చంద్ర ‘వంక’లివీ.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్ర ‘వంక’లివీ..

చంద్ర ‘వంక’లివీ..

Written By news on Friday, March 8, 2013 | 3/08/2013

కృష్ణా జిల్లా దాకరం గ్రామంలో భేటీ అయిన టీడీఎల్‌పీ
‘అవిశ్వాసం’ పెట్టకుండా తప్పించుకోవటంపై చర్చ 
తీర్మానం పెడితే వైఎస్సార్ కాంగ్రెస్‌కే మేలన్న బాబు 
ఎన్నికల్లో ప్రజలే అవిశ్వాసం పెడతారంటూ వ్యాఖ్య
‘పోరాటం’ ద్వారా కాలం గడపాలని నిర్ణయం

సాక్షి, విజయవాడ: అనుకున్నట్టే ‘అవిశ్వాసం’పై తెలుగుదేశం పార్టీ వెనకడుగు వేసింది. రాష్ట్రంలో 12 ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో ‘పోరాటం’ ద్వారా కాలం గడపాలనే నిశ్చయానికి వచ్చింది. అందులోనూ ఎన్నికల ఏడాది కావటంతో ప్రజలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌పై తమదే ‘అప్పర్ హ్యాండ్’ అయ్యేలా చూడాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. అసెంబ్లీలో సభ్యులను మోత్కుపల్లి నర్సింహులు డెరైక్ట్ చేయాలని, తాను యాత్ర నుంచి ఫోన్‌లో డెరైక్షన్ ఇస్తానని బాబు తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పెరగటానికి గల కారణాలను అన్వేషించాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు గురువారం తాను బసచేసిన కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం దాకరం గ్రామంలో టీడీఎల్‌పీ సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా ఎలా తప్పించుకుని బయటపడాలనే దానిపైనే మల్లగుల్లాలు పడ్డారు. ఈ సమావేశానికి 48 మంది ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మీడియాను అనుమతించకుండా గోప్యంగా నిర్వహించిన ఈ సమావేశంలో చర్చించిన అంశాలు ఈ విధంగా ఉన్నాయి. 

మనమే ఎందుకు అవిశ్వాసం పెట్టాలి..?

గతంలో ఎన్టీఆర్ పైన, తనపైన కాంగ్రెస్ ఎప్పుడూ అవిశ్వాస తీర్మానం పెట్టలేదని, ఇప్పుడు తాము మాత్రమే ఎందుకు పెట్టాలని చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించారు. గతంలో అవిశ్వాస తీర్మానం పెడితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కార్లు, సూట్‌కేసులు ముట్టాయన్నారు. గత అవిశ్వాస తీర్మానంతో కేవలం ఇద్దరు సభ్యులున్న వైఎస్సార్ సీపీ బలం ఉపఎన్నికలకు దారితీయడంతో 18కి పెరిగిందని, మరోమారు అటువంటి తప్పు మనం చేయకూడదని పేర్కొన్నారు. ఇప్పుడు అవిశ్వాసం పెడితే కచ్చితంగా వైఎస్సార్ సీపీకే లాభమని, మధ్యంతర ఎన్నికలు వస్తే ఆ పార్టీకే అనుకూల పరిస్థితి ఉందని విశ్లేషించారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో అవిశ్వాసం పెట్టటం సరికాదన్నారు. ప్రజలే అవిశ్వాసం పెట్టి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇంటికి పంపుతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అవిశ్వాసం పెట్టకుండా అసెంబ్లీ సమావేశాలను దాటవేయటానికి ఎటువంటి వ్యూహాలను అవలంబించాలన్న దానిపై సభ్యులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఉదయంపూట తాను సెల్‌ఫోన్‌లో అందుబాటులో ఉంటానని, తన సూచనలకు అనుగుణంగా అడుగులు వేయాలని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే వైఎస్సార్ కాంగ్రెస్‌కే లాభమని, ప్రభుత్వం పడిపోతే ఎన్నికల్లో జగన్ జైల్లో ఉండే గెలిచారన్న క్రెడిట్ కొట్టేస్తారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అవిశ్వాసం వైఎస్సార్ కాంగ్రెస్ పెడితే అప్పటి పరిస్థితిని బట్టి చూద్దామన్నారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే అవిశ్వాసంపై నిర్ణయం తీసుకోవాలని మోత్కుపల్లి నర్సింహులు సూచించారు. అసెంబ్లీలో ఎవరెంతగా రెచ్చగొట్టినా తాము అవిశ్వాస తీర్మానం పెట్టకూడదని, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు పెడితే అప్పుడు పరిస్థితిని బట్టి వ్యవహరించాలని టీడీఎల్‌పీ సమావేశం నిర్ణయించింది. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లు, కరెంటు కోతలు, బాబ్లీ ప్రాజెక్టు వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా సభ్యులు ‘ఫైర్’ చూపించాలని సమావేశం సూచించింది. 

వైఎస్సార్ సీపీకి ఓట్ల పెరుగుదలపై ఆందోళన: టీడీఎల్‌పీ సమావేశంలో బాబు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ సభ్యులను కలవరపాటుకు గురిచేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో తనకు వచ్చిన సర్వే లెక్కల ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ ఓటింగ్ 37 శాతానికి పెరిగిందని, దానిపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఏ వర్గాలు ఆ పార్టీకి చేరువవుతున్నాయనే అంశాన్ని పరిశీలించాలని ఎమ్మెల్యేలకు బాబు సూచించారు. ‘ఎస్సీ వర్గీకరణకు మనం అనుకూలమని ప్రకటి ంచిన తర్వాత మాలలు పార్టీకి దూరమయ్యారు.. వర్గీకరణపై మన స్టాండ్ ఎంతవరకు సమర్థనీయమనేది మీరు పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది’ అని నిర్దేశించారు. ద ళితవాడలో టీడీపీపై వ్యతిరే కత పెరగటానికి గల కారణాలను పరిశీలించాలన్నారు. 

12 అంశాలపై పోరాటం: బడ్జెట్ సమావేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న 12 సమస్యలపై టీడీపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు. టీడీఎల్‌పీ సమావేశం అనంతరం నర్సింహులు, పయ్యావుల తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘‘అసెంబ్లీలో మా వ్యూహం మాకు ఉంటుంది.. 

చర్చపై ముందుగానే బాబు ‘డైరెక్షన్’

రాష్ట్రం అంధకారంగా మారి రైతులు, సామాన్య ప్రజలు, విద్యార్థులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని ఇతర రాజకీయ పక్షాలన్నీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టటానికి సిద్ధంగా లేని చంద్రబాబు గురువారం టీడీఎల్పీ సమావేశాన్ని చంద్రబాబు నాటకీయంగా ముగించారు. అవిశ్వాసానికి సంబంధించిన చర్చ సందర్భంగా టీడీఎల్పీ సమావేశంలో ఏం మాట్లాడాలన్న విషయాలను చంద్రబాబు ముందుగానే పలువురు సభ్యులకు సూచనలు ఇచ్చి ఆ విధంగా మాట్లాడాల్సిందిగా ఆదేశించారు. టీడీఎల్పీ సమావేశానికి ముందు చంద్రబాబు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడారు. సమావేశంలో ఏం చెప్పాలో ముందుగానే డెరైక్షన్ ఇచ్చారు. తర్వాత సమావేశంలో అధినేత మాటలను తన మాటలుగా రేవంత్ వినిపించారు. ప్రస్తుతం పార్టీకి సభలో 77 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉందని, వైఎస్సార్ కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్‌ఎస్, బీజేపీ, లోక్‌సత్తా, సీపీఏం, సీపీఐలు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చినా ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉండదని సమావేశంలో రేవంత్‌రెడ్డి ద్వారా చెప్పుకొచ్చారు. చంద్రబాబు అనుకున్న విధంగా ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత మాట్లాడిన మండవ వెంకటేశ్వరరావు, మోత్కుపల్లి నర్సిం హులు ఆయన వాదనను బలపరిచారు. ఆమేరకు అవిశ్వాసం పెట్టరాదని టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి పడగొట్టటానికి మా అధినేతకు ఏమాత్రం ఇష్టం లేదు. అది నేరుగా చెప్పలేం కాబట్టే వ్యూహాత్మకంగా సమావేశంలో మాట్లాడుకున్నాం’ అని సమావేశం అనంతరం ఒక సీనియర్ ఎమ్మెల్యే వివరించారు.

చంద్ర ‘వంక’లివీ..

గతంలో ఎన్టీఆర్ పైన, నాపైన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అవిశ్వాస తీర్మానం పెట్టలేదు. ఇప్పుడు మనం మాత్రమే ఎందుకు పెట్టాలి? 
గతంలో అవిశ్వాస తీర్మానం పెడితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కార్లు, సూట్‌కేసులు ముట్టాయి. 
ఇప్పుడు అవిశ్వాసం పెడితే కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్‌కే లాభం. మధ్యంతర ఎన్నికలు వస్తే ఆ పార్టీకే అనుకూలం. 
ఎన్నికల్లో జగన్ జైల్లో ఉండే గెలిచారన్న క్రెడిట్ కొట్టేస్తారు. 
ప్రస్తుతం టీడీపీకి సభలో 77 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. విపక్షాలన్నీ అవిశ్వాసానికి మద్దతు ఇచ్చినా ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉండదు. 
మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో అవిశ్వాసం పెట్టటం సరికాదు. 
ప్రజలే అవిశ్వాసం పెట్టి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇంటికి పంపుతారు. 
అవిశ్వాసం వైఎస్సార్ కాంగ్రెస్ పెడితే అప్పటి పరిస్థితిని బట్టి చూద్దాం. 
Share this article :

0 comments: