ఏటా బాదుడే! విద్యుత్ చార్జీలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏటా బాదుడే! విద్యుత్ చార్జీలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ

ఏటా బాదుడే! విద్యుత్ చార్జీలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ

Written By news on Monday, March 25, 2013 | 3/25/2013

ప్రపంచ బ్యాంకు అడుగులకు మడుగులొత్తేందుకు సిద్ధం
రుణాలపై వడ్డీ భారం తగ్గించుకునేందుకే..
వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కూ ఇక పరిమితులు
విద్యుత్ పంపిణీ వ్యవస్థ ప్రైవేటు ఫ్రాంచైజీల పరం
డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ ప్యాకేజీపై
ఈ నెలాఖరులో కేంద్ర విద్యుత్ శాఖతో ఒప్పందం? 
ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు ఎన్నడూ తలొగ్గని వైఎస్
వద్దన్నా ఉచిత విద్యుత్‌ను ప్రవేశపెట్టి అమలుచేసిన మహానేత

సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏప్రిల్లోనే కాదు, ఇకపై రాష్ట్రంలో ఏటా విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. అంతేకాదు ఉచిత కరెంటు.. పరిమితుల ఉచ్చులో ఇరుక్కోనుంది. విద్యుత్ పంపిణీ వ్యవస్థ ప్రైవేటుపరం కానుంది. అంటే సంబంధిత బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా తప్పుకుంటుందన్న మాట. ఎందుకంటే.. ప్రపంచ బ్యాంకు ఆదేశించింది, కేంద్రం పాటించమంటోంది గనుక. రుణాలపై వడ్డీ భారం తగ్గించుకునేందుకు రాష్ట్ర సర్కారు కూడా ఇందుకు సై అంటోంది గనుక. కేంద్రంతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకునేందుకు కూడా సిద్ధమవుతోంది. ప్రతి ఏటా విద్యుత్ చార్జీలను పెంచుతామని, ఉచిత విద్యుత్‌కు పరిమితులు విధించడం ద్వారా భారాన్ని తగ్గించుకుంటామని స్పష్టంగా ప్రకటించనుంది. అదేవిధంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఫ్రాంచైజీలకు అప్పగించడం ద్వారా ప్రైవేటీకరిస్తామని కూడా కేంద్రానికి హామీ ఇవ్వనుంది. డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ ప్యాకేజీ అమలులో భాగంగా ఈ నెలాఖరులోగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖతో రాష్ట్రానికి చెందిన విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఈ ప్యాకేజీ కింద డిస్కంలకు ఉన్న రుణాల్లో సగం మొత్తానికి కేంద్రం, మిగిలిన సగానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తాయి. ఈ రుణాలపై వడ్డీ భారాన్ని అటు కేంద్రం, ఇటు రాష్ట్రం భరిస్తాయి. 

తద్వారా డిస్కంల ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చాలనేది కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఆలోచన. ఇందుకోసం 2012 అక్టోబర్ 5న కేంద్ర విద్యుత్ శాఖ కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. ప్రతి ఏటా చార్జీలు పెంచడం, ఉచిత విద్యుత్‌ను కట్టడి చేయడం, విద్యుత్ పంపిణీని ప్రైవేటీకరించడం ఇందులోని కొన్ని ముఖ్యమైన షరతులు. ఈ నిబంధనలకు అంగీకరిస్తేనే సదరు ప్యాకేజీ కింద కేంద్రం సహాయం అందిస్తుంది. ఈ నేపథ్యంలో షరతులను పాటిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంలో భాగంగా కేంద్రానికి హామీ ఇవ్వనున్నట్లు ఇంధనశాఖ వర్గాల సమాచారం. తద్వారా డిస్కంలకు వివిధ బ్యాంకుల్లో ఉన్న సుమారు రూ.13 వేల కోట్ల రుణాలపై వడ్డీ భారం తగ్గుతుందని ఆ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా అసలు రుణాన్ని చెల్లించేందుకు కూడా డిస్కంలకు కాస్త సమయం లభిస్తుందని వివరించాయి. రుణ భారం తగ్గించే పేరిట విద్యుత్ వ్యవస్థను మొత్తం ప్రైవేట్‌పరం చేసేందుకు రంగం సిద్ధమవుతోందని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు.సొంత వనరులతో డిస్కంల ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దకుండా.. భారం తగ్గించుకోవడానికి ప్రపంచ బ్యాంకుకు మోకరిల్లడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మళ్లీ ప్రపంచబ్యాంకు నీడలోకి..!

తాజా ఒప్పందంతో రాష్ట్ర విద్యుత్‌రంగంలో మళ్లీ ప్రపంచ బ్యాంకు ఎజెండా అమలుకానుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచబ్యాంకు ఎజెండాలో భాగంగానే చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు కాస్తా.. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలుగా ముక్కలుచెక్కలైంది. విద్యుత్ రంగాన్ని క్రమంగా ప్రైవేటీకరించాలని ప్రపంచ బ్యాంకు అప్పట్లోనే ఆదేశించింది. తమ ఆదేశాలు పాటించే దేశాలకే ప్రపంచ బ్యాంకు నిధులిస్తుంది. ఆ ఆదేశాల మేరకు ప్రజలకు నేరుగా సేవలందించే డిస్కంలను క్రమంగా ప్రైవేటీకరించాల్సి ఉంటుంది. అనుభవించే ప్రతి సేవకు అయ్యే మొత్తం వ్యయాన్ని ప్రజలు చార్జీల రూపంలో చెల్లించాల్సిందేనన్నది ప్రపంచ బ్యాంకు సిద్ధాంతం. 

విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేట్ సంస్థలకు ఫ్రాంచైజీల రూపంలో అప్పగించాలని, ఉచిత విద్యుత్ అమలు చేయవద్దని బ్యాంకు ఆదేశించింది. అయితే సేవలన్నిటినీ ఒకేసారి ప్రైవేట్‌పరం చేయకుండా మీటరింగ్, బిల్లింగ్ వ్యవస్థలను ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు అప్పగించారు. తర్వాత విద్యుత్ బిల్లుల కలెక్షన్ సెంటర్లను కూడా క్రమేణా తగ్గించారు. విద్యుత్ పంపిణీ మొత్తాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకూ ప్రయత్నించారు. అయితే 2004 ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఈ ప్రక్రియ కాస్తా అక్కడితో నిలిచిపోయింది. అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రపంచ బ్యాంకు ఆదేశాలను పూర్తిగా పక్కకు పెట్టేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా విద్యుత్‌రంగాన్ని ప్రభుత్వ పరిధిలోనే అభివృద్ధి చేశారు. ఉచిత విద్యుత్‌ను అమలు చేశారు. విద్యుత్ చార్జీలను ఒక్క పైసా కూడా పెంచలేదు. ఆయన మరణానంతరం తాజాగా కిరణ్ సర్కారు మళ్లీ ప్రపంచ బ్యాంకుకు వంతపాడుతూ ప్రైవేటీకరణ బాట పట్టింది. ఏటా విద్యుత్ చార్జీలు పెంచేందుకూ సిద్ధమవుతోంది.

ఫ్రాంచైజీ అంటే ప్రైవేటే..!

ఫ్రాంచైజీ విధానం అంటే ప్రైవేట్ సంస్థలకు ఎర్రతివాచీ పరచడమే. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో మీటరింగ్, బిల్లింగ్ పనులు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అయితే ఫ్రాంచైజీ విధానంలో వీటితో పాటు బిల్లుల వసూళ్లు, నెట్‌వర్క్ కార్యకలాపాలు.. నిర్వహణ (ఓ అండ్ ఎం), కొత్త లైన్ల ఏర్పాటు, కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరు బాధ్యతలూ ప్రైవేట్ సంస్థలకే అప్పగిస్తారు. ఫ్రాంచైజీ సంస్థను కాంపిటీటివ్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ విధానంలో ఒక సింగిల్ పాయింట్ వద్దకు ట్రాన్స్‌కో విద్యుత్‌ను సరఫరా చేస్తుంది. ఎంత మొత్తం సరఫరా చేసిందీ రీడింగు ద్వారా లెక్కిస్తారు. ముందే నిర్ణయించిన ధరలకు విద్యుత్‌ను ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుంది. విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించుకోవడం ద్వారా సదరు సంస్థ లాభాలను ఆర్జించుకోవాల్సి ఉంటుంది. 10 నుంచి 20 ఏళ్ల వరకు కాలానికి ఫ్రాంచైజీలకు అప్పగిస్తారు. ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన ప్రాంతంలో డిస్కంల ప్రమేయం ఏమీ ఉండదు. అంటే ఆ ప్రాంతంలో ఫ్రాంచైజీ ఎటువంటి కార్యకలాపాలు చేపట్టినప్పటికీ డిస్కంలు లేదా ఈఆర్‌సీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే పూర్తిగా ప్రైవేట్ సంస్థ రాజ్యం నడుస్తుందన్నమాట. 

ప్రైవేట్ పంపిణీ హైదరాబాద్ నుంచే అమలు!

విద్యుత్ పంపిణీ ప్రైవేట్‌పరం ప్రక్రియ హైదరాబాద్ నుంచే మొదలుకానుంది. మొదటి దశలో సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పరిధిలోని హైదరాబాద్ సౌత్ సర్కిల్‌ను ఫ్రాంచైజీలకు అప్పగించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఇందుకు నష్టాలను సాకుగా చూపాలని ప్రభుత్వం భావిస్తోంది. చార్మినార్, అస్మాన్‌గఢ్, బేగంబజార్ ప్రాంతాల్లో ఈ ఫ్రాంచైజీ విధానం మొదటగా అమల్లోకిరానుంది. దేశంలో మొదటిసారిగా మహారాష్ట్రలోని భివండీ ప్రాంతంలో విద్యుత్ పంపిణీని ఫ్రాంచైజీలకు అప్పగించారు. అక్కడి మాదిరిగానే రాష్ట్రంలోనూ అమలు చేయనున్నట్టు సమాచారం. ఈ విధానాన్ని క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తారు. ఇక మీకు విద్యుత్ కనెక్షన్ కావాలన్నా.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ కావాలన్నా ప్రైవేట్ సంస్థలను ఆశ్రయించాలి. డిస్కంలను నీరుగార్చే ఈ కుట్ర ఫలితంగా ఈ సంస్థలను నమ్ముకున్న 30 వేలకుపైగా ఉద్యోగులతో పాటు ప్రజలకూ ఇబ్బందులు తప్పవని విద్యుత్‌రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Share this article :

0 comments: