చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు కాబట్టే ఆయనపై సీబీఐ దర్యాప్తులు లేవు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు కాబట్టే ఆయనపై సీబీఐ దర్యాప్తులు లేవు

చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు కాబట్టే ఆయనపై సీబీఐ దర్యాప్తులు లేవు

Written By ysrcongress on Friday, March 22, 2013 | 3/22/2013

* కరుణానిధి యూపీఏ నుంచి తప్పుకోగానే ఆయన కుమారుడి ఇంటిపై దాడులు చేయించారు
* {పతిపక్షాలు పార్లమెంటులో దుమ్మెత్తిపోస్తే.. వెంటనే సీబీఐని వెనక్కి రప్పించారు
* జగన్.. కాంగ్రెస్‌కు వ్యతిరేకి అయ్యాడు కాబట్టే కేంద్ర దర్యాప్తు సంస్థను ప్రయోగించారు
* చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు కాబట్టే ఆయనపై సీబీఐ దర్యాప్తులు లేవు
* దర్యాప్తులు చేయించడం లేదు కాబట్టే చంద్రబాబు అవిశ్వాసం పెట్టలేదు 

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఇచ్చిన మాట కోసం నిలబడ్డాడని.. అందుకోసం ఎందాకైనా నడిచేందుకు సిద్ధమయ్యాడని.. నాన్న కోసం గుండెపగిలిన ఆత్మబంధువుల కుటుంబాలను ఓదార్చేందుకు ఓదార్పు యాత్ర చేస్తున్నాడన్న కక్షతో కాంగ్రెస్ పార్టీ జగనన్నను పొగబెట్టి పార్టీ నుంచి బయటికి పంపించింది. జగనన్న ఆ పార్టీకి వ్యతిరేకయ్యాడు కాబట్టే ఆయన మీద సీబీఐ అస్త్రం ప్రయోగించింది. అబద్ధపు కేసులు పెట్టి నాలుగు గోడల మధ్య బంధించింది. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు కాబట్టే సీబీఐ ఆయన మీద ఏ కేసులూ పెట్టదు... ఏ విచారణలూ చేయదు. 

సీబీఐ కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలుబొమ్మ అని తమిళనాడు సంఘటన(డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఇంట్లో సీబీఐ సోదాలు)తో మరోసారి రుజువైంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వంతో కుమ్మక్కైన చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం గుంటూరు జిల్లా తెనాలి, మంగళగిరి నియోజకవర్గాల్లో సాగింది. అక్రమ కేసులతో జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో బంధించడాన్ని నిరసిస్తూ.. నల్ల బ్యాడ్జీలు ధరించిన ప్రజలు దుగ్గిరాల మండల కేంద్రానికి భారీ ఎత్తున తరలి వచ్చారు. వారిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

వ్యతిరేకిస్తే సీబీఐ దాడులే..

సీబీఐ గురించి చెప్పాల్సివస్తే ‘అది కేంద్రం చేతిలో కీలుబొమ్మ’ అని దాని మాజీ డెరైక్టర్ జోగీందర్ సింగే స్వయంగా చెప్పారు. ‘జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే ఈ పాటికి ఏ మంత్రో.. ముఖ్యమంత్రో అయిపోయి ఉండేవారు’ అని స్వయంగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకుడు గులాం నబీ ఆజాదే చెప్పారు. తమనువ్యతిరేకించినందుకే ఆయన్ను ఇన్ని తిప్పలు పెడుతున్నామని ఆయనే ఒప్పుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమతో కుమ్మక్కయ్యారు కాబట్టి ఆయనపై సీబీఐ దర్యాప్తులు చేయించడం లేదు. దర్యాప్తులు చేయించడం లేదు కాబట్టి చంద్రబాబు.. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా, వైఎస్సార్ సీపీ అవిశ్వాసం పెడితే మద్దతివ్వకుండా కాపాడుతున్నారు. ఇంతకాలం యూపీఏలో ఉన్న తమిళనాడు పార్టీ డీఎంకే.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు మద్దతు ఉపసంహరించుకుంది. 

మంగళవారం డీఎంకే మద్దతు వెనక్కి తీసుకుంటే.. గురువారం ఉదయం ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఇంటి మీద ఈ సీబీఐ దాడి చేసింది. ఈ నిస్సిగ్గు వ్యవహారం జరిగిన కొన్ని గంటలకే ప్రతిపక్షాలు పార్లమెంటులో దుమ్మెత్తిపోశాయి. వెంటనే సీబీఐని వెనక్కి రమ్మని పిలిచారు. సీబీఐ.. పెట్టెలు సర్దుకొని తలాడించుకుంటూ వెనక్కి వెళ్లిపోయింది. స్వతంత్రంగా పని చేయాల్సిన సీబీఐ ఈ రోజు కేంద్ర పాలకుల చేతిలో కీలుబొమ్మగా మారిందని చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం మాత్రమే. కీలుబొమ్మ కాకపోతే.. దాడులెందుకు చేశారు? ఎందుకు మధ్యలోనే నిలిపేశారు?
కేంద్రం సమాధానం చెప్పాలి..

డీఎంకే మీద సీబీఐ చేత ఎందుకు దాడులు చేయించారు? ఎందుకు మళ్లీ వెనక్కి తీసుకున్నారో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. డీఎంకే మీకు మద్దతు ఉపసంహరించుకుంది గనుకనే వారి మీద దాడులు చేశారా? అని అడుగుతున్నా.. ఒక వేళ అదే నిజమైతే ఆ నిజాన్ని ఒప్పుకోండి. లేదూ అందుకు కాదు.. వాళ్లు అవినీతికి పాల్పడ్డారు.. అందుకే సీబీఐ దాడులు చేసింది అని మీరు చెప్తే..! ఎందుకు మరి దాడులను మధ్యలోనే నిలిపివేసి వచ్చారో చెప్పండి. ఎప్పుడు సీబీఐని ప్రయోగించాలి? ఎవరి మీద ప్రయోగించాలి? ఎలా ప్రయోగించాలి? మళ్లీ వెనక్కి ఎలా తీసుకోవాలో కేంద్ర పాలకులే నిర్ణయిస్తున్నారు. ఇవాళ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందీ అంటే రాజకీయ పార్టీల కంటే సీబీఐ మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగాలని చూస్తోంది. కేంద్రంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉందీ అంటే.. వాళ్ల చేతిలో ఉన్న సీబీఐ అనే అస్త్రం ఒక్కటే కారణం.

ప్రజాస్వామ్యంలో కూడా ఇంత నీచంగా ఆలోచన చేస్తున్న కాంగ్రెస్ పరిపాలన చూసి ఇది మన దురదృష్టం అనుకోవాలో? లేకపోతే తామే దేవుళ్లం.. ఎవరిని కావాలంటే వాళ్లను తొక్కెయ్యగలమని అహంభావంతో వ్యవహరిస్తున్న వీళ్లను చూసి అసహ్యించుకోవాలో అర్థం కావడం లేదు. రాజకీయంగా జగనన్నను ఎదుర్కోలేక సీబీఐని ప్రయోగించి జైల్లో పెట్టారు. నిజంగా వీళ్లకు ధైర్యం ఉంటే.. కాంగ్రెస్, టీడీపీలకు వ్యతిరేకంగా అవిశ్వాసానికి మద్దతు పలికిన 15 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి. కుమ్మక్కు రాజకీయాలు నడిపే మీకు ప్రజల మధ్యకు వచ్చే ధైర్యం ఉందా? అని వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున అడుగుతున్నా. కానీ వారికి ఆ ధైర్యం లేదు. ఉప ఎన్నికలకు వెళ్లినా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ల పార్టీల గుర్తుతో వెళ్లినా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి మొత్తం సీట్లు గెలుచుకుంటుందని వాళ్లకు తెలుసు’’

14.2 కిలోమీటర్ల మేర యాత్ర: పాదయాత్ర 97వ రోజు గురువారం గుంటూరు జిల్లా తెనాలి నుంచి ప్రారంభమైంది. షర్మిల అక్కడి నుంచి తెనాలి పట్టణ వీధుల్లో దాదాపు 3.5 కిలోమీటర్లు నడిచారు. తెనాలిలో గుఱ్ఱం జాషువా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి కటివరం క్రాస్ రోడ్డు , నందివెలుగు మీదుగా దుగ్గిరాల చేరుకున్నారు. ఇక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేశారు. భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. గురువారం మొత్తం 14.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,335.7 కి.మీ యాత్ర పూర్తయింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి.. షర్మిలను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెతో పాటు కొద్దిదూరం నడిచారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో మర్రి రాజశేఖర్, ఆర్‌కే, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, పి. గౌతంరెడ్డి, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు బండారు సాయిబాబు మాదిగ, దేవళ్ల రేవతి, మేరాజోత్ హన్మంతు నాయక్ తదితరులు ఉన్నారు. 

100వ రోజు యాత్రకు హాజరుకానున్న పార్టీ ఎమ్మెల్యేలు

సాక్షి, హైదరాబాద్: ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలందరూ యాత్రకు హాజరవుతున్నారు. ఆదివారంతో యాత్ర వంద రోజులు పూర్తవుతుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆ రోజు సాయంత్రం బహిరంగ సభ జరుగుతుంది.
Share this article :

0 comments: