ప్రమాణంపై పలకరేం ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రమాణంపై పలకరేం ?

ప్రమాణంపై పలకరేం ?

Written By news on Thursday, March 7, 2013 | 3/07/2013

- వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సూటి ప్రశ్న
- తనపై వచ్చిన ఆరోపణలపై బ్రదర్ అనిల్ బైబిల్‌పై, తన బిడ్డలపై ప్రమాణం 
- చేస్తానన్నారు... అయినా ఆయన్ను విమర్శిస్తున్నవారు సమాధానం చెప్పట్లేదేం? 
- ప్రజలు నమ్మడం లేదనే బినామీ నేతలతో టీడీపీ నాయకుల దుష్ర్పచారం
- లోకేష్ స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో చదవడానికి డబ్బెక్కడిదో ఇప్పటికీ చెప్పలేదేం?
- మనీల్యాండరింగ్, బినామీల విషయంలో బాబు దిట్ట 

సాక్షి, హైదరాబాద్: బ్రదర్ అనిల్‌కుమార్ తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సొంత బిడ్డలు, బైబిల్‌పై ప్రమాణం చేస్తానన్నా.. ఆయనను విమర్శిస్తున్న వారు ఎందుకు సమాధానం చెప్పడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంతకాలం దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిపై బురద జల్లుడు రాజకీయాలకు పాల్పడిన టీడీపీ నేతలు.. ప్రజలు తమను నమ్మకపోవడంతో ఇప్పుడు తమ బినామీ నేతలతో షర్మిల భర్త అనిల్‌పై ఆరోపణలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైఎస్‌పైనా, జగన్‌పైనా ఈ నేతలు నోటికి ఏదొస్తే అది, ఏదంటే అది మాట్లాడారు. వాటిని ప్రజలు నమ్మలేదనేది మొన్నటి ఉప ఎన్నికల్లో రుజువైంది. దీంతో అసహనానికి గురైన టీడీపీ నేతలు.. షర్మిల పాదయాత్రను ప్రజలు అపూర్వంగా ఆదరిస్తున్న నేపథ్యంలో కుళ్లుతో ఇలా విమర్శలకు దిగుతున్నారు’ అని ధ్వజమెత్తారు. మూడున్నరేళ్ల క్రితం మృతి చెందిన రాజశేఖరరెడ్డిపై బాబు ఇంకా విమర్శలు చేయడం దారుణమన్నారు.

వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో వ్యవసాయరంగానికి విద్యుత్ కొరత లేకుండా చూశారని.. ఆయన చనిపోయిన తరువాత ఏర్పడిన విద్యుత్ సంక్షోభానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని విమర్శించకుండా ఇంకా వైఎస్‌పైనే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘పనీ పాటా లేని కొందరు నేతలు అదే పనిగా వదంతులు సృష్టించి.. పబ్బం గడుపుకుంటున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు దిగడం మంచిది కాదని మేం ఓపిక పడుతూ వచ్చాం. కానీ ఇక తప్పేలా లేదు. అసలు చంద్రబాబు మాటేమిటి? ఆయనకున్న భూమి ఎన్నెకరాలు? రెండెకరాలు కాదా! ఆయన ఏ వ్యాపారం చేసి, వేల కోట్ల రూపాయలు గడించారు?’ అని నిలదీశారు. 

రెండెకరాల భూమిలో వెయ్యి రూపాయల నోటు నాటితే.. ఏమైనా కోట్లాది రూపాయలు కాస్తాయా? అని ప్రశ్నించారు. మనీల్యాండరింగ్, బినామీ పేర్లతో లావాదేవీలు నడపడంలో బాబు సిద్ధహస్తుడన్నారు. ‘రెండెకరాల పొలం ఉన్న బాబు తల్లి అమ్మణ్ణమ్మ ఎక్కడి నుంచి అంత డబ్బు తెచ్చి హైటెక్ సిటీ వద్ద స్థలాన్ని కొన్నారు. మళ్లీ ఆ స్థలాన్ని మనవడు లోకేష్‌కు బహుమతిగా ఎలా ఇచ్చారు?’ అని ప్రశ్నించారు. అక్రమ ఆస్తులను క్రమబద్ధం చేసుకోవడానికే బాబు ఇలా చేశారని ఆయన విమర్శించారు. ‘అమ్మణ్ణమ్మకు కూతుళ్లు కూడా ఉన్నారు. వారి ఆర్థిక స్థితిగతులు బాబుతో పోలిస్తే చాలా తక్కువ. వారికి కాకుండా బాబు కుమారుడు లోకేష్‌కే అమ్మణ్ణమ్మ బహుమతిగా ఇవ్వడం విడ్డూరంగా ఉంది’ అని శ్రీకాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

ఆ సవాలుకు బదులేది?: నగదు బదిలీ పథకం నాదేనని గొప్పలు చెబుతూ ‘ట్వీట్’ చేసుకుంటున్న లోకేష్‌కు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదవడానికి డబ్బెక్కడిదో చెప్పాలని సవాలు విసిరితే ఇప్పటికి సమాధానం లేదని గడికోట గుర్తు చేశారు. ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి తన కుమారుడిని స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో చదివించడానికి రూ.32 కోట్లు ఖర్చయిందని వెల్లడించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ‘చంద్రబాబు స్టాన్‌ఫోర్డ్‌లో లోకేష్ చదువుకు కోటి రూపాయలే ఖర్చయిందని లెక్కలు చూపించారంటే ఏమనుకోవాలి? మిగతా సొమ్ము ఎవరిచ్చారు? సత్యం రామలింగరాజు ఇచ్చారని చెబుతున్నారు. నిజమా?’ అని నిలదీశారు. లోకేష్‌కు వచ్చిన అత్తెసరు మార్కులకు ఏ చిన్న కాలేజీలోనూ సీటు రాదని.. అలాంటిది స్టాన్‌ఫోర్డ్ వారు సీటిచ్చారంటే ఆయన మేధస్సును గుర్తించి ఇచ్చారనుకోవాలా అని అన్నారు. ‘చంద్రబాబుపై అనేక ఆరోపణలున్నాయి. వాటిపై విచారణకు ఆయన సిద్ధపడరు. కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం ఒక్కటే బాబుకు తెలిసిన విద్య’ అని పేర్కొన్నారు. 

వైఎస్ కుటుంబంపై బురద చల్లడమే వారి పని: జూపూడి
టీడీపీ, బీజేపీ నేతలు మానవతా విలువల్ని మరిచి నిత్యం వైఎస్ కుటుంబంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు దుయ్యబట్టారు. తాను, తన తాబేదార్లు చేసే ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదని గ్రహించి.. బీజేపీలోని తన బినామీతో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బ్రదర్ అనిల్ తన బిడ్డలపై ప్రమాణం చేసేదాకా ఆ రెండు పార్టీల నేతలకు మనసు కుదుటపడలేదని మండిపడ్డారు. జూపూడి పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. 

‘‘అనిల్ స్నేహితుడు కొండల్‌రావు అనే వ్యక్తికి చెందిన కంపెనీలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే దానికీ వక్రభాష్యం చెప్పడం చూసి.. సభ్యసమాజం తలదించుకుంటోంది. ఆ వ్యక్తి మరణానికి అనిల్‌కు లింకుపెట్టి టీడీపీ నేతలు వితండవాదన చేస్తున్నారు. వీరందరికీ క్రిమినల్ డిఫమేషన్ నోటీసులు ఇవ్వబోతున్నాం’’ అని చెప్పారు. బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్.. వారి పార్టీ నేత సుష్మాస్వరాజ్ మాటల్ని గుర్తుచేసుకోవాలన్నారు. సీబీఐని ఉపయోగించుకుని జగన్‌పై అక్రమ కేసులతో కాంగ్రెస్ వేధిస్తోందని నిండు సభలో చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అనాథ పిల్లలకు ఆశ్రయం క ల్పించి ఉన్నత చదువులు చెప్పిస్తున్న అనిల్‌పై ప్రభాకర్ బురద చల్లుతున్నారని, స్థానికంగా ఉన్న పేదల్ని త రిమేసి హైదరాబాద్‌లో వారి(బీజేపీ) పార్టీ కార్యాలయం నిర్మించలేదా? అని ఆయన నిలదీశారు.
Share this article :

0 comments: