ఈ కోట ఏ కంపెనీది రామోజీ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ కోట ఏ కంపెనీది రామోజీ?

ఈ కోట ఏ కంపెనీది రామోజీ?

Written By ysrcongress on Sunday, March 17, 2013 | 3/17/2013

* అవిశ్వాసంపై బాబును వెనకేసుకొచ్చేందుకు రామోజీ ప్రయత్నం
* ఆ అంశాన్ని వదిలి మొదటిపేజీ నిండా జగన్‌కు వ్యతిరేకంగా కథనం
* వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెంగళూరులో నివసించిన భవంతిపై అవాస్తవాలు
* ఆ భవనంలో జగన్ కొన్నాళ్లు నివాసం ఉంటే అది ఆయన వ్యక్తిగత ఆస్తా?
* కంపెనీ పేరిట ఉన్నపుడు దాన్నొక వెంచర్‌గా చూడొద్దా?
* రియల్టీ సంస్థలు భూములు, భవనాలపై పెట్టుబడులు పెట్టడం సహజం
* వాటి విలువ పెరిగితే ఆ ఇన్వెస్ట్‌మెంట్లపై లాభాలొచ్చినట్లే; బెంగళూర్లో జరిగిందిదే
* భారతి సిమెంట్‌లో 20 శాతం వాటా సహా సిలికాన్ బిల్డర్స్‌కు పలు ఆస్తులు
* భారతిలో వాటా విలువే గతంలో రూ.671 కోట్లు; ప్రస్తుతం ఇంకా అధికం
* మిగిలిన అనుబంధ సంస్థలకూ ఆస్తులు; పట్టిక కట్టి మరీ చెప్పిన ఈనాడు
* మరి ఆస్తులున్నపుడు ఆ కంపెనీల్లో పెట్టుబడులు తప్పెలా అవుతాయి?
* ఏ కొంచెం వెనకాముందూ లేకుండా రామోజీ తప్పుడు రాతలు 

మరి కాసేపట్లో అవిశ్వాసం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందంటూ వైఎస్సార్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి నోటీసులిచ్చాయి. ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కలిసి రావాలంటూ ఇతర ప్రతిపక్షాలన్నిటికీ పిలుపునిచ్చాయి. ఇదీ... గురువారం ఉదయం నాటి పరిస్థితి. కానీ.. నాలుగు దశాబ్దాలుగా తెలుగువారి ఆత్మనంటూ ఘోషిస్తున్న ‘ఈనాడు’కు ఇదేమీ ముఖ్యమనిపించలేదు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల ఆడిటర్ గతంలో దర్యాప్తు సంస్థలకు ఇచ్చిన వాంగ్మూలమే ముఖ్యమనిపించింది. దాన్ని తోచినట్లు వక్రీకరిస్తూ మొదటి పేజీలో ఆరుకాలాల నిండా వార్త వండి, వడ్డించింది. పోనీ అందులో ‘ఈనాడు’ సొంతగా కనుక్కున్న విషయమేమైనా ఉందా అంటే... సున్నా! ఆడిటర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కావాల్సిన మసాలా జోడించి, వంద వక్రీకరణలు చేసి మరీ వదిలారు రామోజీ!! విశాఖలో వేరొకరి స్థలం లాక్కుని... దానికి వచ్చిన పరిహారాన్ని సైతం దిగమింగి... ఆ తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఫోర్జరీకి సైతం తెగించిన ఈ రాజగురివిందకు ఇతరులు చేసే ప్రతి మామూలు పనీ తప్పు అనిపించటంలో విచిత్రమేమీ లేదు. అలాంటి రామోజీ... అవిశ్వాస తీర్మానం అంశాన్ని మరుగున పరిచేందుకు, తెలుగుదేశం కుట్రబుద్ధిని, కుమ్మక్కును కప్పిపుచ్చడానికి గురువారం మరికొంత దిగజారిపోయారు. పాత్రికేయ విలువలన్నీ బాబుకొదిలేసి... ‘‘అంతా ముడుపుల దక్షతే’’ అంటూ మొదటి పేజీలో ఆరుకాలాల నిండా ఓ కథనాన్ని వండి వార్చారు. నిమ్మగడ్డ ప్రసాద్ సంస్థల నుంచి వచ్చిన నిధుల్ని వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సొంత ఆస్తుల్ని కూడబెట్టుకోవటానికి వాడుకున్నారంటూ ఆయన రాసిన రాతల్లో నిజమెంత? రామోజీ ఆరోపణల్లో ‘‘ఏది నిజం?’’ 

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
అసలు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి గతంలో బెంగళూరులో నివాసం ఉన్న భవనం గురించి ‘ఈనాడు’ ఇంతకుముందు ఎన్నిసార్లు రాయలేదు? దాని పక్కనున్న ఇతర భవనాల్ని కూడా ఈ ఖాతాలోకే వేసేస్తూ కావాలని తీసిన ఫోటోను గతంలో ఎన్నిసార్లు ప్రచురించలేదు? పెపైచ్చు నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులకు లింకు పెడుతూ... జగన్ వ్యక్తిగత ఆస్తులంటూ రాతలు!! అయినా ఇందులో తప్పేముంది? వ్యాపార సంస్థల పేరిట భవనాలు, భూములు ఉండవా? ఉండకూడదా? ఇన్‌ఫ్రా సంస్థలు గానీ, రియల్ ఎస్టేట్ సంస్థలు గానీ భూములపై, భవనాలపై పెట్టుబడి పెట్టడమేమైనా కొత్తా? అసలు వాటి వ్యాపారమే అది కదా? దాన్ని కూడా రామోజీ మార్కు భూతద్దంలో చూపించిన ‘ఈనాడు’ను ఏమనుకోవాలి? ఆ మాటకొస్తే రామోజీ చేతిలో ఉన్న ఉషోదయా, మార్గదర్శి చిట్స్ తదితర సంస్థలకు ఎన్ని భూములు లేవు? భవనాలు లేవు? శంషాబాద్‌లో వందల ఎకరాల్ని రైతుల నుంచి దోచుకోవటమే కాక... అంతటితో ఆకలి తీరక ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేసింది మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరిట కాదా? 

రియల్టీ, ఇన్‌ఫ్రా వ్యాపారానికే సిలికాన్ బిల్డర్స్..

సిలికాన్ బిల్డర్స్ ద్వారా వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డికి చెందిన పలు సంస్థల్లోకి నిధులు ప్రవహించాయని, ఆ సిలికాన్ బిల్డర్స్‌లో నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టాయనేది ‘ఈనాడు’ కథనం. ఆ సిలికాన్ బిల్డర్స్‌కు చెందిన భవంతిలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నివసించేవారని, అది ఆయన వ్యక్తిగత ఆస్తి అని పేర్కొంటూ... నిమ్మగడ్డ నుంచి వచ్చిన నిధులను ఇలా వ్యక్తిగత ఆస్తులు కొనుగోలు చేయటానికి వాడారని లింకు పెట్టేశారు రామోజీ. అది అక్రమమని, క్విడ్‌ప్రోకోకు ఇంతకన్నా వేరే ఉదాహరణ అవసరం లేదని తీర్పు సైతం ఇచ్చేశారు. నిజానికిదంతా జగతి సంస్థల ఆడిటర్ రాజు ఇచ్చిన స్టేట్‌మెంట్లోనే ఉందని చెప్పిన రామోజీ... దాన్లోని మిగతా అంశాల్ని మాత్రం ప్రస్తావించలేదు. మరి ఆ వివరాలు కూడా సదరు వాంగ్మూలంలో ఉంటాయి కదా? కావాలని... తనకు మాత్రమే పనికివచ్చే అంశాలను రాసి, మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. 

నిజమే! సిలికాన్ బిల్డర్స్ వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డికి చెందిన సంస్థే. అంతేకాదు. ఆయన సంస్థల్లో ఇన్‌ఫ్రా, రియల్టీ వ్యాపారంలో ఉన్న కంపెనీలన్నీ ఈ సిలికాన్ బిల్డర్స్‌కు అనుబంధమే. కాబట్టే సిలికాన్ బిల్డర్స్‌కు వచ్చిన నిధులను ఇతర సంస్థల్లోకి మళ్లించారు. అదేమీ తప్పుకాదే? ఏ సంస్థ నుంచైనా తన అనుబంధ కంపెనీలకు నిధులు మళ్లించటమనేది తప్పెలా అవుతుంది? పెపైచ్చు ఈ సిలికాన్ బిల్డర్స్‌కు మరో వ్యాపారమేదీ లేనట్లు, బెంగళూరులో భవంతి ఒక్కటే ఉన్నట్లు, అది జగన్‌మోహన్‌రెడ్డి చేతిలో ఉన్నట్లు రామోజీ కలరిచ్చారు. సిలికాన్ బిల్డర్స్‌కు ఇంకా ఏమేం ఆస్తులున్నాయో, దానికి ఏఏ సంస్థల్లో వాటాలున్నాయో, అది చేస్తున్న వ్యాపారమేంటో రాసే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే అవన్నీ రాస్తే తన లక్ష్యం దెబ్బతింటుంది కాబట్టి!! నిమ్మగడ్డ నిధుల్ని జగన్‌మోహన్‌రెడ్డి తన సొంతానికి వాడుకున్నారని చెప్పే కథకు ఈ వాస్తవాలన్నీ అతకవు కాబట్టి! మరీ ఇంత దివాలాకోరుతనమా? ఒక బాధ్యతాయుతమైన పత్రికను నడుపుతూ ఇలాంటి వక్రీకరణలకు పాల్పడటాన్ని ఏమనుకోవాలి? 

మిగిలినవన్నీ కూడా ఆస్తులు కావా?

రామోజీ మొదటి పేజీలో వేసిన పట్టికలోనే అంతా ఉంది. వివిధ సంస్థలు ఎంత పెట్టుబడి పెట్టాయో... ఇపుడు వాటిపేరిట ఏమేం ఆస్తులు ఉన్నాయో!!. సిలికాన్ బిల్డర్స్ వాటా రూ.12 కోట్ల పెట్టుబడితో బెంగళూరులోని యలహంక భవనం సంపాదించినట్లు, షాలోమ్ ఇన్‌ఫ్రా చేసిన 29.67 కోట్ల ఖర్చుతో బంజారాహిల్స్‌లోని సాక్షి టవర్స్ భూమి, భవనం సంపాదించినట్లు రాసేశారు. మరి బెంగళూరు భవనం విలువ ఇపుడు ఐదారు రెట్లు పెరిగిందంటే ఇన్వెస్టర్లకు లాభం వచ్చినట్లా? లేక ఇన్వెస్టర్లు నష్టపోయినట్లా? ఇన్వెస్టరుకు లాభం వచ్చిందంటే దానర్థం వారు క్విడ్ ప్రో కో కింద ఆ పెట్టుబడులు పెట్టినట్టా? ఈ మాత్రం జ్ఞానం రామోజీకెందుకు లేదు? ఇది కావాలని జగన్‌మోహన్‌రెడ్డిని దెబ్బతీయటం కాదా?

అన్ని కంపెనీలకూ ఆస్తులున్నాయిగా...

ఇంకా క్యాప్‌స్టోన్ ఇన్‌ఫ్రా, ఉటోపియా ఇన్‌ఫ్రా, రేవన్ ఇన్‌ఫ్రా, ఇన్‌స్పైర్ హోటల్స్ పేరిట వివిధ ఆస్తులు (భూములు, భవనాలు) ఉన్నట్టు ‘ఈనాడే’ రాసింది. మరి ఆయా సంస్థల పేరిట అన్ని ఆస్తులున్నపుడు అవి ‘ఈనాడు’లో పెట్టుబడి పెట్టిన ఈక్వేటర్ ట్రేడింగ్, అనూ ట్రేడింగ్ మాదిరి బోగస్ సంస్థలు కావనేగా అర్థం? అవి గొట్టాం కంపెనీలు కావనేగా అర్థం? ‘ఈనాడు’ రాజగురివింద దాన్ని బయటపెట్టరెందుకు? తన బండారం బయటపడుతుందనా? తన చుట్టూ ఉన్న మచ్చల్ని కప్పిపెట్టి ఇతరులపై బురద జల్లటానికి ప్రయత్నించే రామోజీని ఏమనుకోవాలి?

షేరు విలువపై ఎప్పుడూ అబద్ధాలే...

వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో షేరు విలువపై కూడా పదేపదే రామోజీ శివాలెత్తిపోతూ ఉంటారు. సిలికాన్ బిల్డర్స్‌లో రూ.10 విలువ కలిగిన షేరును రూ.275 చొప్పున విక్రయించారంటూ... అదో పెద్ద నేరమైనట్లు గగ్గోలు పెట్టారు. ఏం? ప్రైవేటు సంస్థల్లో షేరు విలువ అనేది ఇన్వెస్టరు - సంస్థ యాజమాన్యం మధ్య ఉండే ఒప్పందం ప్రకారమే జరుగుతుందని, వాళ్లిద్దరికీ ఇష్టమైన ధరకే మిగతా ప్రక్రియ జరుగుతుందని ఆయనకు తెలియదా? తన సంస్థల్లో రూ.100 విలువైన ఒకో షేరును ఏకంగా రూ.5.28 లక్షల చొప్పున విక్రయించినపుడు ఇవేవీ గుర్తుకు రాలేదా? రిలయన్స్ ద్వారా దొడ్డిదారిన నిధులు తెచ్చుకున్న రామోజీకి... ఇతరులు పారదర్శకంగా చేసిన లావాదేవీలు కూడా తప్పుగా అనిపించటమేంటి? 

భారతి సిమెంట్‌లో 20 % వాటా కూడా...

వివిధ సంస్థల నుంచి ఇన్వెస్ట్‌మెంట్లు సమీకరించిన సిలికాన్ బిల్డర్స్ తన అనుబంధ సంస్థల ద్వారా వివిధ రియల్టీ ఆస్తులను కొనుగోలు చేసింది. కొన్నిచోట్ల భవనాలు కూడా నిర్మించింది. వాటి విలువ ఏటేటా పెరుగుతూ వస్తోంది. దీనర్థం ఇన్వెస్టర్ల పెట్టుబడి పెరుగుతున్నట్లే. వారు ఎప్పుడు తమ వాటా విక్రయించినా భారీ లాభం సంపాదించే అవకాశం ఉన్నట్టే. అంతేకాక భారతీ సిమెంట్‌లో కూడా సిలికాన్ బిల్డర్స్ సంస్థ పెట్టుబడి పెట్టింది. ప్రస్తుతం భారతిలోని మేజర్ ఇన్వెస్టర్లలో సిలికాన్ బిల్డర్స్ ఒకటి. దానికి దాదాపు 19.94 శాతం వాటా ఉంది. ఈ వాటా విలువ... గతంలో వికా (పెర్‌ఫిసిమ్) సంస్థకు వాటా విక్రయించినప్పటి విలువ ప్రకారం చూసుకున్నా... దాదాపు 671 కోట్ల రూపాయలు. నిజానికి అప్పటితో పోలిస్తే ఇపుడు భారతి సిమెంట్ గణనీయంగా వృద్ధి చెందింది. దీని ప్రకారం వాటా విలువ కూడా పెరిగినట్లే. మరి ఇన్ని ఆస్తులున్న సంస్థలో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు పెట్టడాన్ని రామోజీ ఎందుకు అర్థం చేసుకోరు? కేవలం బెంగళూరు భవనం కోసమే ఈ రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ పుట్టినట్టు, దాని నిధులతో నిర్మించిన భవనం జగన్‌మోహన్‌రెడ్డి సొంతదైనట్లు, సొంతానికి నిర్మించుకున్నట్లు తప్పుడు రాతలెందుకు?

ఈ కోట ఏ కంపెనీది రామోజీ?

రామోజీరావు రైతుల్ని కొట్టి సంపాదించిన తన సువిశాల ఫిలిం సిటీ సామ్రాజ్యంలో... అత్యంత అధునాతనమైన ఈ కోటలో నివసిస్తుంటారు. మరి ఈ కోట రామోజీ వ్యక్తిగత ఆస్తి కాదా? వేలల్లో ఆదాయం పన్ను కట్టే రామోజీకి ఇంత పెద్ద కోట ఎలా వచ్చినట్లు? ఇది ఏ కంపెనీ పేరిట ఉంది? రామోజీ ఇలాంటి వివరాలెపుడూ చెప్పరెందుకు? 2010 వరకు సిలికాన్ బిల్డర్స్‌లో ఉద్యోగులెవరూ లేరని, అది తన ఉద్యోగులకు కేవలం రూ.25 వేలు చెల్లించిందని... అదేదో పెద్ద నేరమైనట్లుగా రామోజీ గుండెలు బాదేసుకున్నారు. మరి భూములు కొనటానికి మాత్రమే రామోజీ ఏర్పాటు చేసుకున్న కొన్ని సంస్థల్లో ఉద్యోగులెవరూ లేని మాట వాస్తవం కాదా? ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లోకి ఏకంగా 2600 కోట్ల రూపాయలు ప్రవహింపజేసిన ఈక్వేటర్ ట్రేడింగ్, అనూ ట్రేడింగ్ సంస్థల్లో ఉద్యోగులెంత మంది? ఆయా సంస్థల్లోని నిధులు ప్రవహింపజేసిన డజన్ల కొద్దీ కంపెనీలన్నీ డొల్ల కంపెనీలు కాదా? ఒక్క ఉద్యోగి కూడా లేకుండా ఇవన్నీ నెట్టుకు రాలేదా? హోల్డింగ్ కంపెనీలు కేవలం పెట్టుబడులకే పరిమితమవుతాయని, వాటిలో ఉద్యోగులుండరని, ఇతరత్రా కార్యకలాపాలు కూడా పెద్దగా ఉండవని రామోజీకి తెలియదా? 

ఆ భవనం కొనడంలో తప్పేంటి?

‘ఈనాడు’ లెక్కల ప్రకారం చూసుకున్నా... బెంగళూరులోని యలహంక భవనం కోసం జగన్ బంధువులకిచ్చిన అడ్వాన్సులతో పాటు వివిధ కంపెనీల ద్వారా పెట్టిన మొత్తం ఖర్చు రూ.34 కోట్లు. అది కూడా 2008 తరవాత. ఈ నాలుగేళ్లలో అక్కడ భూమి విలువే దాదాపు రూ.60 కోట్లపైగా పలుకుతున్నట్లు స్థానిక రియల్టీ వర్గాల మాట. భవనం సహా ఇతర డెవలప్‌మెంట్ విలువ దీనికి అదనం. దీన్లో జగన్‌మోహన్‌రెడ్డి కొన్నాళ్లు నివాసం ఉన్నంత మాత్రాన దాన్ని ఆయన వ్యక్తిగత ఆస్తిగా పేర్కొంటే ఎలా? దాన్ని ఒక కంపెనీ చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌గా చూడొద్దా? ఆ పెట్టుబడిపై ఇపుడు ఇన్వెస్టర్లకు భారీ లాభం వచ్చినట్లు పరిగణించవద్దా? దాన్నొక వెంచర్‌గా చూడటం మానేసి... జగన్‌మోహన్‌రెడ్డి కొన్నాళ్లు నివాసం ఉన్నారు కనక అది ఆయన తన కోసం నిర్మించుకున్న భవనమంటూ రామోజీ ఇచ్చిన తీర్పునకు అర్థమేమైనా ఉందా? ఇవెక్కడి దిగజారుడు రాతలు? 

వీటన్నింటికీ కారణం ఒకటే.. 

నిత్యం జగన్‌మోహన్‌రెడ్డిపై బురద జల్లటమనేది రామోజీ మిషన్. తన సియామీ కవల చంద్రబాబు కోసం ఆయన ఎందరిపై ఎన్ని రాతలు రాయటానికైనా సిద్ధం. జగన్‌మోహన్‌రెడ్డిని నిలువరించటం కోసం ఎవరితో చేతులు కలపటానికైనా సై. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడానికి సైతం ఓకే. అందుకే... అవిశ్వాస తీర్మానం గురించి ప్రజలందరికీ తెలియకుండా జాగ్రత్తపడే ప్రయత్నం చేశారు. అవిశ్వాసం గురించి రాస్తే బాబు గురించి రాయాల్సి వస్తుందని, ఆయన ప్రభుత్వానికి మద్దతిస్తున్న కుట్ర బయటపడుతుందని ఊహించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్-టీడీపీ సంకీర్ణం గురించి ఎక్కువగా ప్రచారం జరిగితే తన చంద్రబాబు పార్టీ చిరునామా కూడా దొరకదని ఆయనకు ముందే తెలుసు. అందుకే ఈ ప్రయత్నాలు. కానీ... రామోజీ తన ఇంట్లో దీపాన్ని ఆర్పేసినంత మాత్రాన ఊరంతటినీ చీకటి చేయగలరా?
Share this article :

0 comments: