షర్మిలను కలిసి కష్టాలు చెప్పుకున్న రైతులు, మహిళలు, విద్యార్థులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిలను కలిసి కష్టాలు చెప్పుకున్న రైతులు, మహిళలు, విద్యార్థులు

షర్మిలను కలిసి కష్టాలు చెప్పుకున్న రైతులు, మహిళలు, విద్యార్థులు

Written By news on Friday, March 8, 2013 | 3/08/2013

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’గురువారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 84, కిలోమీటర్లు: 1,165
యాత్రలో షర్మిలను కలిసి కష్టాలు చెప్పుకున్న రైతులు, మహిళలు, విద్యార్థులు
కరెంటు కోతలపై ఆగ్రహం.. ప్రభుత్వంపై కన్నెర్ర
పెరిగిన ధరలతో బతకలేకపోతున్నామని ఆవేదన
అధైర్య పడొద్దని ధైర్యం చెప్పిన షర్మిల
జగనన్న వస్తే రాజన్న రాజ్యం తెస్తాడని భరోసా
ప్రభుత్వం ప్రజల్ని గాలికొదిలేసిందని ధ్వజం
ఆ ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై అవిశ్వాసం పెట్టడం లేదని విమర్శ

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ప్రజల బాధలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వానికి, పనికిరాని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకూ ఓటు ద్వారా తగిన గుణపాఠం నేర్పాలన్నారు. రాష్ట్ర ప్రజానీకాన్ని గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కారు వైఖరికి, దానికి తెరచాటు మద్దతు పలుకున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వైఖరికీ నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం గుంటూరు జిల్లా నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో కొనసాగింది. యాత్రలో భాగంగా నాదెండ్ల మండలం టి.చందవరంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం షర్మిల మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. 

అంతకుముందు యాత్రలో షర్మిలను కలిసిన రైతులు, మహిళలు, విద్యార్థులు తమ కష్టాలు చెప్పుకున్నారు. పెట్టుబడి ఖర్చులు, ఎరువుల ధరలు, పావలా వడ్డీ, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా పలు విషయాల్లో తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. ఇన్ని కష్టాలతో సతమతమవుతుంటే.. తాజాగా కరెంటు కోతలతో గ్రామాల్లో చీకట్లు తప్ప వెలుగే లేకుండా పోయిందని మండిపడ్డారు. పెరిగిన ధరలతో బతకలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. అధైర్య పడొద్దని వారందరికీ ధైర్యం చెప్పిన షర్మిల.. జగనన్న వస్తే రాజన్న నాటి సువర్ణయుగం తిరిగి తెస్తాడని, అన్ని వర్గాల ప్రజల కష్టాలను తీరుస్తాడని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ప్రజల్ని పూర్తిగా గాలికొదిలేసిందని, తమ పదవులు కాపాడుకోవడానికే మంత్రులకు సమయమంతా సరిపోతుందని షర్మిల విమర్శించారు. ప్రజలు ఇన్ని కష్టాలతో సతమతమవుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబుకు చీమ కుట్టినట్లయినా లేదని, తన మీద కేసులపై దర్యాప్తు జరగకుండా ఉండేందుకు ఆయన ప్రభుత్వంతో కుమ్మక్కై అవిశ్వాసం పెట్టడం లేదని నిప్పులు చెరిగారు.

పదెకరాలు సాగు చేశా.. కప్పులు కడుగుతున్నా..

నాదెండ్ల మండలం సాతులూరులో షేక్ ఆదం షఫీ.. షర్మిలను కలిసి మాట్లాడుతూ.. ‘‘పదెకరాల పొలంలో పంటలేసి అకాల వర్షంతో నిండా మునిగిపోయా. మూడెకరాల్లో జొన్న, మూడెకరాల్లో పచ్చి శనగ, మరో నాలుగెకరాల్లో ఇతర పంటలేశా. మొన్న వచ్చిన వర్షాలకు పంటంతా నీటి పాలైంది. బంగారం కుదువపెట్టి రూ.60 వేలు తెచ్చి పెట్టుబడి పెడితే ఒక్క రూపాయి కూడా రాలా. ప్రభుత్వం సాయం చేస్తదనుకుంటే ఇంత వరకూ మమ్మల్ని పట్టించుకున్నవారు లేరు. ఇక గతిలేక టీ దుకాణం పెట్టుకుని కప్పులు కడుగుతున్నా’’ అని కంటతడి పెట్టాడు. షఫీని ఓదార్చిన షర్మిల.. వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు బాధలను తన బాధలుగా భావించి వారికి అండగా నిలిచారని, మళ్లీ జగనన్న వస్తే రైతుల కష్టాలను తీరుస్తారని ధైర్యం చెప్పారు.

అంతకుముందు ఫిరంగిపురం మండలం మునగపాడుకు చెందిన కొమిరిపూడి మొహిద్దీన్ షర్మిలను కలిసి మాట్లాడుతూ.. ఉన్న కొద్ది పొలంలో మినుము వేశానని, చివరకు కరెంటు లేకపోవడంతో నీరివ్వలేక పొలాన్ని పశువులకు వదిలి వేశానని వాపోయాడు. రైతుల కష్టాలు తీరే రోజులు దగ్గరలోనే ఉన్నాయని షర్మిల భరోసా కల్పించగా..‘రాజన్న రాజ్యం మళ్లీ రావాలమ్మా’ అంటూ నినాదాలు చేశాడు.

84వ రోజు పాదయాత్ర గురువారం ఉదయం 10 గంటలకు నరసరావుపేటలో ప్రారంభమై జొన్నలగడ్డ, సాతులూరు, టి.చందవరం మీదుగా సాగింది. టి.చందవరం శివారులో ఏర్పాటు చేసిన బసకు రాత్రి 7.30 గంటలకు షర్మిల చేరుకున్నారు. గురువారం మొత్తం 12.5 కిలోమీటర్లు నడిచారు. 
Share this article :

0 comments: