అసెంబ్లీ గేటు ముందు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ధర్నా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అసెంబ్లీ గేటు ముందు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ధర్నా

అసెంబ్లీ గేటు ముందు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ధర్నా

Written By news on Wednesday, March 27, 2013 | 3/27/2013

- కరెంటు చార్జీలు తగ్గించాలని డిమాండ్ 
- అరెస్టు.. సొంత పూచీకత్తుపై విడుదల 

 విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ శాసనసభలో విపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం రాత్రి అసెంబ్లీ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. 

ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, మేకతోటి సుచరిత, భూమా శోభానాగిరెడ్డి, కె.శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, చెన్నకేశవరెడ్డి, పిన్నెలి రామకృష్ణారెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలు అసెంబ్లీ రెండో గేటు వద్దకు చేరుకొని రోడ్డుపై ఆందోళనకు దిగారు. విద్యుత్ కోతలను ఎత్తివేయాలని, చార్జీలను పెంచమని ముఖ్యమంత్రి హామీ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులను వెలిగించి నిరసన తెలిపారు.

బాబు అండతోనే కిరణ్‌కు ఈ ధీమా: విద్యుత్‌పై చర్చ సందర్భంగా తాము ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లు వేటినీ పరిష్కరించలేదని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. చార్జీల పెంపును నిరసిస్తూ వామపక్ష పార్టీల నేతలు దీక్షలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి ఇంత ధైర్యం రావడానికి తెలుగుదేశం పార్టీయే కారణమని కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు తనకు మద్దతుగా ఉన్నారన్న ధైర్యంతో సీఎం విద్యుత్ చార్జీలను సమర్థించుకుంటూ సభను వాయిదా వేయించుకొని వెళ్లారన్నారు. ఎమ్మెల్యేల ఆందోళనతో పోలీసులు అసెంబ్లీ రెండో గేటును కొద్దిసేపు మూసివేశారు. అరగంట తర్వాత ఎమ్మెల్యేలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

ప్రజలకు టార్చ్‌లైట్లు అయినా సరఫరా చేయండి
విద్యుత్ సమస్యను పరిష్కరించకుండా ప్రజలను అవస్థల్లో ఉంచుతున్న రాష్ర్ట ప్రభుత్వం కనీసం వారికి టార్చ్‌లైట్లు అయినా సరఫరా చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. పార్టీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, గుర్నాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, అమరనాథరెడ్డి మంగళవారం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద టార్చ్‌లైట్లు పట్టుకుని నిరసన తెలిపారు. శోభానాగిరెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం ఘోరవైఫల్యం చెందిందన్నారు. 

ప్రజా బ్యాలెట్‌కు సిద్ధ్దమవుతున్న వైఎస్సార్‌సీపీ
రాష్ట్రంలో అమలవుతున్న విద్యుత్ కోతలు, సర్‌ఛార్జీల మోత, చార్జీల పెంపు ప్రతిపాదనలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాబ్యాలెట్ నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయి విద్యుత్ ఆందోళనలను ఉధృతం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సులు ఉంచి ప్రజల తీర్పును కోరాలని భావించారు. ఇందుకు సంబంధించిన తేదీని ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Share this article :

0 comments: