పల్లె కన్నీరు పెడుతోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పల్లె కన్నీరు పెడుతోంది

పల్లె కన్నీరు పెడుతోంది

Written By ysrcongress on Saturday, March 23, 2013 | 3/23/2013

* పొట్టకూటికోసం తిప్పలు పడుతున్నాం 
* షర్మిలతో గోడు చెప్పుకున్న రైతన్నలు, కూలీలు 
* చేతికి వచ్చే సమయంలో పంటలన్నీ ఎండుతున్నాయి
* మొక్కజొన్న.. వరి.. అరటి.. పసుపు.. చేమ ఏ పంట చూసినా కన్నీళ్లే
* ఉచిత కరెంటు అని చెప్పి వేలకు వేలు బిల్లులు ఇస్తున్నారు
* పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చేట్టు లేవు..
* త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని షర్మిల భరోసా
* ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంద్రబాబే కాపాడుతున్నాడని ధ్వజం 

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రైతన్న కన్నీరు పెడుతున్నాడు.. పల్లె కళ తప్పుతోంది.. ఒకప్పుడు బాగా బతికి నలుగురికి ఉపాధి చూపిన రైతులే ఇప్పుడు పొట్టకూటి కోసం కూలి పనులు చేసుకుంటున్నారు. పూలమ్మిన చోటే కట్టెలు ఏరుకొని బతుకీడుస్తున్నారు. పాలుపోసుకునే దశలో మొక్కజొన్న... పొట్టకొచ్చిన వరి చేను.. మొగ్గ తొడిగిన అరటి తోట, కుందనపు బొమ్మలా ఉన్న పసుపు, చేమ, కంద ఇలా... ఒక్కటేమిటి కరెంటు లేక.. నీళ్లు లేక అన్ని పంటలు ఎండుతున్నాయి. ఆదుకోవాల్సిన పాలకులు కరెంటు చార్జీలతో రైతులను పీల్చిపిప్పి చేస్తున్నారు.

‘ఇలాంటి పరిస్థితుల్లో ఎలా బతికేదమ్మా.. మాకు దిక్కెవరు..?’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలను రైతన్నలు దీనంగా అడిగారు. శుక్రవారం మరో ప్రజాప్రస్థానంలో ఎక్కడికి వెళ్లినా షర్మిలకు ఈ దయనీయ దృశ్యాలే కనిపించాయి. వారి కష్టాలకు చలించిన షర్మిల... త్వరలోనే జగనన్న వస్తాడని, రైతన్న రాజ్యం తెస్తాడని వారికి భరోసానిస్తూ ముందుకు సాగారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం శుక్రవారం గుంటూరు జిల్లా మంగళరిగి నియోజకవర్గంలోని పల్లెల్లో కొనసాగింది. గ్రామాల గుండా వెళ్తున్నప్పుడు షర్మిల దాదాపు 100 మందికి పైగా రైతులతో మాట్లాడారు. రచ్చబండలో మహిళలతో కలిసి పల్లె కష్టాలను తెలుసుకున్నారు. 

రాజన్న రాజ్యంలో రైతే రాజు

‘‘అమ్మా.. అన్నా.. ఒక్క మాటైతే భరోసాగా చెబుతున్నా. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు. రాజన్న రాజ్యం స్థాపిస్తారు. రాజన్న రాజ్యంతో రైతన్నే రాజు. అప్పటివరకు దయచేసి మీ పంట పొలాలు అమ్ముకోవద్దు.. అంతకంటే విలువైన మీ ప్రాణాలు తీసుకుకోవద్దు’’ అని షర్మిల రైతులను కోరారు. మోరంపూడిలో రచ్చబండలో రైతులు , మహిళలతో ఆమె మాట్లాడారు. పలు చోట్ల పంట పొలాల్లో రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏమన్నారో షర్మిల మాటల్లోనే..
‘‘చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రైతులను పురుగులను చూసినట్లు చూశారు. వ్యవసాయం దండగన్నారు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని లెక్కలు వేసి చూపించారు. వేలకు వేలు కరెంటు బిల్లులు వేసి రైతులను, పల్లెలను పీల్చి పిప్పి చేసిన ఆయన మళ్లీ పాదయాత్ర అంటూ పల్లెల వెంట తిరుగుతున్నారు. 

సరే పాదయాత్ర చేస్తున్నాడు కదా..! ప్రజా సమస్యలు అర్థం చేసుకుంటారు అనుకున్నాం. ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి కూలగొడతారు అనుకున్నాం. కానీ ఆయనకు ప్రజా ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యం. ఆయనకు కావాల్సింది రాజకీయాలు. రైతులు ఏమైపోయినా ఆయనకు పట్టదు. నాడు సొంత మామనే వెన్నుపోటు పొడిచారు. ఈ రోజు ఆయనపై సీబీఐ విచారణ తప్పించుకోవడానికి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోట్లు పొడవడం, అధికారం కోసం అడ్డదార్లు తొక్కడం చంద్రబాబు నైజం. చంద్రబాబే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్నారు. ఆయన చేస్తున్న పాదయాత్ర ప్రజల కోసం కాదు. ఆయన కోసం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించడం కోసం..’’

యాత్ర సాగిందిలా..

శుక్రవారం 98వ రోజు మరోప్రజా ప్రస్థానం దుగ్గిరాల మండలం గాంధీనగర్ నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి పెనుమూలి, కంఠం రాజుకొండూరు, మంచికలపూడి, మోరంపూడి, పేరుకలపూడి గ్రామాల మీదుగా సాగింది. పేరుకలపూడి శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 13.6 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 1,349.3 కి.మీ. యాత్ర పూర్తయ్యింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో మర్రి రాజశేఖర్, ఆర్‌కే, వాసిరెడ్డి పద్మ, లక్ష్మీ పార్వతి, మేరుగ నాగార్జున, తాడి శకుంతల,తలశిల రఘురాం, వైఎస్ కొండారెడ్డి, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ తదితరులు ఉన్నారు. 

పాలు పోసుకునే వేళ కోతలు

మొక్కజొన్న కంకి పాలుపోసుకునే సమయంలో కరెంటు కోతలు పెట్టారు. కంకి ఎదగలేదమ్మా... ఆయిల్ ఇంజిన్ తీసుకొచ్చి నీళ్లు పెడదామంటే.. ఊళ్లో అప్పు పుట్టలేదు. ఎదిగిన చేను చూస్తుండగానే ఎండిపోయింది. రూ.5 మిత్తికి అప్పు తీసుకొచ్చినా. రెండు తడులకు కూడా ఆ డబ్బు సరిపోలేదమ్మా.. వైఎస్సార్ ఉన్నప్పుడు వానలు పిలిస్తే పలికినయి. ఏడాదికి పండే పంట కూడా ఆరు నెలలకే చేతికి అందేది.
- భీమవరపు అమ్మిరెడ్డి, షేక్‌మున్న,
మొక్కజొన్న రైతులు-పెనుమూలి 



ఫ్రీ కరెంటు అని.. రూ.12 వేల బిల్లు 

ఎకరా రూ.25 వేలకు కౌలుకు తీసుకొని మూడు ఎకరాల్లో పసుపు పెట్టినా. 10 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. నీళ్లు లేక పంట పోయింది. పసుపు మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.4 వేల నుంచి రూ.4,500 పడుతోంది. ఎకరాకు రూ.లక్ష దాక పెట్టుబడి పెట్టినా. తోటకు నీళ్ల తడి పెట్టడానికే రూ.40 వేల ఖర్చు వస్తోంది. కరెంటేమో..! రోజుకు రెండు గంటలు కూడా ఇడుస్తలేరు. అది కూడా ఏ అర్దరాత్రో... అపరాత్రో ఇస్తున్నారు. మొన్ననే నా తమ్ముడు రాత్రి కరెంటు పెట్టబోతే బాయికాడ పాము కరిచింది. ఫ్రీ కరెంటు అన్నారు కానీ.. రూ 12,000 బిల్లు కట్టించుకున్నారు. మళ్లీ ఇప్పుడు రూ.10,000 బిల్లు వచ్చింది. 
- బనిగి సాహెబ్, పసుపు రైతు, కంఠంరాజు కొండూరు
Share this article :

0 comments: