స్వలాభం కోసమే పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్వలాభం కోసమే పాదయాత్ర

స్వలాభం కోసమే పాదయాత్ర

Written By news on Friday, March 29, 2013 | 3/29/2013


 ‘వస్తున్నా మీ కోసం’ అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర అతని స్వలాభం కోసమే తప్ప ప్రజల కోసం కాదని విజయనగరం జిల్లా బొబ్బిలి శాసనసభ్యులు సుజయ్‌కృష్ణరంగారావు విమర్శించారు. ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో సర్కారుకు దన్నుగా నిలిచి పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు తీరును నిరసిస్తూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గురువారం స్థానిక బాలాజీచెరువు సెంటర్ లో చేపట్టిన ఒకరోజు నిరసన దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అధికార పక్షం, ప్రతిపక్షం కలిసి పనిచేస్తే ఇక ప్రజలకు ఎవరు అండగా ఉంటారని ప్రశ్నించారు. చంద్రబాబు తీరుతో ప్రజలు కూడా ఇప్పుడు ఇదే విషయంపై ఆలోచనలో పడ్డారన్నారు. 

మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు మాట్లాడు తూ విద్యుత్ చార్జీలపై ఆందోళన చేస్తే చంద్రబాబు తన హయాంలో కాల్పులు జరి పించారని, ప్రస్తుతం పెరిగిన విద్యుత్‌చార్జీలపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదు ట ఆందోళనకు దిగడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్‌ను నిత్యం తూర్పారబడుతున్న చంద్రబాబు అవిశ్వాసంపై వెనుకడుగు వేయడంతోనే ఆయన బండారం బయటపడిందన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ప్రతిచోటా మొదటి సంతకం అంటూ ఉపన్యాసాలిస్తున్న బాబు తన మొదటి సంతకంతో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచపటం నుంచి తొలగించేస్తాడంటూ ఎద్దేవా చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలతో సర్కారుపై అవిశ్వాసం పెడితే ప్రభుత్వంతో కుమ్మక్కైన చంద్రబాబుకు.. ప్రజా సమస్యలపై పాదయాత్ర చేసే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ఆయన పర్యటన పూర్తి అయ్యాక చంద్రబాబు నడిచిన దారిని పసుపునీళ్లతో శుద్ధి చేస్తామని పేర్కొన్నారు. 

దీక్షకు అనూహ్య స్పందన: మరో ఒకటిరెండు రోజుల్లో చంద్రబాబు యాత్ర కాకినాడ రానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చేపట్టిన నిరసన దీక్షకు అనూహ్య స్పందన లభించింది. దీక్ష సమాచారం తెలుసుకుని ఇతర జిల్లాల నుంచి కూడా నేతలు స్వచ్ఛందంగా తరలిరాగా కాకినాడతోపాటు జిల్లా నలుమూలల నుంచి కూడా మండుటెండలను సైతం లెక్కచేయక నేతలు, కార్యకర్తలు భారీగా సంఖ్యలో వచ్చి నిరసన దీక్షకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సీజీసీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కేంద్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఏజేసీ బుచ్చిమహేశ్వరరావు, మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామినాయుడు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారితోపాటు జిల్లాలోని పార్టీనేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Share this article :

0 comments: