చంద్రబాబు చరిత్రహీనుడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు చరిత్రహీనుడు

చంద్రబాబు చరిత్రహీనుడు

Written By news on Saturday, March 16, 2013 | 3/16/2013

టీడీపీ అధినేతపై షర్మిల నిప్పులు 
నీకు వీసమెత్తు విశ్వసనీయతైనా ఉందా చంద్రబాబూ?
అవినీతి కాంగ్రెస్‌ను తరిమికొట్టండన్నావు 
తీరా అవిశ్వాసం పెడితే కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్నావు
అవిశ్వాసంతో ఇతర పక్షాలు లబ్ధి పొందుతాయని కుంటిసాకులు చెప్తున్నావు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 91, కిలోమీటర్లు: 1,251

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘అవినీతి, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా పాలించే హక్కులేదన్నావు. కాంగ్రెస్‌ను తరిమికొట్టండన్నావు. తీరా ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం వచ్చేసరికి మాట మార్చావు. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నావు. ఇదేమని అడిగితే.. ఇతర పక్షాలు లబ్ధిపొందుతాయని కుంటిసాకులు చెప్తున్నావు. నీకు కావాల్సింది ప్రజల ఇబ్బందులు తీరడమా లేక మరేదైనా ప్రయోజనమా? ఈ ప్రభుత్వం మాకొద్దని ప్రజలందరూ ముక్త కంఠంతో నినదిస్తుంటే చెవులుండీ నీకు వినపడడం లేదా చంద్రబాబూ? నీకు వీసమెత్తు విశ్వసనీయతైనా ఉందా? ప్రజల పక్షాన కాకుండా వారిని పీడిస్తున్న పాలక పక్షాన నిలిచిన నువ్వు చరిత్ర హీనుడిగా మిగిలిపోతావ్’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిపై నిప్పులు చెరిగారు. 

ఇలాంటి అవకాశవాద రాజకీయాలు చంద్రబాబుకు కొత్తకాదని, మామను వెన్నుపోటు పొడిచి పీఠమెక్కినప్పటి నుంచీ చంద్రబాబు మోసాలు, కుట్రలతోనే గడిపారని విమర్శించారు. ప్రజల బాధలు పట్టని ప్రభుత్వానికి, దానితో కుమ్మక్కయిన చంద్రబాబుకు నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం గుంటూరు నగరంలో సాగింది. షర్మిలను చూసేందుకు వచ్చిన అభిమానులతో గుంటూరు నగరం జనసంద్రంగా మారింది. మాయాబజార్ సెంటర్‌లో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
ప్రజాస్వామ్యానికే చంద్రబాబు మాయని మచ్చ..

‘‘ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం తమకొద్దని మొరపెట్టుకుంటున్న ప్రజల తరఫున ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంపై ఉంది. కానీ చంద్రబాబు ఆ పని చేయకపోగా ఇతర పార్టీలు ముందుకొస్తే వారికి సహకరించడం లేదు. అవిశ్వాసానికి మద్దతివ్వకుంటే ప్రభుత్వానికి అండగా నిలిచినట్టు కాదా? ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? అధికార కాంగ్రెస్ కంటే ముందుగానే అవిశ్వాసానికి వ్యతిరేకంగా వ్యవహరించాలంటూ ప్రతిపక్ష నేత తమ శాసన సభ్యులకు విప్ జారీ చేశారు. ఇలాంటి నాయకుడిని ఏమనాలి? ప్రజాసామ్యానికే చంద్రబాబు మాయని మచ్చ. మోసాలు, కపటాలే ఆయన సిద్ధాంతాలు.
మంచి నీళ్లవ్వలేని ఈ సర్కారు ఎందుకు?

దాహార్తితో అల్లాడుతున్న ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు అందించలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు? రాష్ట్రంలో ఏ గ్రామానికెళ్లినా పేదలు తాగునీరు కొనుక్కుంటున్నారు. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి ముందుచూపు లేదు. అందుకే రాష్ట్రంలో అంధకారం అలముకుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 3 గంటలు కూడా ఉండడం లేదు. పైగా పరిశ్రమలకు 12 గంటలు కోతలు. రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ కరెంటు కోతలతో మూతపడ్డాయి. లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. దీనికి తోడు కరెంటు చార్జీల వాతలు పెడుతున్నారు. సర్‌చార్జీ పేరుతో రూ.32వేల కోట్లు వసూలు చేస్తున్నారు. వైఎస్ తెచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ నేతలు ఆయన ఆశయాలకు గండికొట్టారు. ఐదేళ్ల పాలనలో వైఎస్ ఏనాడూ ఒక్క రూపాయి చార్జీ కూడా పెంచలేదు. లక్షలమంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించారు. 108, ఆరోగ్యశ్రీ, అభయహస్తం వం టి సంక్షేమ పథకాలు అమలు చేశారు. కానీ ఈ కాంగ్రెస్ నేతలకు వైఎస్ మీద గౌరవం లేదు. అందుకే ఆయన ఆశయాలకు గండికొట్టి చార్జీల మీద చార్జీలు పెంచుతూ ప్రజలను పీడిస్తున్నారు.’’

గుంటూరులో జనహోరు..: ‘మరో ప్రజాప్రస్థానం’ 91వ రోజు శుక్రవారం గుంటూరులో జరిగిన పాదయాత్రకు జనం పోటెత్తారు. ఉదయం గుంటూరు నగరం హౌసింగ్‌బోర్డు కాలనీ వద్ద ప్రారంభమైన యాత్ర.. చుట్టుగుంట, వికలాంగుల కాలనీ, నల్లచెరువు, పూలమార్కెట్, మాయాబజార్ సెంటర్, బీఆర్ స్టేడియం మీదుగా సంగడిగుంట వరకు సాగింది. 11.5 కి.మీ. మేర నడిచిన షర్మిల పొన్నూరు రోడ్డులోని ముస్లిం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసి న బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. వస్త్రాలపై వ్యాట్‌ను రద్దు చేసేలా పార్టీ తరఫున పోరాడాలంటూ ఏపీ వస్త్రవ్యాపారుల సమాఖ్య కన్వీనర్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, జిల్లా వాసవీ హోల్‌సేల్ క్లాత్ మర్చంట్స్ సొసైటీ కన్వీనర్ వీసం కృష్ణమూర్తి శుక్రవారం షర్మిలను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. యాత్రలో అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, ఎంవీఎస్ నాగిరెడ్డి, ముదునూరి ప్రసాదరాజు, గోనె ప్రకాశ్‌రావు, ఆర్కే, గౌతం రెడ్డి, తలశిల రఘురాం, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్ నాయుడు, రావి వెంకటరమణ, కోన రఘుపతి, మహ్మద్ ముస్తఫా, షౌకత్, నజీర్ అహ్మద్, గులాం రసూల్, ఏటిగడ్డ నరసింహారెడ్డి, దేవళ్ల రేవతి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: