ప్రణమిల్లిన పల్లెలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రణమిల్లిన పల్లెలు

ప్రణమిల్లిన పల్లెలు

Written By news on Wednesday, March 6, 2013 | 3/06/2013

పల్లెలు ప్రణమిల్లుతున్నాయి.... చేతులెత్తి మొక్కుతున్నాయి.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి ముందు సాగిలపడుతున్నాయి.. పట్టరాని సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నాయి.. పగ్గాలు వదిలిన కోడెదూడల్లా ‘మరోప్రజాప్రస్థానం’లో దుముకుతున్నాయి. సాగర్ జలాశయం నిండినట్టు.. సమృద్ధిగా పంటలు పండినట్టు.. కష్టాలు కడతేరుతున్నట్టు ... ముచ్చటపడుతున్నాయి. రాజన్న ముద్దు బిడ్డ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలపై ప్రేమానురాగాలు కురిపిస్తున్నాయి. 

ఇల్లు, లోగిళ్లు కూడబలుక్కున్నట్టు.... ఊరూ ఏరూ ఏకమైనట్టు... జనపరవళ్లు ఎదురేగి స్వాగతం పలుకుతున్నాయి.... మా గుండెలనిండా మీరేనంటూ.. మేమంతా మీ వెంటేనంటూ పాదం పాదం కలుపుతూ మరో ప్రజాప్రస్థానంలో ప్రవాహంలా మారుతున్నాయి. నాడు వైఎస్ చేసిన ఉపకారాన్ని వివరిస్తూ మమకారాన్ని పంచుతున్నాయి... కల్లాకపటం తెలియని మనసులలో గూడుకట్టుకున్న అభిమానంతో ఉప్పొంగుతున్నాయి.

సాక్షి ప్రతినిధి, గుంటూరు.
రాజన్న బిడ్డ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిర్వహించిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో పల్లెలు ప్రణ మిల్లాయి. మంగళవారం సత్తెనపల్లి నియోజక వర్గం ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం, మాదల అడ్డరోడ్డు, చాగంటివారిపాలెం, ముప్పాళ్ల, గోళ్లపాడు గ్రామాల్లో పాదయాత్ర జరిగింది. ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలను ఎగురవేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహిళలు షర్మిలను చూసి తమ ఇంటి ఆడపడుచే వస్తుందన్న భావనతో హారతులతో ఎదురెళ్లి స్వాగతం పలికారు. కొన్ని ఇళ్ల ముందు రంగవల్లులు తీర్చిదిద్ది ఆహ్వానం చెప్పటం అందరినీ ఆకట్టుకుంది.

తొలుత పాదయాత్ర నరసరావుపేట రోడ్డుకు సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రం నుంచి ప్రారంభమైంది. ఇరుకుపాలెం చేరుకోగానే గ్రామస్తులు అపూర్వరీతిలో స్వాగతం పలికారు. ఎస్టీ కాలనీలో ప్రవేశించిన షర్మిల వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ కాలనీలోని వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ముందుకు వెళుతుండగా తన బాబుకు నామకరణం చేయాలని కాండ్రికొండ రాణి అనే మహిళ కోరడంతో షర్మిల కొద్దిసేపు ఆగారు. ఆ చిన్నారిని చేతుల్లోకి తీసుకుని మురళీధర్ అని పేరుపెట్టి పిలిచారు.

సాగునీటి కొరతతో మిర్చి దిగుబడి లేదు..
పాదయాత్ర పుతుంబాక వెంకటపతి ప్రశాంతి నిలయం వద్దకు చేరగానే మాదల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు తమ సమస్యలు వివరించారు. సాగునీటి కొరత కారణంగా మిర్చి పంట ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదని, ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడంతో ఖర్చులు పెరిగాయని వివరించారు. మాదల అడ్డరోడ్డు వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు పూలతో స్వాగతం పలికారు. షర్మిలను చూసి గ్రామస్తులంతా కేరింతలు కొట్టారు. మధ్యాహ్నం పాదయాత్ర దమ్మాలపాడు అడ్డరోడ్డు నుంచి చాగంటివారిపాలెం వైపు సాగింది. అక్కడ పార్టీ జెండాలను చేపట్టి కొందరు యువకులు ఒంటెలపై స్వాగతం పలికారు. పైడమ్మ గుడి సెంటరు వద్ద షర్మిల పార్టీ జెండా ఆవిష్కరించారు. 

వైఎస్సార్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ
చాగంటివారిపాలెంలో ఏర్పాటు చేసిన మహానేత వైఎస్‌ఆర్ కాంస్య విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించి పాలు,పుష్పాలతో అభిషేకం చేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామాల్లోని ప్రస్తుత దుర్భర పరిస్థితులకు నాటి చంద్రబాబునాయుడు విధానాలే కారణమని విమర్శించారు. వాటినే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తూ దొందు-దొందే అనే రీతిలో తయారయ్యాయని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుపై చేసిన విమర్శలకు గ్రామస్తుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. అక్కడే తన చిన్నారికి నామకరణం చేయాలని ఓతల్లి కోరడంతో ఆ బాబుకు రాజశేఖర్‌రెడ్డి అని పేరుపెట్టిన షర్మిల ముందుకు సాగారు. మండల కేంద్రమైన ముప్పాళ్ల నుంచి గోళ్లపాడు గ్రామం మీదుగా యాత్ర నరసరావుపేట నియోజకవర్గం ములకలూరు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకుంది.
Share this article :

0 comments: