‘తెలుగు తమ్ముళ్ల’ అంతర్మథనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘తెలుగు తమ్ముళ్ల’ అంతర్మథనం

‘తెలుగు తమ్ముళ్ల’ అంతర్మథనం

Written By ysrcongress on Sunday, March 17, 2013 | 3/17/2013

మైనారిటీలో పడిన సర్కారును రక్షించటమా?
మన మద్దతు లేకుంటే సర్కారు కూలిపోయేది కదా! 
కాంగ్రెస్‌ను కాపాడామని ప్రజలకు తెలిసిపోయిందే! 
ముప్పయ్యేళ్ల పార్టీ చరిత్రను పణంగా పెట్టారు 
కాంగ్రెస్ సర్కారుపై అవిశ్వాసం పెట్టిన ప్రతిసారీ వైఎస్ కుటుంబంపైనే విమర్శలు చేస్తున్నాం 
టీడీపీ నేతలు ముగ్గురూ ఇదే తరహాలో మాట్లాడారు 
గతంలో వైఎస్ సర్కారుపై అవిశ్వాసం తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలయింది 
ప్రభుత్వం పడిపోకుండా కాపాడి పెద్ద తప్పు చేశాం
మైనారిటీ సర్కారు గద్దె దిగాలని డిమాండ్ కూడా చేయలేని దుస్థితిలో ఉన్నాం.. 
మమ్మల్ని దేవుడే కాపాడాలి చంద్రబాబు తీరుపై టీడీపీ నేతల్లో ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న వైఖరిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ నాయకత్వంపై బహిరంగంగా మాట్లాడలేక పలువురు నాయకులు లోలోన తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా శాసనసభ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టీడీపీ కాపాడిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ కళ్లకు కట్టినట్లు తెలిసిపోయిన తాజా పరిణామాలను ప్రధాన ప్రతిపక్షంలోని సీనియర్లు జీర్ణించుకోలేపోతున్నారు. ముప్పయ్యేళ్ల పార్టీ చరిత్రను పణంగా పెట్టి.. ఏ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించిందో.. అదే పార్టీకి అండగా నిలబడటం ద్వారా ప్రజల్లో చులకనయ్యామన్న ఆందోళన నేతల్లో నెలకొంది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో కాంగ్రెస్‌కు 142 మంది సభ్యుల బలం మాత్రమే తేలగా.. మైనారిటీలో పడిన సర్కారుపైన కనీసం దిగిపోవాలని కూడా డిమాండ్ చేయలేని స్థాయికి టీడీపీ నేతలను దిగజార్చారని ఆవేదన చెందుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఓటింగ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి కేవలం 142 ఓట్లు మాత్రమే వచ్చాయి. సభలో సర్కారు మెజారిటీ కోసం కాంగ్రెస్ పార్టీకి కనీసం 148 మంది సభ్యుల మద్దతు ఉండాలి. ‘‘మా పార్టీ నిజంగా అవిశ్వాసానికి మద్దతు ఇచ్చి ఉంటే అధికార పార్టీ పరిస్థితి మరో విధంగా ఉండేది. ఈ విషయం తె లిసే సరైన సమయంలో సరైన నిర్ణయం అనే వాదనను తెరపైకి తెచ్చినట్లు ఉంది’’ అని పార్టీ వర్గాలు అంటున్నాయి. 

ప్రతిసారీ వైఎస్ కుటుంబాన్నే టార్గెట్ చేస్తున్నాం... 

‘‘మేం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకపోయినా దానిపై జరిగే చర్చ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యం గురించి ప్రస్తావించాలి. అలా కాకుండా శుక్రవారం జరిగిన చర్చలో పార్టీ తరఫున పాల్గొన్న మోత్కుపల్లి నర్సింహులు, రేవంత్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తదితరులు కేవలం దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిని, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం కూడా మాకు రాజకీయంగా నష్టం కలిగించే అంశమే’’ అని టీడీపీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ వైఎస్‌ను, ముఖ్యంగా ఆయన కుమారుడు జగన్‌ను లక్ష్యంగా చేసుకుంది.. మేం కూడా అదే బాటలో పయనించాం.. దీన్ని టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసిన వారు, పత్రికల్లో వచ్చిన వార్తలను చదివిన వారు కచ్చితంగా ఇది జగన్‌పై పెట్టిన అవిశ్వాసంగా భావించే అవకాశాలున్నాయి’’ అని మరో సీనియర్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ‘‘సభలో సుమారు మూడున్నర గంటల పాటు మోత్కుపల్లి ప్రసంగించారు. అందులో రెండున్నర గంటలు వైఎస్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటంతో చివరకు మేమే అసలు విషయానికి రమ్మని చెప్పాల్సి వచ్చింది’’ అని ఒక ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. 

...ప్రజలు అది నమ్ముతున్నారు... 

‘‘రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నపుడు ఒకసారి ప్రభుత్వంపై, మరోసారి స్పీకర్‌పై అవిశ్వాసం ప్రతిపాదించినపుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం గత ఏడాది అవిశ్వాసం పెట్టిన సందర్భాల్లో కూడా మేం వైఎస్, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసెంబ్లీలో మాట్లాడాం’’ అని ఆ ఎమ్మెల్యే గుర్తు చేశారు. ‘‘2008లో ముఖ్యమంత్రి వైఎస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టినప్పుడు గంటల తరబడి మాట్లాడిన చంద్రబాబు మొత్తం సమయాన్ని వైఎస్‌ను ఆయన కుటుంబాన్ని విమర్శించటం తప్ప మరో మాట మాట్లాడలేదు. ఆ తర్వాత సాధారణ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమిపాలైంది. వైఎస్ చనిపోయిన తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఇదివరకు అవిశ్వాసం పెట్టినప్పుడు కూడా వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకునే మాట్లాడాం. ఇప్పుడు కూడా వైఎస్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకునే మాట్లాడుతున్నాం. కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టించటానికి ప్రభుత్వానికి సహకరిస్తున్నామని ప్రజలు ఇప్పటికే బలంగా నమ్ముతున్నారు. నిన్న అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా మైనారిటీలో పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా కాపాడి పెద్ద తప్పు చేశాం..’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. 

ఇక మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి... 

‘‘కనీస మెజారిటీకి ఆరు ఓట్లు తక్కువగా ఉన్నా.. కనీసం రాష్ట్ర ప్రజలను పాలించే నైతిక అర్హత కిరణ్‌కుమార్‌రెడ్డికి లేదని, వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేయలేని స్థితిలో మేం ఉన్నాం. ఇక మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి!’’ అని టీడీపీ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వం మైనారిటీలో పడింది కదా అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తారా?’ అని శనివారం విలేకరులతో మాట్లాడిన పయ్యావుల కేశవ్‌ను ప్రశ్నించగా.. కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య విషయంలో స్పష్టత లేదని ఆయన స్పందించారు. సభలో 142 మంది మాత్రమే ఉన్నప్పటికీ బయట మరికొంత మంది ఉన్నారని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్టీ తరఫున మాట్లాడిన నేతలు వైఎస్ కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకుని మాట్లాడినందుకు పార్టీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు అభినందించారు.
Share this article :

0 comments: