జగన్‌ను జైల్లోనే ఉంచజూస్తోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ను జైల్లోనే ఉంచజూస్తోంది

జగన్‌ను జైల్లోనే ఉంచజూస్తోంది

Written By news on Monday, March 25, 2013 | 3/25/2013

ప్రజాదరణ ఉన్న నేతను అక్రమంగా నిర్బంధించారు.. జగన్ విషయంలో సీబీఐకి వ్యక్తిగత ఎజెండా ఉందా?

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇంకా సాధ్యమైనంత ఎక్కువ కాలం జైల్లో ఉంచాలని సీబీఐ ప్రయత్నిస్తోందని పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీపీ రామచంద్రరావును విచారించిన అనంతరం శనివారం సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ మీడియాతో చేసిన వ్యాఖ్యలను బట్టి ఈ విషయమై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీబీఐ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘సుప్రీంకోర్టు చెప్పినట్టుగా మార్చి 31 లోపు చార్జిషీటు వేస్తారా అని అడిగిన విలేకరులకు, మీరే అలా రాసుకున్నార ని జేడీ చెప్పడం సరికాదు. సుప్రీం ఆదేశాలున్నాయని గుర్తు చేసినా... ‘ఎక్కడున్నాయి? ఒకసారి వెబ్‌సైట్‌లో చూసుకోండి’ అంటూ సమాధానమిచ్చారు. విచారణ పేరుతో జగన్‌ను ఇంకా ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని భావిస్తున్నట్టు దీన్ని బట్టి తెలుస్తోంది’’ అని ఆరోపించారు. 

అసలు జగన్‌ను ఎందుకు ఎక్కువ కాలం జైల్లో పెట్టాలని అనుకుంటున్నారో చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. ‘‘జగన్‌ను పది నెలలుగా అన్యాయంగా అక్రమంగా నిర్బంధించి, ఇప్పుడు కూడా బయటకు రానీయొద్దని సీబీఐ ప్రయత్నిస్తోందంటే ఆయన విషయంలో వారికి వ్యక్తిగత ఎజెండా ఏమైనా ఉందా? అసలు సీబీఐకి ఎక్కడి నుంచి ఆదేశాలందుతున్నాయి? దాన్ని నడిపిస్తున్నదెవరు? ఎవరు చెబితే ఇలా వ్యవహరిస్తున్నారో చెప్పాలి. సీబీఐ చట్టబద్ధంగా వ్యవహరిస్తోందో, లేక ఈ కేసులను రాజకీయ కోణంలో చూస్తోందో ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. ఫక్తు రాజకీయ కోణంలోనే చూస్తున్నారని స్పష్టమవుతోందన్నారు. సీబీఐని ఎవరు నడిపిస్తున్నారో యూపీఏకు డీఎంకే మద్దతు ఉపసంహరించగానే ఆ పార్టీ అధినేత కుమారుని ఇంటిపై సంస్థ దాడితో బహిరంగంగా రుజువైందన్నారు. ‘ప్రధాని, కేంద్ర హోంమంత్రి జోక్యం చేసుకుని ఆ దాడులను ఆపారు. అవి దురదృష్టకరమంటూ క్షమాపణలు చెప్పారు’ అని గుర్తు చేశారు. చట్టబద్ధంగా వ్యవహరించాలే తప్ప కాంగ్రెస్, టీడీపీ చేతుల్లో కీలుబొమ్మగా మారొద్దని అంబటి హితవు పలికారు.

అప్పుడేం చెప్పారు?

2012 అక్టోబర్ 5న జగన్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలను ఓసారి జేడీ గుర్తు తెచ్చుకోవాలని అంబటి సూచించారు. ‘‘మొత్తం విచారణ ఎప్పుడు పూర్తి చేస్తారని కోర్టు ప్రశ్నించగా, రెండు లేదా మూడు నెలల్లో అని సీబీఐ న్యాయవాదులు తెలిపారు. అఫిడవిట్‌లోనూ దాన్నే పొందుపరిచారు. మార్చిలోపు పూర్తి చేయాలని సుప్రీం చెప్పింది. రెండు మూడు నెలల్లో పూర్తి చేస్తామని సీబీఐ చెబుతుంటే మార్చి 31లోపు పూర్తి చేయమనడం సబబు కాదని జగన్ తరపు న్యాయవాదులు చెప్పడంతో, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కోర్టు చెప్పింది కదా! కానీ ఈ ఆరు నెలలూ చోద్యం చూస్తూ గడిపిన సీబీఐ, ఇప్పుడు మళ్లీ ఇలా మాట్లాడటం ధర్మమేనా’’ అని ప్రశ్నించారు. 2011 జూలైలో హైకోర్టు ఆదేశిస్తే ఆగస్టు 17వ తేదీన ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. అప్పటి నుంచీ 2012 మే దాకా జగన్‌ను కనీసం విచారణకు కూడా పిలవకుండా, 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ప్రచారం ఊపులో ఉన్నప్పుడు విచారణ పేరుతో పిలిచి అరెస్టు చేశారు. ప్రజాదరణ గల నేత బెయిల్‌పై వెళ్లేందుకు వీలుగా చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన సంస్థ ఇలా చేయడం తగదు. ‘అదుపులోకి తీసుకున్న 90 రోజుల్లోపు చార్జిషీటు వేయకపోతే ముద్దాయిని నిర్బంధించరాదనే నిబంధనలున్నాయి. అయినా జగన్‌ను అక్రమంగా నిర్బంధించడం కేవలం కాంగ్రెస్, టీడీపీకి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చడానికేనని తెలిసిపోతోంది. జగన్‌ను ఎక్కువ కాలం అరెస్టు చేస్తే వారికి లబ్ధి చేకూరుతుందని సీబీఐ భావిస్తోంది’’ అంటూ దుయ్యబట్టారు. సీబీఐ కేసులున్న మాజీ ముఖ్యమంత్రులు ములాయంసింగ్ యాదవ్, మాయావతిలను సంస్థ అరెస్టు చేసిందా అని ప్రశ్నించారు. ‘‘అరెస్టు చేస్తే వారు యూపీఏకు మద్దతు ఉపసంహరిస్తారనే భయంతో చేయలేదు. కానీ రాష్ట్రంలో సోనియాను, కాంగ్రెస్ పార్టీని జగన్ తుక్కుతుక్కుగా ఓడిస్తున్నారు కనుక జగన్‌ను జైల్లో పెట్టారు. ఆయన ఇంటిపై దాడులు చేశారు. రాష్ట్రాన్ని ఐదేళ్లకు పైగా పాలించిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుణ్ని జైల్లో పెడతారా? ఇంతకంటే అన్యాయం ఏముంటుంది?’’ అని ప్రశ్నించారు.

పార్టీ మరింత ఎదుగుతుంది

జగన్‌ను జైల్లో పెట్టే పథకాన్ని రచించి అమలు చేస్తున్న వారు ఒక విషయం తెలుసుకోవాలని అంబటి అన్నారు. ఆయన ఎన్ని రోజులు లోపల ఉన్నా వైఎస్సార్‌సీపీ దినదిన ప్రవర్ధమానం అవుతుందే తప్ప పార్టీకి కించిత్ కూడా నష్టం వాటిల్లదని స్పష్టం చేశారు. ‘‘పార్టీని చిదిమేయాలన్న వారి ప్రయత్నాలు ఏమాత్రం ఫలించవు. ఓవైపు గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పార్టీకి సారథ్యం వహించి ముందుకు నడుపుతున్నారు. మరోవైపు జగన్ సోదరి షర్మిల చరిత్రాత్మక రీతిలో పాదయాత్ర చేస్తున్నారు. ఇద్దరు మహిళలూ చరిత్ర సృష్టిస్తున్నారు’’ అని గుర్తు చేశారు.

మీ బండారం ముందే బయటపడింది

కేసులో మొత్తం ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది కార్యదర్శులున్నా ఒక్క మంత్రినే అరెస్టు చేయడంలోని ఔచిత్యాన్ని అంబటి ప్రశ్నించారు. సీబీఐ బండారం ఇక్కడే బయటపడిందన్నారు. ‘‘ఒక మంత్రినేమో అరెస్టు చేస్తారు. ఇదే కేసులో ఉన్న మరో మంత్రికి మాత్రం వెంటనే బెయిల్ లభిస్తుంది. మిగతా మంత్రులు, కార్యదర్శులు స్వేచ్ఛగా తిరుగుతుంటారు. 26 జీవోలను ధర్మబద్ధంగానే జారీ చేశామని వారంతా సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. జీవోలు ధర్మబద్ధమే అయినప్పుడు ఇక జగన్‌పై కేసెక్కడిది? ఈ వ్యవహారంలో జగన్‌ను అదృశ్య శక్తిగా చూపారు. ఆయన అదృశ్యంగా జోక్యం చేసుకున్నారని పేర్కొన్నారు. నిజానికి జీవోలు జారీ చేసింది మంత్రులు, కార్యదర్శుల వంటి దృశ్య శక్తులు. కనిపిస్తున్న ఈ శక్తులను వదలి వేసి జగన్‌ను అరెస్టు చేశారు. దర్యాప్తు ఎంత వివక్షాపూరితంగా సాగుతోందో దీన్ని బట్టే అర్థమవుతోంది. ఒక రాక్షస క్రీడకు తెర తీశారు. ఇలా చేస్తున్నందుకు ప్రజాస్వామ్యంలో ఏదో ఒక రోజు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకే సక్రమంగా వ్యవహరించండి, న్యాయాన్ని కాపాడండి’’ అని సూచించారు.
Share this article :

0 comments: