ఇక మహిళా దినోత్సవం దేనికి గుర్తుగా జరుపుకోవాలి? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇక మహిళా దినోత్సవం దేనికి గుర్తుగా జరుపుకోవాలి?

ఇక మహిళా దినోత్సవం దేనికి గుర్తుగా జరుపుకోవాలి?

Written By news on Saturday, March 9, 2013 | 3/09/2013

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై షర్మిల ధ్వజం
అతివల పట్ల నేరాల్లో రాష్ట్రానిదే ప్రథమ స్థానం
ఇక మహిళా దినోత్సవం దేనికి గుర్తుగా జరుపుకోవాలి?
తనను కలిసేందుకు వచ్చిన మహిళలను సీఎం కిరణ్ కనీసం పట్టించుకోలేదు
కనీసం మరుగుదొడ్లు కూడా కట్టించలేని ఈయనకు ఇంగిత జ్ఞానముందా?
చంద్రబాబు అధికారపక్షంతో కుమ్మక్కై అవిశ్వాసం పెట్టకుండా విధేయత చాటుకుంటున్నారు
మహిళా సాధికారత వైఎస్సార్ కల..ప్రతి పథకంలో మహిళకే హక్కు కల్పించారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 85, కిలోమీటర్లు: 1,177.5

 ‘‘ప్రపంచ మహిళా దినోత్సవం.. మహిళగా పుట్టినందుకు గర్వంగా జరుపుకొనే పండుగ. కానీ రాష్ట్ర మహిళలకు ఆ పండుగ జరుపుకొనే గర్వకారణం ఏముంది? రాష్ట్రంలో అతివలు మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోలేకపోతున్నారు. ఏ గ్రామానికెళ్లినా మరుగుదొడ్లు లేవని మహిళలు వేదనాభరితంగా చెప్తున్నారు. వారికి కనీసం మరుగుదొడ్లు కూడా కట్టించలేని ఈ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డికి ఇంగిత జ్ఞానం ఉందా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘‘మహిళల ఆర్థిక సాధికారత కోసం వైఎస్ ప్రవేశ పెట్టిన పావలా వడ్డీ రుణాలు ఇప్పుడు సరిగా అందడంలేదు. దేశంలో మహిళల పట్ల నేరాల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. లైంగిక దాడులు, హత్యాయత్నాలు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి. 

ఆడపడుచులకు కనీస భద్రత కల్పించలేని ఈ సర్కారు వారికేం మేలు చేయగలదు? కాంగ్రెస్ పాలనలో మహిళల గతి ఇలా ఉంటే ఇక మహిళా దినోత్సవం దేనికి గుర్తుగా జరుపుకోవాలి?’’ అని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికీ, అలాంటి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టని టీడీపీ వైఖరికీనిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా వందలాది మంది మహిళలు షర్మిలతో తమ వెతలు చెప్పుకున్నారు. అన్నింటినీ ఓపికగా ఆమె ఆలకించారు. మహిళల పట్ల ప్రభుత్వ పెద్దలకు కనీస గౌరవంగానీ, సానుభూతి గానీ లేవని విమర్శించారు. క్యాంపు ఆఫీసులో తనను కలిసేందుకు వచ్చిన మహిళలను కనీసం పట్టించుకోకుండా సీఎం కిరణ్ వెళ్లిపోయిన సంఘటనలు చూస్తుంటే మహిళల సమస్యల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అవగతమవుతోందన్నారు.

ఆడపడుచుల అన్న రాజన్న..: ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి మహిళలను అక్కా చెల్లెళ్లలా చూసుకున్నారు. మహిళలకు సాధికారత కల్పించడం ద్వారా వారంతా తలెత్తుకుని తిరిగేలా చేసేందుకు పరితపించారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలకు రూ.1 వడ్డీకి రుణాలిస్తే దాన్ని వైఎస్ పావలాకు తగ్గించారు. మహిళలందరికీ బ్యాంకు అకౌంట్లు తెరిపించి ఏపథకం చేపట్టినా అది ఇంటిలో మహిళల పేరిటే ఉండేలా చేశారు’’ అని షర్మిల గుర్తుచేశారు. కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాత్రం మహిళల పట్ల క్రూరంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు సీఎంగా ఉండగా రంగారెడ్డి జిల్లాలో ఓ యువతిపై యాసిడ్ దాడి జరిగితే ఆమెకు కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదు. దీనిపై హైకోర్టు అక్షింతలు వేసినా ఆమెకు సహాయం చేయకుండా తన క్రూరత్వాన్ని చాటుకున్నారు. అంతటి దుర్మార్గుడు ఇప్పుడు మహిళలకు ఇది చేస్తా, అది చేస్తా అంటూ యాత్రలు చేస్తున్నారు. 1999 ఎన్నికలకు ముందు మహిళలకు మంగళసూత్రాలు, విద్యార్థినులకు సైకిళ్లు ఇస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోలేదు. కరువు వస్తే ఆదుకోమన్నందుకు గుర్రాలతో తొక్కించిన దుర్మార్గుడు చంద్రబాబు’’ అని షర్మిల నిప్పులు చెరిగారు.

దాహమంటున్నా.. గుక్కెడు నీళ్లివ్వలేరా?: రాష్ట్రంలో పల్లెలన్నీ దాహార్తితో అల్లాడుతుంటే వారికి మంచినీరు కూడా కల్పించకుండా ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందంటూ షర్మిల మండిపడ్డారు. తాగడానికి నీరు లేకుండా ప్రజలెలా బతుకుతారనే ఆందోళన కూడా ప్రభుత్వానికి కలగకపోవడం దురదృష్టకరమన్నారు. లీటరు రూ.10 పెట్టి మంచినీరు కొనుక్కునే దుస్థితిలోకి పేదలను ప్రభుత్వం నెట్టివేసిందని ఆరోపించారు. ‘‘పేదలు రోజూ కూలికి వెళితే వారికొచ్చేది రోజుకు రూ.100. ఆదివారం కూడా పనిచేస్తే నెలకు రూ.3 వేలొస్తుంది. దాంతో నీరు కొంటారా? కరెంటు బిల్లులు చెల్లిస్తారా. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువులు కొంటారా? స్కూలు ఫీజులు కడతారా? ఈ మాత్రం అవగాహన అయినా ముఖ్యమంత్రికి లేకుండాపోయింది’’ అని షర్మిల దుయ్యబట్టారు. ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ సరఫరా పరిస్థితి దారుణంగా మారింది. గ్రామాల్లో రోజుకు ఒక్క గంట కూడా విద్యుత్ సరఫరా లేదు. మరోవైపు బిల్లు చూస్తే రూ.500 వరకూ వస్తోంది. ఇంత కన్నా దారుణం మరేమైనా ఉందా?’’ అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. కరెంటు లేక విద్యార్థులు చదువుకునేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

అయినా బాబు అవిశ్వాసం పెట్టరు: ‘‘తమను పుట్టెడు కష్టాల్లోకినెట్టిన ఈ ప్రభుత్వం తమ కొద్దని రాష్ట్ర ప్రజలందరూ ముక్తకంఠంతో ఘోషిస్తుంటే.. దీనిపై నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు.. ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారు. అవిశ్వాసం పెట్టకుండా కాంగ్రెస్ పార్టీకి, సీఎం కిరణ్‌కు అపర విధేయుడిగా మారారు’’ అని షర్మిల విమర్శించారు. త్వరలోనే జగనన్న బయటకొస్తాడని, రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకొస్తాడని భరోసా ఇచ్చారు.

85వ రోజు శుక్రవారం గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం టి.చందవరం శివారులో ప్రారంభమైన షర్మిల పాదయాత్ర తూబాడు, నాందెడ్ల గ్రామాల మీదుగా సాగింది. నాదెండ్ల మండల కేంద్రం శివారులో ఏర్పాటు చేసిన బసకు షర్మిల రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం మొత్తం షర్మిల 12.5 కిలోమీటర్లు నడిచారు. యాత్రలో పాల్గొన్న నేతల్లో మర్రి రాజశేఖర్, ఆర్కే, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, స్థానిక నాయకులు వెంకట లక్ష్మీరాజ్యం, దేవళ్ల రేవతి, బండారు సాయిబాబు మాదిగ తదితరులు ఉన్నారు.

కాళ్లు లేవని ఉద్యోగమివ్వలేదు

పాదయాత్రలో సాగుతున్న షర్మిలను తూబాడు గ్రామంలో వాసిమళ్ల జ్యోతి అనే వికలాంగురాలు కలిసి తన గోడు చెప్పుకొంటూ కన్నీళ్లు పెట్టుకుంది. చక్రాల కుర్చీలో వచ్చిన ఆమెను ఆప్యాయంగా పలకరించిన షర్మిల.. ఆమె కష్టాలు విని చలించిపోయారు. ‘‘మూడేళ్ల క్రితం డిగ్రీ పూర్తిచేశానమ్మా.. గుంటూరులో యువకిరణాలకు దరఖాస్తు చేస్తే కాళ్లు లేవని ఉద్యోగమివ్వలేమన్నారు. బైక్ నడిపితేనే జాబ్ ఇస్తామని చెప్పారు. అమ్మలేదు, నాన్న మంచాన పడ్డాడు. పింఛన్ డబ్బులతోనే బతుకుతున్నాం. జీవనం చాలా కష్టంగా ఉంది’’ అని జ్యోతి కన్నీళ్లు పెట్టుకోవడంతో షర్మిల ఉద్వేగానికి లోనయ్యారు.
Share this article :

0 comments: