దేవుని చల్లని చూపు జగన్ మీద ఉంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దేవుని చల్లని చూపు జగన్ మీద ఉంది

దేవుని చల్లని చూపు జగన్ మీద ఉంది

Written By news on Wednesday, March 27, 2013 | 3/27/2013


ఈరోజుకి జగన్‌ను అరెస్టుచేసి 10 నెలలు. మేమందరం జగన్‌కు దూరంగా వున్నా దేవుడు జగన్‌కు తోడుగా ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఈ పది నెలల్లో జగన్‌లోని కార్యదక్షత, ప్రజలకు మేలు చేయాలని, ప్రజలకు ఒక అన్నగా, ఒక కొడుకుగా, ఒక తమ్మునిగా వారికి తోడుగా నిలవాలనే పట్టుదల ఇంకా ఇంకా పెరిగింది... ఇంకా బలపడింది అనేది సత్యం. ఈ 10 నెలలు జగన్‌ను అధైర్యపరచలేదు సరికదా జగన్‌ను ఇంకా బలపరిచాయి. కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ వాళ్లు ఎన్ని కుట్రలు పన్నినా జగన్‌ను ఆపలేరు అనేది ఈ 10 నెలలు రుజువు చేశాయి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్ రాజీపడలేదు సరికదా ప్రజా సమస్యలపై పోరాడమని తన పార్టీకి ఊతమిచ్చారు.

అనర్హత వేటు పడుతుందని తెలిసినా ఎమ్మెల్యేల చేత నిజాయితీతో కూడిన రాజకీయాలను ప్రోత్సహించారు. నాలుగు గోడల మధ్య వున్నా, ప్రజాసమస్యలపై పోరాడుతూ ఉంటే కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండి మరీ ప్రజలను చిత్రవధలకు గురిచేస్తున్నారు. చంద్రబాబుగారు ప్రతిపక్ష నేతగా ఉంటూ పోరాడవలసింది పోయి ఈ రాక్షస ప్రభుత్వానికి అండగా నేనున్నానంటూ నిలబడ్డారు. జగనేమో ప్రజలకు అండగా వుంటే చంద్రబాబు గారేమో ప్రభుత్వానికి అండగా నేనుంటానంటున్నారు. నాతో మొన్న ఒకరు అన్నారు - ‘అమ్మా జైలులో వున్నా జగన్ ప్రజలు, ప్రజలు అంటున్నారు. చంద్రబాబుగారికేమో అధికారంలో వుండేవారిని మేనేజ్ చేసుకోను సరిపోయింది’ అని!

అయ్యా చంద్రబాబుగారూ, మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన మీరు, అధికారంకోసం ప్రజల ముందు ‘మీకోసం’ అంటూ మోసాలు చేస్తూ తీరా అవిశ్వాసం సమయంలో ‘కాంగ్రెస్ ప్రభుత్వం కోసం’ అని, ఈ ‘చేతగాని’, మీ భాషలో ‘దద్దమ్మ’ ప్రభుత్వాన్ని భుజాన వేసుకున్న మీరా జగన్ గురించి మాట్లాడేది. పూర్తి మద్యపాన నిషేధం అంటూ ఇచ్చిన మాటను గాలికి వదిలేసి, ప్రపంచ బ్యాంకుకు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి, ‘వ్యవసాయం దండగ, రైతులు డబ్బుకోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’ అన్న మీరా జగన్ గురించి మాట్లాడేది. మీ మీద విచారణ అసలు జరగకుండా ఎమార్, ఐఎంజి కేసులలో వ్యవస్థలను మేనేజ్ చేసుకునేందుకు ప్రజలను పణంగా పెట్టిన మీరా జగన్ పేరెత్తేది. ఆ అర్హత మీకు లేదు!

అయ్యా కిరణ్‌కుమార్‌రెడ్డిగారూ, మా సీల్డ్ కవర్ ముఖ్యమంత్రిగారూ, ఇటలీ చుట్టూ, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి ముఖ్యమంత్రి అయిన మీరు... పోయిన ఎన్నికలలో మీ సొంత నియోజకవర్గం దాటి పక్కకు వెళ్లని మీరు... సొంత నియోజకవర్గంలో మా మామగారి సహాయంతో గెలిచిన మీరు... ఢిల్లీ పెద్దలను కాకా పట్టడం, తప్పు నివేదికలు ఇవ్వడం తప్ప మీకేం తెలుసయ్యా, మీరేం చేశారయ్యా? ఒకరోజు ఒక ఊరికి వెళ్ళారా? ఒకరిని పరామర్శించారా? పదవి వచ్చిన 18 నెలల్లో ఏమి ఘనకార్యాలు సాధించారయ్యా మీరు? మీకు స్పీకర్ పదవి ఇచ్చిన, చనిపోయిన మా మామగారిని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం, ఐఏఎస్ అధికారులను జైలుకు పంపడం, మీ కేబినెట్‌లోని మంత్రులను స్వార్థంకోసం నట్టేట కేసులలో ముంచడం, కొందరిని తప్పించడం తప్ప మీరేమి ఘనకార్యాలు చేశారయ్యా? ప్రజల నెత్తిన కరెంటు ఛార్జీలను మోపడం తప్ప మీరేం చేశారయ్యా? మీరు కాదయ్యా... ప్రజలు చెప్పాలి - మీ పాలన గురించి! ప్రజలను మీ పాలన గురించి అడిగే ధైర్యం మీకుందా? ప్రజలు మాట్లాడితే వినే ధైర్యం మీకుందా?

150 మంది ఎమ్మెల్యేలు తనను ముఖ్యమంత్రి కావాలని సంతకం చేసిన రోజున రోశయ్యగారి పేరును ప్రతిపాదించిన వ్యక్తి నా భర్త. మీ ఢిల్లీ పెద్దలు ‘ఇచ్చిన మాటను వదులుకో, నిన్ను కేంద్రమంత్రిని చేస్తాము. తరువాత ముఖ్యమంత్రిని చేస్తాము’ అంటే, ఇచ్చిన మాట ముందు పదవులను తృణప్రాయంగా ఎంచుకున్న వ్యక్తి నా భర్త!

నా భర్త రెండున్నర సంవత్సరాలు ఎండనకా, వాననకా, రాత్రనకా, పగలనకా ప్రజల మధ్యలో, ప్రజలకోసం, ప్రజలతో మమేకం అయిన మనిషి. వాళ్ల ఇంట్లో వాళ్ల తమ్ముడిలా, వాళ్ల అన్నలాగా, కొడుకులాగా, మనవడిలాగా వారిని ప్రేమించిన వ్యక్తి. వారి సమస్యలకోసం పోరాడిన వ్యక్తి!

నా భర్తపై మీరు అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టినా, అరెస్టు చేసినా నిర్భయంగా, రాజీ లేకుండా ప్రజలకోసం పోరాటం చేస్తున్న మనిషి. నా భర్తకు వుండే చిత్తశుద్ధిలో, కార్యదక్షతలో, పట్టుదలలో మీకిద్దరికీ నూరవ వంతు కూడా లేదు.

నా భర్తకు ప్రజల మీద వుండే ప్రేమలో, వారి గురించి ఆయన ఫీలయ్యే బాధ్యతలో మీకు వెయ్యవ శాతం కూడా లేదు. మరీ ముఖ్యంగా నా భర్తకు వున్నదీ, మీకు బొత్తిగా లేనిది దేవుని దయ. అందుకనే మీ ఇద్దరి పాలనలు ఇంత దౌర్భాగ్యంగా వున్నాయి.

జగన్ జైలులో వున్నాడని బాధ అనిపించినప్పుడు, జగన్ దూరంగా వున్నాడని కన్నీరు వచ్చినప్పుడు నేననుకుంటాను - ‘‘దేవా, చిన్నప్పుడు తల్లి ఒడిలో పడుకుని చదువుకునేటపుడు నీ దయ జగన్ మీద ఎలా ఉండిందో, ఇప్పుడు జగన్ అక్కడ ఒక్కడూ చదువుకుంటున్నా తన మీద నీ దయ అలానే ఉంది అని నేను నమ్ముతున్నాను’’ అని!

నేననుకుంటాను - మామగారు జగన్‌తో - ‘జగన్, నీకు ఈ లోకంలో తండ్రిని మించిన స్నేహితుడుండడు’ అని చెప్పినప్పుడు దేవుని చల్లని చూపు జగన్ మీద ఎలా వుండిందో, ఇప్పుడు కూడా ఒంటరిగా ఉన్న జగన్ మీద దేవుని చల్లని చూపు వుందని నేను నమ్ముతున్నాను.

చిన్నప్పుడు షర్మిల జగన్ ఎక్కడికి వెళ్లినా తనూ వెళ్లాలని మారాం చేసినప్పుడు దేవుని ప్రేమ జగన్ మీద ఎలా వుండిందో ఇప్పుడూ దేవుని ప్రేమ జగన్ మీద అలానే వుందని నేను నమ్ముతున్నాను. బెంగళూరులో నేను, జగన్ రోజూ వాకింగ్ చేసే సమయంలో దేవుని సహవాసం మాతో ఎలా వుండిందో ఇప్పుడు కూడా దేవుని సహవాసం జగన్‌తో అలాగే వుందని నేను నమ్ముతున్నాను. పిల్లలతో జగన్ ఆడుకుంటున్నప్పుడు దేవుని ఆశీర్వాదం జగన్ మీద ఎలా వుండిందో ఇప్పుడు కూడా అలానే వుందని నేను నమ్ముతున్నాను.

ప్రజల మధ్యలో జగన్, ప్రజలకోసం నేనున్నానని మాట తప్పక, మడమ తిప్పక ముందుకు కదిలినప్పుడు దేవుని తోడు జగన్‌కు ఎలా వుండిందో ఇప్పుడు కూడా దేవుని తోడు జగన్‌తో వుందని నేను నమ్ముతున్నాను. జగన్ పట్ల దేవునికి వుండే ఉద్దేశాలు మంచివని, అవి జగన్‌కు, రాష్ట్రానికి, మాకు ఆశీర్వాదం ఇచ్చేవని నేను నమ్ముతున్నాను. జగన్‌కు వ్యతిరేకంగా అన్యాయం, అక్రమం చేసేవారి దవడ ఎముకలు దేవుడు విరగ్గొట్టే సమయం ఎంతో దూరంలో లేదని నేను నమ్ముతున్నాను.

- వైఎస్ భారతి
w/o వైఎస్ జగన్ 
Share this article :

0 comments: