ఈ ప్రభుత్వమున్నది.. ప్రజలను కాపాడటానికా? లేక చంద్రబాబును కాపాడటానికా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ ప్రభుత్వమున్నది.. ప్రజలను కాపాడటానికా? లేక చంద్రబాబును కాపాడటానికా?

ఈ ప్రభుత్వమున్నది.. ప్రజలను కాపాడటానికా? లేక చంద్రబాబును కాపాడటానికా?

Written By news on Saturday, March 16, 2013 | 3/16/2013

వైఎస్ సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచిన సర్కారు క్షణం కూడా కొనసాగటానికి వీల్లేదు 
ఐదేళ్లు చార్జీలు పెంచబోమని వైఎస్ చెప్పారు.. సర్కారు పక్షానికోసారి చార్జీలు వడ్డిస్తోంది 
నెలలో పక్షం రోజులు పరిశ్రమలకు పవర్ కట్.. పల్లెలు చీకట్లో మగ్గుతున్నాయి 
చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయి.. 20 లక్షల కార్మిక కుటుంబాలు రోడ్డునపడ్డాయి
ఎరువుల ధరలు పెరిగాయి.. గిట్టుబాటు లేదు.. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి 
ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్ సంక్షేమ విధానాలన్నీ నిర్వీర్యం అవుతున్నాయి 
మూడేళ్లుగా అన్ని రంగాల్లోనూ రాష్ట్రం అధోగతి... ఒక్క పరిశ్రమ కూడా రావటం లేదు
కార్మికులకు ఉన్న ఉద్యోగాలు ఊడుతుంటే.. కొత్త ఉద్యోగాలు ఎక్కడ నుంచి వస్తాయి?
సర్కారుపై కొడవళ్లతో వెంటపడాలన్న బాబు.. తన చేతిలో ఆయుధాన్ని ప్రయోగించరట 
ప్రభుత్వాన్ని కాపాడటానికి ప్రధాన ప్రతిపక్షం విప్ జారీ చేయటం చరిత్రలో ఎక్కడా లేదు
అవిశ్వాసంపై చర్చలో వైఎస్సార్ సీపీ శాసనసభా పక్ష నాయకురాలు విజయమ్మ ధ్వజం

సాక్షి, హైదరాబాద్: ‘‘ఈ ప్రభుత్వం ప్రజలను కాపాడటానికి ఉందా? లేక చంద్రబాబును కాపాడటానికా? ఈ ప్రభుత్వం ఎవరికి ప్రతినిధి? కిరణ్‌కుమార్‌రెడ్డికా? చంద్రబాబుకా? ప్రజలకు ప్రతినిధి కాదా? ... దివంగత రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఈ ప్రభుత్వం తూట్లు పొడిచింది.. అలాంటి ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగటానికి వీల్లేదు. ... పవర్ హాలిడే, క్రాప్ హాలిడేలకు కారణమవుతున్న ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలు హాలిడే ఇస్తారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నాయకురాలు వై.ఎస్.విజయమ్మ స్పష్టం చేశారు. 

‘‘ఇది ప్రజావ్యతిరేక ప్రభుత్వమని, కొడవళ్లతో వెంటపడాలని పిలుపునిచ్చిన చంద్రబాబు.. తన చేతిలోని ఆయుధాన్ని ప్రయోగించరట! ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని పడగొట్టటానికి వచ్చిన అస్త్రాన్ని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వినియోగించుకోకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటానికి తన సభ్యులకు విప్ జారీ చేయటం ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా ఉండబోదు’’ అని ఆమె తూర్పారపట్టారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయ్యాయని నిండు సభలో ఎండగట్టారు. శుక్రవారం శాసనసభలో ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ విడిగా, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, నాగం జనార్దన్‌రెడ్డిలు సంయుక్తంగా ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఆమె మాట్లాడారు. 2009 ఎన్నికల ముందు వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్, బియ్యం కోటాను 30 కిలోలకు పెంచటం వంటి హామీల అమలును ఈ ప్రభుత్వం మరచిపోయిందని ధ్వజమెత్తారు. వచ్చే ఐదేళ్లు కరెంటు చార్జీలు పెంచబోమని రాజశేఖరరెడ్డి ప్రకటించగా.. ఈ ప్రభుత్వం పక్షానికోసారి చార్జీలను పెంచుతోందని విచారం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ సర్కారును కాపాడేందుకు కాంగ్రెస్‌తో కుమ్మక్కు కాగా.. ప్రజాక్షేత్రంలో ఉన్న రాజకీయ పార్టీగా.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు తామే ముందుకు వచ్చామని పేర్కొన్నారు. విజయమ్మ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే... 

పక్షానికోసారి విద్యుత్ చార్జీల మోత 

ప్రజలపై ఉరిమిపడుతున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవటం ప్రభుత్వ నేరం కాదా? ప్రజా సమస్యలను పరిష్కరించటానికి ఈ ప్రభుత్వానికి టైం కూడా లేదు. రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు.. ఇప్పుడు మాత్రం పక్షానికోసారి చార్జీల మోత మోగిస్తున్నారు. సర్‌చార్జి పేరుతో ప్రజల నడ్డి విరగ్గొడుతున్నారు. బిల్లులు ఎక్కువ మొత్తంలో ఇస్తూ విద్యుత్ మాత్రం తక్కువ ఇస్తున్నారు. 300 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించుకునే వారికి 116 శాతం పెంపు, 500 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించుకునే వారికి 33 శాతం మాత్రమే పెంపు ప్రతిపాదించారు. 

15 రోజులు పరిశ్రమలకు పవర్ కట్... 

పల్లెలు చీకట్లో మగ్గుతున్నాయి. పరిశ్రమలకు నెలలో పక్షం రోజులు విద్యుత్ కోతల వల్ల చిన్నతరహా పరిశ్రమలు మూతపడుతున్నాయి.. దీనితో 20 లక్షల కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. వ్యవసాయానికి రెండు మూడు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయటం లేదు. కరెంటు ఎప్పుడు వస్తుందో కూడా తెలియటం లేదు. మూడేళ్లుగా రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అధోగతి పాలయింది. ఒక్క పరిశ్రమ కూడా రావటం లేదు. 

అంధకారంలో మగ్గాల్సిందేనా? 

రెండేళ్లుగా గ్యాస్, బొగ్గు లేదని తెలిసినా ఈ ప్రభుత్వం ఎందుకు ముందస్తు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేదు? మరో రెండేళ్లపాటు బొగ్గు, గ్యాస్ అందుబాటులో ఉండదని కేంద్రమంత్రి ప్రకటించారు.. మరి అలాంటప్పుడు రాష్ట్రం అంధకారంలో మగ్గాల్సిందేనా? ఉత్తర భారతదేశం నుంచి 1,100 మెగావాట్ల కారిడార్ ఉంటే.. రాష్ట్రం మేల్కోకపోవటం వల్ల కేవలం 230 మెగావాట్లు రాష్ట్రం తీసుకున్నది.. అదే కర్ణాటక 850 మెగావాట్లు ముందే కొనుగోలు చేసింది. 


రైతులకు సాయమేదీ? 
పత్తి, మిరప, వేరుశనగ రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎరువుల ధరలు 250 శాతం పెరిగాయి. గిట్టుబాటు ధర మాత్రం ఆ స్థాయిలో పెరగక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమలు జనరేటర్లు కొనుగోలు చేయకుండా వ్యాట్‌ను ఐదు నుంచి 11 శాతానికి పెంచారు. నీలం తుపానులో రూ. 3,600 కోట్లు నష్టపోయిన రైతులకు ఏ మేరకు సాయం అందించారు? రాష్ట్రంలో రైతులు రూ. 60 వేల కోట్లు రుణాలు తీసుకుంటే.. వడ్డీ మాఫీ కింద రూ. 2,400 కోట్లు చెల్లించాల్సి ఉంటే.. బడ్జెట్‌లో రూ. 650 కోట్లు మాత్రం ఎలా పెడతారు? ప్రభుత్వం విపత్తులు సృష్టిస్తోంది. వ్యవసాయ వృద్ధి రేటు 1.96 శాతానికి పడిపోయింది. 

సంక్షేమం నిర్వీర్యం... 

ఆరోగ్యశ్రీ పథకం, 108, 104 అంబులెన్స్ సర్వీసులు, విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర సంక్షేమ విధానాలు పూర్తిగా నిర్వీర్యం అవుతున్నాయి. రాజీవ్ యువకిరణాల కింద 15 లక్షల మందికి అని ఒకసారి, మరోసారి 30 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని సీఎం చెప్పారు. కానీ గవర్నర్ తన ప్రసంగంలో 2.75 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు చెప్పారు. ఉన్న ఉద్యోగాలు ఊడుతుంటే.. కొత్త ఉద్యోగాలు ఎక్కడ నుంచి వస్తాయి? ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి కొనసాగింపుగా సాగుతోంది. భాగస్వామ్య సదస్సుల పేరుతో రూ. 6.5 లక్షల కోట్ల ఒప్పందాలు కుదిరాయని చెప్పారు.. కానీ ఎస్‌ఐపీబీలో రూ. 1.32 లక్షల కోట్లకు అనుమతులు ఇచ్చినట్లు గవర్నర్ ప్రకటించారు. సహకార ఎన్నికల్లో గెలిచామని ఈ ప్రభుత్వం చెప్పుకుంటోంది కానీ.. ప్రజాస్వామ్యాన్ని ఎంతగా ఖూనీ చేసిందో అందరికీ తెలుసు.
Share this article :

0 comments: