, ముదునూరి ప్రసాదరాజు, తలశిల రఘురాం, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నేతలు రావి వెంకటరమణ, లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్, దేవళ్ల రేవతి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: