విపక్ష నేతగానూ పనికిరాడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విపక్ష నేతగానూ పనికిరాడు

విపక్ష నేతగానూ పనికిరాడు

Written By news on Thursday, March 7, 2013 | 3/07/2013

*ప్రభుత్వ అసమర్థ పాలనతో ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ అష్టకష్టాలు పడుతున్నారు
* అప్పులు తీర్చలేక రైతులు కిడ్నీలు అమ్ముకుంటున్నారు.. కరెంటు కోతలతో విలవిల్లాడుతున్నారు
* ఇంత జరుగుతున్నా.. చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారు 
* వైఎస్సార్ కుటుంబ సభ్యుల మీద అభాండాలు వేయడానికే పూర్తి సమయం వెచ్చిస్తున్నారు
* ప్రజలు నానా కష్టాలూ అనుభవిస్తున్నా ఆయన అవిశ్వాసం అస్త్రాన్ని ప్రయోగించనంటున్నారు 

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఈ రోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం వారికి కరెంటు ఇవ్వదు. నీళ్లివ్వదు. విత్తనాల ధరలు, ఎరువుల ధరలు పెరిగిపోతుంటే పట్టించుకోదు. మద్దతు ధర ఇవ్వదు. అతివృష్టో... అనావృష్టో వచ్చి పంట నష్టం జరిగితే నష్టపరిహారం కట్టించదు. సాగు కోసం చేసిన అప్పులు ఇవాళ రైతన్నల చావు మీదకొచ్చాయి. అప్పులు కట్టడం కోసం రైతులు కిడ్నీలు అమ్ముకుంటున్నా.. ఈ పాలకులకు కనీసం పట్టడం లేదు. ఇంత జరుగుతున్నా.. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నేతలు ప్రజల సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారు. 

దివంగత మహానేత వైఎస్ మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద అభాండాలూ, నిందలు ఎలా వేయాలన్న కుట్రల్లో మునిగితేలుతున్నారు. తొమ్మిదేళ్లు ప్రజల్ని పీడించిన చంద్రబాబు ముఖ్యమంత్రిగానే కాదు.. విపక్షనేతగా కూడా పనికిరారని తేలిపోయింది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికీ, దానితో కుమ్మక్కయిన చంద్రబాబు వైఖరికీ నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో సాగింది. సాయంత్రం వేళ షర్మిల నరసరావుపేట పట్టణంలోకి ప్రవేశించగానే వర్షం చినుకులు రాలాయి... మరో కిలోమీటర్ దూరం తరువాత చినుకు చిరుజల్లుగా మారింది. పాత పల్నాడు బస్టాండు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సభా స్థలికి షర్మిల చేరుకోగానే.. చిరుజల్లు భారీ వర్షంగా మారింది. కురుస్తున్న వర్షంలోనే షర్మిల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే.. 

దుర్మార్గపు సీఎం చంద్రబాబు..: ‘‘ప్రాజెక్టుల్లో నీళ్లుంచుకొని కూడా పంట పొలాలను ఎండబెట్టిన దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఎవరైనా ఉన్నారా? అంటే అది ఒక్క చంద్రబాబే. ఆయన సీఎంగా ఉన్నప్పుడు నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఉన్న రైతులు రబీ సీజన్ పంటలు వేసుకున్నారు. పంట పొట్టమీదకు వచ్చిన దశలో చంద్రబాబు సాగర్ నుంచి నీళ్లు వదలటం నిలిపేశారు. దిక్కు తోచని రైతన్నలు హైదరాబాద్‌కు వెళ్లి ‘మా పంటలు ఎండిపోతున్నాయి.. సాగర్ నీళ్లు వదిలిపెట్టండి ముఖ్యమంత్రి గారూ’ అని ప్రాధేయపడితే.. చంద్రబాబు ఏమన్నారో తెలుసా..! ‘మిమ్మల్ని పంట ఎవరేసుకొమ్మన్నారు? పంటలు ఎండిపోతే మీకు తెలిసొస్తుంది’ అంటూ రైతుల మీద ఉరిమారు. ‘మీరు ఇలాగే ఉంటే నేను ఇంకా క్రూరంగా ఉంటా’నని రైతులను బెదిరించిన దుర్మార్గుడు బాబు.

కుక్క మూతి పిందె..
చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఒక మాట అన్నారు. ‘చంద్రబాబుకు ఉచ్ఛ, నీచాలు.. మానం, మర్యాద.. సభ్యత, సంస్కారం.. మనసు మమతలు లేవు. అధికారం కోసం అడ్డదారులు తొక్కిన కుక్క మూతి పిందె’ అని ఆయనకు పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆరేఅన్నారు. చంద్రబాబు నిన్న 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశానని సంబరాలు కూడా జరుపుకొన్నారు. పల్లెల్లో ప్రజలు ఎంత కష్టపడుతున్నారో చంద్రబాబు చూస్తున్నారు. కానీ ఆయనకు ప్రజల గురించి పట్టదు. చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు. అవిశ్వాసం అనే ఆయుధాన్ని తన చేతుల్లో పెట్టుకొని దాన్ని వాడరట.. ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించరట... ఇదీ బాబు నైజం. 

భరోసా అంటే తెలియదీ పాలకులకు..
గత ఏడాది జనవరిలో జగనన్న ఇదే నరసరావుపేటకు వచ్చారు. వస్త్ర వ్యాపారులపై ప్రభుత్వం 5 శాతం వ్యాటు విధిస్తే..! దాన్ని నిరసిస్తూ జగనన్న ఇక్కడ ధర్నా చేశారు. ఆ రోజున జగనన్న ఒక తీర్మానం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజున వస్త్ర వ్యాపారులపై 5 శాతం వ్యాట్ తీసేస్తామని వ్యాపారులకు ఒక భరోసా కల్పించారు. ఇప్పుడున్న పాలకులకు భరోసా అనే పదానికి అర్థం తెలియదు. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, మైనార్టీలకు, బీసీలకు, దళితులకు, గిరిజనులకు ఇలా ఏ ఒక్కరికీ కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద భరోసా లేదు. ఈ ప్రభుత్వం వల్ల ఎవరైనా లాభపడుతున్నారా..! అంటే అది ఒక్క చంద్రబాబు మాత్రమే.’’

12.9 కిలోమీటర్ల మేర యాత్ర..
బుధవారం 83వ రోజు పాదయాత్ర నరసరావుపేట మండలం ములకలూరు నుంచి ప్రారంభమైంది. అక్కడి ఇసుకపాలెం, నరసరావుపేట బైపాస్‌రోడ్డు, పెద్ద చెరువు మీదుగా షర్మిల పాత పల్నాడు బస్టాండు సెంటర్‌కు చేరుకున్నారు. ఇక్కడ భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. క్రిస్టియన్‌పాలెం శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. 

బుధవారం మొత్తం 12.9 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,152.5 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో మర్రి రాజశేఖర్, ఆర్‌కే, ముదునూరి ప్రసాదరాజు, తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, పి.గౌతంరెడ్డి, డాక్టర్ శివభారత్‌రెడ్డి, స్థానిక నాయకులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కావటి మనోహర్ నాయుడు, దేవళ్ల రేవతి తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, నన్నపునేని సుధ సాయంత్రం షర్మిలను కలిశారు. 

బాబుది.. పాడు యాత్ర
‘‘మీ కోసం అంటూ చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర ప్రజల కోసం అన్నది పచ్చి అబద్ధం. కేవలం రికార్డుల కోసం, ఎన్నికల కోసం చేస్తున్న ‘పాడుయాత్ర’ అది. వైఎస్సార్ పాదయాత్ర చేయడానికి ఒక గొప్ప సంకల్పం ఉంది. ఆయన పాదయాత్రను ఒక యజ్ఞంలా చేశారు. మన పల్లెలు చంద్రబాబు ఏలుబడిలో శ్మశానాలుగా మారిపోతుంటే.. వైఎస్సార్ వెళ్లి పల్లె ప్రజలకు ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. మండుటెండల్లో వైఎస్సార్ పాదయాత్ర చేస్తే.. ఇప్పుడు చంద్రబాబేమో.. నెత్తి మీద ఒక ఫ్యాన్ పెట్టుకొని తిరుగుతూ.. నిస్సిగ్గుగా మైకు పట్టుకొని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఆయన తొమ్మిదేళ్ల హయాంలో మన రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉందట.. రాష్ర్టం చాలా అభివృద్ధి చెందిందట.. చంద్రబాబు ముఖ్యమంత్రిగానే కాదు, కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికి రాడు అని మళ్లీమళ్లీ రుజువు చేసుకుంటున్నారు.’’ 
- షర్మిల
Share this article :

0 comments: