వైఎస్సార్‌సీపీయే అధికార పార్టీ అన్నట్టుగా .... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీయే అధికార పార్టీ అన్నట్టుగా ....

వైఎస్సార్‌సీపీయే అధికార పార్టీ అన్నట్టుగా ....

Written By news on Saturday, March 16, 2013 | 3/16/2013

అసెంబ్లీ సాక్షిగా రుజువైన కాంగ్రెస్-టీడీపీ ఫిక్సింగ్
అవిశ్వాసంలో గట్టెక్కిన సర్కారు.. కాంగ్రెస్‌ను వదిలి వైఎస్సార్‌సీపీనే టార్గెట్ చేసిన టీడీపీ
వైఎస్సార్‌సీపీయే అధికార పార్టీ అన్నట్టుగా మాటతీరు
ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలిన టీడీపీ సభ్యులు
రూ. 32 వేల కోట్ల కరెంట్ బాదుడుకు పరోక్ష ఆమోదం
వీధి రాజకీయాలను తలపించిన మోత్కుపల్లి మాటలు
దివంగత వైఎస్, వైఎస్సార్‌సీపీలే లక్ష్యంగా దూషణలు
అవిశ్వాసానికి మద్దతివ్వని టీడీపీకి సభలో ప్రాధాన్యత
‘దేశం’ తీరును ఆనందంగా వీక్షించిన కాంగ్రెస్ సభ్యులు

రాష్ట్ర రాజకీయాల్లో కనీవినీ ఎరగని సరికొత్త సంప్రదాయానికి టీడీపీ తెర తీసింది! అధికార కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం బారిన పడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంది. తద్వారా ప్రధాన ప్రతిపక్ష హోదాకే కొత్త నిర్వచనమిచ్చింది. పనిలో పనిగా కాంగ్రెస్‌తో తన కుమ్మక్కును సాక్షాత్తూ శాసనసభా వేదికపైనే బాహాటంగా రుజువు చేసి చూపింది. రూ.32 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం వంటి కిరణ్ సర్కారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నింటికీ టీడీపీ ఆమోదముద్ర వేసినట్టయింది! ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం మాట అటుంచి.. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా శుక్రవారం సభలో ఆద్యంతం దివంగత వైఎస్‌ను, ఆయన కుటుంబీకులను, వైఎస్సార్ కాంగ్రెస్‌ను విమర్శించడానికే పరిమితమైంది. తద్వారా తీర్మానాన్ని పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా నీరుగార్చింది. ఫలితంగా వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు వీగిపోయినా... కేవలం 142 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ సర్కారు మైనారిటీలో పడిందని నిండు సభలో వెల్లడైంది. అంతేగాక కేవలం టీడీపీ మద్దతు వల్లే శుక్రవారం నాటి అవిశ్వాసాన్ని గట్టెక్కిందని కూడా సభ సాక్షిగా రుజువైంది!

సాక్షి ప్రతినిధి, హైదరాబాద్: రాజకీయ చరిత్రలో ఎక్కడా లేని సరికొత్త సంప్రదాయానికి విపక్ష టీడీపీ తెర తీసింది! ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ, సహచర విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రభుత్వానికి పూర్తి రక్షణగా, అడుగడుగునా అండగా నిలిచింది. తద్వారా కాంగ్రెస్ పార్టీతో తన కుమ్మక్కును శుక్రవారం సాక్షాత్తూ అసెంబ్లీ వేదికపైనే రాష్ట్రం మొత్తానికీ మరోసారి రుజువు చేసి చూపింది. బాధ్యతాయుత విపక్షంగా కనీసం ప్రభుత్వ వైఫల్యాలనైనా ఎండగట్టాల్సింది పోయి మోత్కుపల్లి నర్సింహులు సహా టీడీపీ సభ్యులంతా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే లక్ష్యం చేసుకుని మాట్లాడారు.

తద్వారా అవిశ్వాస తీర్మానాన్ని సాక్షాత్తూ ప్రధాన ప్రతిపక్షమే ఓ పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా నీరుగార్చిన వైనాన్ని రాష్ట్ర ప్రజలంతా ప్రత్యక్షంగా వీక్షించారు! ఇక చర్చ పొడవునా టీడీపీకి లభించిన ప్రాధాన్యత కూడా కాంగ్రెస్‌తో ఆ పార్టీ కుమ్మక్కు రాజకీయానికి ఆద్యంతం అద్దం పట్టింది. శుక్రవారం సభలో వ్యవహరించిన తీరు ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తినే కాలరాసిందన్న అపవాదును టీడీపీ మూటగట్టుకుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వరుసగా రెండుసార్లు ఓడి జవసత్వాలుడిగిన కాంగ్రెస్‌ను రెండుసార్లు వరుసగా గెలిపించి ప్రస్తుతం అనుభవిస్తున్న అధికారానికి కారకుడైన దివంగత వైఎస్ పట్ల టీడీపీ అనుచిత వ్యాఖ్యలను అధికార పార్టీ సభ్యులంతా ఆనందంగా వీక్షించన వైనం కూడా విస్తుగొలిపింది. శుక్రవారం అసెంబ్లీ టీడీపీ సభ్యులు మాట్లాడిన తీరు సభలో మునుపెన్నడూ లేని విచిత్ర పరిస్థితిని కళ్లకు కట్టిందని అధికార పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరన్నారు. ‘‘టీడీపీ సభ్యులు మాట్లాడేందుకు లేస్తే చాలు... వాళ్లకు నిబంధనలతో పని లేకపోయింది. తోచింది, అనుకున్నది మాట్లాడేశారు. సభలో లేని వారిని దూషించదలచినా, వారిపై అడ్డగోలు ఆరోపణలు చేయదలిచినా టీడీపీ వారు కనీసం ముందుగా అనుమతి కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా సభ నడిచిన తీరు నన్ను విస్మయానికి గురి చేసింది’’ అంటూ ఆయనమండిపడ్డారు.

విషయమేమిటి.. లక్ష్యమెవరు?

వాస్తవానికి అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరగాల్సిన చర్చనే టీడీపీ పూర్తిగా పక్కదోవ పట్టించింది. కాంగ్రెస్‌తో టీడీపీ ముందుగానే ఒప్పందం కుదుర్చుకుందా అన్న రీతిలో రెండు పార్టీలు సమన్వయంతో వ్యవహరించాయి. వ్యూహాత్మకంగా వైఎస్సార్ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇంతటి కీలక సమయంలో కూడా కనీసం సభకు రాకుండా అధికార పక్షానికి అండగా నిలిచిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, అవిశ్వాసంపై జరిగిన చర్చలోనూ పార్టీ సభ్యులకు అదే మాదిరిగా ‘దారి చూపారు’. ప్రజా సమస్యలను ఏమాత్రమూ పట్టించుకోకుండా.. వైఎస్, ఆయన కుటుంబ సభ్యులే లక్ష్యంగా టీడీపీ ఆరోపణలు గుప్పించింది. మోత్కుపల్లి అయితే మాట్లాడిన రెండు గంటల్లో ఏకంగా గంటా నలభై నిమిషాలకు పైగా వైఎస్ ప్రభుత్వంపైనే ఆరోపణలు గుప్పించేందుకు పరిమితమయ్యారు. పేదల భూములను వైఎస్ లాక్కున్నారన్నారు.

ఆ క్రమంలో, ‘ఎమ్మార్‌కు వైఎస్ 534 ఎకరాలు కట్టబెట్టార’ంటూ అలవోకగా ఆరోపణ చేసేశారు. చంద్రబాబు అప్పగించిన బాధ్యతను అమలు చేసిన మోత్కుపల్లికి అడుగడుగునా అధికార పార్టీ అండ లభించింది. వైఎస్‌ను, ఆయన కుటుంబ సభ్యులను, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను, వైఎస్ సతీమణి విజయమ్మను, చివరికి బైబిల్‌ను కూడా మోత్కుపల్లి వదల్లేదు. వైఎస్సార్‌సీపీ నేతలనుద్దేశించి అసభ్య పదజాలం ప్రయోగించారు. సీనియర్ ఎమ్మెల్యే అయి ఉండి, సభ్యులనుద్దేశించి నేరుగా అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని తెలిసి కూడా, పదేపదే అవే మాటలను ప్రస్తావించారు. కాంగ్రెస్‌ను గానీ, ఆ పార్టీ నేతలను గానీ ఒక్క మాటన్నా రూల్సు పుస్తకాలు చేతుల్లో పట్టుకుని మరీ అభ్యంతరాలు తెలిపిన మంత్రులు గానీ, వారి వెనక ఉండి కేకలు వేసిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు గానీ.. వైఎస్‌ను మోత్కుపల్లి దుర్భాషలాడుతుంటే మాత్రం తమకేమీ వినబడనట్టుగా వ్యవహరించారు. కొందరు సభ్యులైతే నవ్వులు చిందించారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి తయారు చేసుకున్న స్క్రిప్టులను చదివారు.

ప్రభుత్వాన్ని కాదంటూ సీఎంకు సంజాయిషీ!

వైఎస్‌ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పించిన టీడీపీ సభ్యులు, అధికార పార్టీని తామేమీ అనడం లేదంటూ ఒకటికి రెండుసార్లు సంజాయిషీ ఇచ్చుకున్నారు! మోత్కుపల్లి అయితే ఓ దశలో సీఎం కిరణ్‌ను ఉద్దేశించి, ‘మిమ్మల్నేమీ అనడం లేదు. వైఎస్ పాలనలో అక్రమాలేనన్నదే మా బాధంతా’ అంటూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చిన తీరు పరిశీలకులనే విస్మయపరిచింది. పైగా స్పీకర్ కూడా మోత్కుపల్లి మాటల్లో అభ్యంతకర పదాలను రికార్డుల నుంచి తొలగిస్తామన్నారే తప్ప వైఎస్‌నుద్దేశించి మాట్లాడొద్దని స్పీకర్ రూలింగ్ ఇవ్వలేకపోయారు. నిజానికి వైఎస్‌నుద్దేశించి మోత్కుపల్లి ఇష్టారాజ్యంగా వ్యాఖ్యానిస్తున్న సందర్భంలో ఒక్క కాంగ్రెస్ సభ్యుడు కూడా ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. సరికదా, నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు సూచనలిచ్చేందుకు ప్రయత్నించారు. మోత్కుపల్లికి తోడు మధ్యలో ఎర్రబెల్లి దయాకరరావు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, పయ్యావుల కేశవ్ తదితర టీడీపీ సభ్యులు కూడా తమ వంతుగా అధికార పార్టీకి అండగా, వైఎస్ కుటుంబమే లక్ష్యంగా మాట్లాడారు. విచారణలో భాగంగా సీబీఐ పేర్కొన్న అంశాలనే కోర్టు తీర్పులన్న స్థాయిలో ప్రస్తావిస్తూ, వాటి సాయంతో జగన్‌ను దోషిగా చిత్రీకరించజూశారు. కానీ, ‘చంద్రబాబును ఏ కోర్టయినా నిర్దోషిగా నిర్ధారించిందా? అలాగే వైఎస్‌ను ఏ కోర్టయినా దోషి అని చెప్పిందా?’ అని వైఎస్ విజయమ్మ వేసిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోవడం గమనార్హం. ఒకరకంగా చెప్పాలంటే అవిశ్వాసంపై జరిగిన చర్చలో భాగంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్న సమయంలో అసలు రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీయా.. లేక వైఎస్సార్ కాంగ్రెస్సా అనే అనుమానాలు కూడా కలిగాయని పరిశీలకులే అంటున్నారు.
Share this article :

0 comments: