ఘన విజయానికి సన్నద్ధం కావాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఘన విజయానికి సన్నద్ధం కావాలి

ఘన విజయానికి సన్నద్ధం కావాలి

Written By ysrcongress on Wednesday, March 13, 2013 | 3/13/2013

* తెలుగు వారి ఆత్మాభిమానాన్ని కాపాడటానికి జగన్ తెగువతో పార్టీ ఏర్పడింది
* ఈ రెండేళ్లలో ఇంటింటి పార్టీగా రూపుదిద్దుకుంది
* అధికారకాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ ప్రజాసమస్యలను గాలికి వదిలేశాయి
* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షంగా నిలబడి వారి కోసం పోరాటాలు చేస్తోంది
* నల్ల కాలువ వద్ద ఇచ్చిన మాట కోసం జగన్‌బాబు తెగింపు చేశారు
* జగన్‌కు తెలుసు.. కష్టాలు వస్తాయని.. అయినా తెలుగువారి ఆత్మాభిమానాన్ని కాపాడటానికి పార్టీని పెట్టారు
* చంద్రబాబు మాటలు సభ్యసమాజం ఒప్పుకునే విధంగా కూడా లేవు
* వీళ్లందరికీ జవాబు చెప్పే రోజు వస్తోంది
* వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి 

సాక్షి, హైదరాబాద్: తెలుగువారి ఆత్మాభిమానాన్ని కాపాడటానికి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తెగువతో ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత రెండేళ్లలో ఇంటింటి పార్టీగా రూపుదిద్దుకుందని, వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించడానికి పార్టీ శ్రేణులు సర్వసన్నద్ధం కావాలని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. అధికారపక్షంగా కాంగ్రెస్, ప్రతిపక్షంగా టీడీపీ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షంగా నిలబడి వారి కోసం పోరాటాలు చేస్తోందని, ఇదే ఒరవడిని కొనసాగించాలని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ కుట్రలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పే రోజు మరెంతో దూరం లేదని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ స్థాపించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వ్యవస్థాపక దినోత్సవంలో ఆమె పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇచ్చిన సందేశంలో పార్టీ కార్యకర్తలు నిరంతరం ప్రజలతో మమేకమై వారికి అండగా నిలవాలని కోరారు. బూత్, వార్డు కమిటీల ఏర్పాటులో నిమగ్నమై పార్టీని మరింత పట్టిష్టం చేయాలన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత రాష్ట్రం ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని, ప్రజలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని తెలిపారు. పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరిస్తూ.. ‘ప్రజల కోసం వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆయన మరణం తరువాత తూట్లు పొడవడం ప్రారంభించారు. ఈ విధానాలపై పోరాడటానికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది.

వైఎస్ మృతిని జీర్ణించుకోలేక 700 మంది మరణిస్తే, వారి కుటుంబాలను ఓదార్చాలని జగన్ భావించారు. ఇందుకు కాంగ్రెస్ నాయకత్వం ఒప్పుకోలేదు. కానీ, నల్ల కాలువ వద్ద ఇచ్చిన మాట కోసం జగన్‌బాబు తెగింపు చేశారు. జగన్‌కు తెలుసు.. తనకు కష్టాలు వస్తాయని. అయినా తెలుగువారి ఆత్మాభిమానాన్ని కాపాడటానికి పార్టీని ప్రారంభించారు’’ అని చెప్పారు. ‘‘మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న వైఎస్ నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నారు. వారి సమస్యల పరిష్కారానికి తపన పడ్డారు. జగన్ కూడా గత రెండున్నరేళ్లలో నెలకు 25 రోజులు ప్రజల మధ్యనే గడిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎన్నో పోరాటాలు చేపట్టారు. ఇప్పుడు జైల్లో ఉన్నా కూడా ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. మేము జగన్‌ను కలవడానికి ఎప్పుడు వెళ్లినా ప్రజా సమస్యలపై ఆ దీక్ష చేయండి, ఈ దీక్ష చేయండి అని చెబుతున్నారు’’ అని విజయమ్మ చెప్పారు. 

ఇదేం న్యాయం..!
‘‘జగన్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినప్పుడు అరెస్టు చేయరని కోర్టు చెప్పింది. సీబీఐ మాత్రం ఆయన్ని విచారణ పేరుతో పిలిచి అరెస్టు చేసింది. జగన్ బయట ఉంటే విచారణను, సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ సాకులు చెబుతోంది. విచారణ ప్రా రంభమైనప్పటి నుంచి 10 నెలలపాటు జగన్ బయటే ఉన్నారు కదా! ఏరోజైనా ఎవరినైనా ప్రభావితం చేశారా? ఆయన ఎవ్వరినీ ప్రభావితం చేయలేదు. కానీ జగన్ ఒక పార్టీకి అధ్యక్షుడని, ఎంపీ అని, అందువల్ల ప్రభావితం చేస్తారని చెప్పారు. జగన్ నిన్న, ఇవాళ, రాబోయే రోజుల్లో కూడా పార్టీ అధ్యక్షుడుగానే ఉంటారు. అయినంత మాత్రాన ప్రభావితం చేస్తారా’’ అని ప్రశ్నించారు.

మమ్మల్ని విమర్శించడమే బాబు పని
‘‘చంద్రబాబునాయుడు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. మమ్మల్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఆయన మాట్లాడుతున్న మాటలు సభ్యసమాజం ఒప్పుకునే విధంగా కూడా లేవు. మూడున్నరేళ్ల క్రితం మృతి చెందిన వైఎస్‌ను తొలుత విమర్శించారు. ఆ తరువాత జగన్‌బాబును విమర్శించారు. నన్ను, నా మతం గురించి మాట్లాడారు. ఇప్పుడు షర్మిల పాదయాత్రకు మంచి స్పందన రావడం చూసి ఆమెపైనా, ఆమె భర్తపైనా అన్యాయంగా మాట్లాడుతున్నారు. వీళ్లందరికీ జవాబు చెప్పే రోజు వస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి మళ్లీ వైఎస్సార్ హయాంనాటి సువర్ణ పాలనను తెచ్చుకోవాలి’’ అని ఆమె చెప్పారు. 

ప్రజల అండతోనే నిలబడ్డాం
ఈ రెండేళ్లలో ప్రజలు మాపై చూపిన అభిమానం చాలా గొప్పది. 20 మంది మంత్రులు మోహరించినా, మా కుటుంబంలో కల తలు రేపేందుకు ప్రయత్నించినా కడప ఉప ఎన్నికల్లో జగన్‌ను, నన్ను రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించారు. ఉప ఎన్నికల్లో కూడా భారీ ఆధిక్యతతో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారు. కొన్ని చోట్ల కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా కోల్పోయారు. ఈరోజు మేం నిలబడ్డామంటే మీ (ప్రజల) అండదండలు, ప్రేమాభిమానాల వల్ల మాత్రమే. మీకందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కుటుంబంతో నిలబడినందుకు, మాకోసం ప్రార్థనలు చేసినందుకు, మా వెంట నడిచినందుకు అందరికీ హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను’’ అని విజయమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శాసన సభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, పలువురు ముఖ్య నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని విజయమ్మ ప్రారంభించారు. వైఎస్ జ్ఞాపకాలతో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ఆమె తిలకించారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 

గన్‌పార్క్ నుంచి కాలినడకన అసెంబ్లీలోకి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు
రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని వైఎస్సార్‌కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నివాసంలో బధవారం ఉదయం 8.30 గంటలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కలుసుకుంటారు. వారంతా అక్కడి నుంచి నేరుగా పంజాగుట్ట ఫ్లైఓవర్ చేరుకొని వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి అసెంబ్లీ వద్ద గల గన్‌పార్క్‌కు వెళతారు. గన్‌పార్క్ నుంచి విజయమ్మ ఆధ్వర్యంలో కాలినడకన అసెంబ్లీకి చేరుకుంటారు.
Share this article :

0 comments: