నాయకుడా..ఊసరవెల్లా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాయకుడా..ఊసరవెల్లా?

నాయకుడా..ఊసరవెల్లా?

Written By news on Wednesday, March 27, 2013 | 3/27/2013


చంద్రబాబుపై షర్మిల నిప్పులు
బాబు విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తే..
వైఎస్ కరెంటు చార్జీలు వసూలు చేశారట!
8సార్లు కరెంటు చార్జీలు పెంచిన ఘనుడు చంద్రబాబు
బిల్లులు కట్టని వారిని జైల్లో పెట్టేందుకు ప్రత్యేకంగా పోలీసు స్టేషన్లు పెట్టారుస్కాలర్‌షిప్ ఇవ్వాలని, మెస్ చార్జీలు పెంచాలని అడిగిన విద్యార్థులను లాఠీలతో కొట్టించారు
కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిన మరో ప్రజాప్రస్థానం
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ మంగళవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 102, కిలోమీటర్లు: 1,393.1

పాదయాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డిగారు కరెంటు చార్జీలు వసూలు చేస్తే తాను విద్యుత్తు బకాయిలు మాఫీ చేశానని చంద్రబాబుగారు పాదయాత్రలో చెప్పుకుంటున్నారు.. ఆయన 2,500 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేశారట.. ఆ సంతోషంలో మతి చలించి ఇలా మాట్లాడుతున్నారో.. లేక అంత దూరం నడిచినా కూడా అధికారం వచ్చే అవకాశం లేదనే నిరాశతో మతి భ్రమించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. చంద్రబాబు పాలనలో రూ.50 ఉన్న హార్స్ పవర్‌ను రూ.625కు పెంచారు. ఆయన ఎనిమిదేళ్ల ఎనిమిది నెలలు ముఖ్యమంత్రిగా ఉండి 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. విద్యుత్తు చార్జీలు ఏటేటా పెంచుతానని, రైతుల మీద భారం వేస్తానని ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం పెట్టుకున్నారు.

కరెంటు చార్జీలు కట్టని రైతులను జైల్లో పెట్టేందుకు ప్రత్యేకంగా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసిన మనిషి ఈ చంద్రబాబు నాయుడు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. ‘‘వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే.. రైతులకు ఏడు గంటల ఉచిత విద్యుత్తు ఫైలుపై సంతకం చేశారు. అదేరోజు రూ.1,400 కోట్ల బకాయిలను మాఫీ చేస్తూ మరో సంతకం చేశారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు హయాంలో విద్యుత్ బకాయిలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు రూ.1.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు.

అవన్నీ మర్చిపోయి ఈ రోజు నిస్సిగ్గుగా చంద్రబాబు అబద్ధపు మాటలు చెప్తున్నారు. రాజకీయ అవసరాల కోసం పూటకో అబద్ధం చెబుతున్న ఆయనను నాయకుడు అంటారా? ఊసరవెల్లి అంటారా..’’ అంటూ నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఏడు జిల్లాలు పూర్తి చేసుకొని మంగళవారం ఎనిమిదో జిల్లా కృష్ణాలోకి అడుగు పెట్టింది. 31 రోజులపాటు షర్మిలను తమ ఇంటి ఆడబిడ్డగా గుండెలో పెట్టుకొని ఆదరించిన గుంటూరు ప్రజలు.. కృష్ణా నదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజ్‌ను దాటించి కృష్ణా జిల్లా వరకు సాగనంపారు. సాయంత్రం విజయవాడలో అయ్యదేవర కాళేశ్వర్‌రావు మార్కెట్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

పేదలంటే చంద్రబాబుకు చిన్నచూపు..: చంద్రబాబు తన పాదయాత్రలో ఇంకో మాట కూడా అంటున్నారు. పేదలు ఎక్కడ ఉంటారో.. ఆయన అక్కడ ఉంటారట.. ఆ మాట విన్నప్పుడు నాకు నవ్వొచ్చింది. ఇదే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి బిల్‌క్లింటన్ వస్తున్నాడని హైదరాబాద్‌లో ఉన్న భిక్షగాళ్లను, చిత్తుకాగితాలు ఏరుకునే వారిని బలవంతంగా లారీలు ఎక్కించి వాళ్లను ఊరి బయటకు విసిరిపారేయించిన ఘనుడు. ఆయనకు పేదవాళ్లంటే అంత నిర్లక్ష్యం.. అంత చిన్నచూపు. పేదలను ఆయన కనీసం మనుషుల్లా కూడా చూడలేదు. పురుగుల్లా చూశారు. తొమ్మిదేళ్ల పాలనలో ఆయన ఏనాడూ పేదల గురించి ఆలోచించలేదు. పేద విద్యార్థులు ‘మేం చదువుకోలేక పోతున్నాం.. మాకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వండి.. మెస్ చార్జీలు పెంచండి..’ అని అడిగిన పాపానికి వారిని లాఠీలతో కొట్టించిన దుర్మార్గపు సీఎం ఈ చంద్రబాబు. పేదలు వైద్యం చేయించుకునే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా యూజర్ చార్జీలు వసూలు చేశారు. అలాంటి మనిషి ఇప్పుడు పేదల గురించి మాట్లాడుతున్నారు.

వ్యాటు పోరుకు మా మద్దతు: తిండి, నీరు, బట్ట.. ఈ మూడు మనిషికి కావలసిన కనీస అవసరాలు. ఈ మాత్రం ఇంగితం కూడా లేకుండా ఈ ప్రభుత్వం ఇప్పుడు వస్త్రాల మీద కూడా వ్యాట్ వేసింది. మన రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది వస్త్ర పరిశ్రమపైనే ఆధారపడి బతుకుతున్నారు. వాళ్లను కూడా వదలకుండా ఈ ప్రభుత్వం వస్త్రాల మీద 5 శాతం వ్యాట్ వేసింది. మా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.. వ్యాట్‌ను దించండని వస్త్రవ్యాపారులు 18 రోజులుగా దీక్ష చేస్తున్నా... ప్రభుత్వం మనసు కరగడం లేదు. ఇది మనసు, మానవత్వం లేని ప్రభుత్వం. వస్త్ర వ్యాపారుల న్యాయమైన డిమాండ్‌కు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ల తరపున నిలబడుతుందని వాగ్దానం చేస్తున్నా. వస్త్రాలపై వ్యాట్‌ను నిరసిస్తూ జగనన్న ధర్నా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్త్రాలపై వ్యాట్‌ను తొలగిస్తానని మాటిచ్చారు. ఏ వర్గానికి అన్యాయం జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని మాటిస్తున్నా..

మంగళవారం 102వ రోజు మరో ప్రజాప్రస్థానం గుంటూరు జిల్లా సీతానగరం నుంచి ప్రారంభమైంది. ప్రకాశం బ్యారేజ్ దాటి షర్మిల కృష్ణా జిల్లా విజయవాడలోకి అడుగుపెట్టారు. కాళేశ్వర్‌రావు మార్కెట్ సెంటర్‌లో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పాత రాజేశ్వరీపేటలో ఏర్పాటు చేసిన బసకు రాత్రి 9 గంటలకు చేరుకున్నారు. మంగళవారం 7.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 1,393.1 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, జిట్టా బాలకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్, ఆర్కే, అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి, ముదునూరి ప్రసాదరాజు, తలశిల రఘురాం, కృష్ణా జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, వంగవీటి రాధ, గౌతంరెడ్డి, కావటి మనోహర్ నాయుడు, జలీల్‌ఖాన్, తాడి శకుంతల, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ గోసుల శివభారత్‌రెడ్డి, డాక్టర్ హరికృష్ణ తదితరులున్నారు.

ఈ ప్రభుత్వంపై బాబుకే భరోసా

‘‘ఈ పాలకులకు ఎవరి మీదా ప్రేమ లేదు. ప్రజలకు ఈ ప్రభుత్వం మీద భరోసా లేదు. ఈ ప్రభుత్వం మీద చంద్రబాబుకు మాత్రమే భరోసా ఉంది. పాదయాత్రలో ప్రజల కష్టాలను చూస్తూ కూడా ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని పడగొట్టకపోగా.. దాన్ని కాపాడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెడితే దానికి మద్దతు పలకకుండా.. ప్రజల పక్షాన నిలబడకుండా ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఉందీ అంటే.. ఆ పాపం చంద్రబాబుదే. బాబు ఇది పనికిరాని ప్రభుత్వం అన్నారు.. తుగ్లక్ పాలన అన్నారు. కత్తులు, గొడ్డళ్లు తీసుకొని ఈ ప్రభుత్వాన్ని నరికేయాలని అన్నారు. ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు గారు చేతల్లోకి వచ్చేసరికి ప్రభుత్వ పక్షాన నిలబడి.. అది కూలిపోకుండా కాపాడుతున్నారు’’
- షర్మిల
Share this article :

0 comments: