కేసుల నుంచి బయటపడేందుకే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేసుల నుంచి బయటపడేందుకే..

కేసుల నుంచి బయటపడేందుకే..

Written By news on Saturday, March 16, 2013 | 3/16/2013


అవినీతి కేసుల నుంచి బయటపడేందుకే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించేందుకు సిద్ధమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా కూల్చే అవకాశం ఉన్నా.. కేసుల దృష్ట్యానే టీడీపీ దానిని వ్యతిరేకించాలని నిర్ణయించుకుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వీగిపోవడానికి చేయూత నివ్వడం ద్వారా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన అన్యాయం తలపెట్టారని విమర్శించారు. శుక్రవారం సాక్షితో మాట్లాడుతూ.. గడచిన నాలుగేళ్లలో విద్యుత్ చార్జీల పెంపు, సర్దుబాటు పేరిట రూ.32 వేల కోట్ల మేరప్రజలపై భారం వేసిన ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు తన భుజాలపై ఎత్తుకుని రక్షించారని బాలినేని చెప్పారు. ఎడాపెడా ఎరువుల ధరలు పెంచి రైతుల నడ్డి విరిచిన ప్రభుత్వాన్ని ఆయన వెనకేసుకొచ్చారన్నారు. 

నాలుగేళ్లలో ఎరువుల ధరలు పెంచడం ద్వారా రాష్ట్ర రైతులపై సుమారు రూ.15 వేల కోట్ల భారం పడిందని తెలిపారు. సుమారు రూ.2,000 కోట్ల మేర ఆర్టీసీ చార్జీలు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించేందుకే చంద్రబాబు మొగ్గు చూపడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ‘కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నందుకు, తద్వారా గత మూడేళ్లలో రాష్ట్ర ప్రజలపై సుమారు రూ.23 వేల కోట్ల మేర భారం మోపినందుకు.. ప్రభుత్వాన్ని కాపాడారా?’ అని నిలదీశారు. రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు 25 నుంచి 30 శాతం పెరిగినందుకు, ప్రజలపై సుమారు రూ.20 వేల కోట్ల భారం పడినందుకు అవిశ్వాసానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అపర సంజీవనిగా ఉపయోగపడిన 104 పథకాన్ని నిర్వీర్యం చేసినందుకే కాపాడారా? అని బాలినేని ప్రశ్నించారు. ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలు అందక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు తెలిసీ చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని కాపాడారంటేనే దాని వెనుక ఉన్న మర్మం అర్థమవుతోందని వివరించారు.
Share this article :

0 comments: