రిజిస్ట్రేషన్ బాదుడుకు ఓకే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రిజిస్ట్రేషన్ బాదుడుకు ఓకే

రిజిస్ట్రేషన్ బాదుడుకు ఓకే

Written By news on Saturday, March 30, 2013 | 3/30/2013

ప్రజలపై రూ. 2,400 కోట్ల అదనపు భారం.. 100 నుంచి ఏకంగా 300 శాతం దాకా పెంపు
సగటున 50% పెరుగుతున్న విలువలు.. రిజిస్ట్రేషన్ ఫీజు శాతం తగ్గింపు.. ఎంతో తేలేది నేడు


సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, నివసించే ఫ్లాటు... అన్నింటిపైనా రిజిస్ట్రేషన్ బాదుడు ఖాయమైంది. ముంగిట్లో స్థానిక సంస్థల ఎన్నికలున్నందున రిజిస్ట్రేషన్ (మార్కెట్) విలువలను పెంచడానికి ప్రభుత్వం సాహసించకపోవచ్చన్న అంచనాలు పూర్తిగా తప్పాయి. భూములు, స్థలాలు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ విలువల పెంపునకు ముఖ్యమంత్రి కిరణ్ పచ్చ జెండా ఊపారు. 

కొత్త (సవరించిన) రిజిస్ట్రేషన్ విలువల అమలు, దాంతోపాటే రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గింపునకు సంబంధించిన ఫైళ్లపై శుక్రవారం నల్లగొండ జిల్లా పర్యటనకు వెళ్లే ముందు సంతకం చేశారు. దాంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలతో పాటు సవరించిన రిజిస్ట్రేషన్ చార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ విలువలు సగటున 50 శాతం పెరిగాయని అధికార వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. విలువల పెంపు వల్ల ప్రజలపై రూ.3,300 కోట్ల దాకా అదనపు భారం పడనుందని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. కాకపోతే ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తున్న రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గింపును పరిగణనలోకి తీసుకుంటే ప్రజలపై భారం రూ.2,400 కోట్లకు పరిమితం కావచ్చని అంచనా. రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను కొంతయినా తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రిజిస్ట్రేషన్ చార్జీలను ఎంత తగ్గిస్తున్నదీ అధికారులు చెప్పడం లేదు. దీనిపై శనివారం జీవో విడుదల కానుంది. ప్రస్తుతం మొత్తం రిజిస్ట్రేషన్ విలువపై నగరాల్లో 5 శాతం స్టాంపు డ్యూటీ, 2 శాతం ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, అర శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి మొత్తం 7.5 శాతం వసూలు చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్టాంపు డ్యూటీ 5 శాతం, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ 3 శాతం, అరశాతం రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి మొత్తం 8.5 శాతం వసూలు చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి అన్ని ప్రాంతాలకూ రిజిస్ట్రేషన్ ఫీజు శాతం సమానం కానుంది. అది 6, లేదా 5 శాతానికి తగ్గే అవకాశముంది.


బాదుడే బాదుడు...

రిజిస్ట్రేషన్ విలువల పెంపు రాష్ట్రంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంది. హైదరాబాద్‌లో 15 నుంచి 40 శాతం వరకు పెరగ్గా, కొన్ని జిల్లాల్లో మాత్రం ఇది ఏకంగా 300 శాతం వరకూ ఉంది! చాలా జిల్లాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విలువలను రెట్టింపు చేశారు. కొన్నిచోట్ల రెండు, మూడు రెట్లకు కూడా పెంచేశారు. సీఎం సొంత జిల్లా చిత్తూరులో కొన్ని ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువను 300 శాతం పెంచారు. అంటే ఏప్రిల్ 1 తర్వాత ఈ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేసేవారు మూడు రెట్లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుంది. కష్టించి సంపాదించిన డబ్బుతో ఎకరా, రెండెకరాల వ్యవసాయ భూమి కొనాలని ఆశించే రైతులకు ఇది పెను భారమే. ఇక అపార్ట్‌మెంట్లకు సంబంధించి చాలాచోట్ల చదరపు అడుగుకు రిజిస్ట్రేషన్ విలువ 20 నుంచి 40 శాతం దాకా పెరిగింది. జీవితాంతం కష్టపడైనా సొంతిల్లు సమకూర్చుకుందామనే ఆశ పడే సగటు జీవులకు ఇది శరాఘాతమే! హైదరాబాద్‌లో స్థలాల విలువ కంటే అపార్ట్‌మెంటు విలువలు ఎక్కువగా పెంచారు. రాజధాని శివార్లలో విలువల పెంపు 50 శాతం దాకా ఉంది. ద్వితీయ శ్రేణి నగరాలుగా ఎదుగుతున్న పట్టణాల సరిహద్దుల్లో మార్కెట్ విలువలు పలుచోట్ల 200 నుంచి 300 శాతం దాకా పెరిగాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.6,600 కోట్ల ఆదాయం వచ్చింది. తాజా పెంపుతో 2013-14లో అది రూ.9,900 కోట్లకు పెరుగుతుందని అంచనా.

ఇలా బాదేస్తున్నారు...

వరంగల్ జిల్లా హన్మకొండ మండలం గోపాలపురంలో ఎకరా పొలం రిజిస్ట్రేషన్ విలువ ప్రస్తుతం రూ.80 లక్షలుండగా రూ. 1.45 కోట్లకు పెంచారు. ఇదే మండలంలోని ఎనుమాముల గ్రామంలో ఎకరా వ్యవసాయ భూమి విలువను రూ.45 లక్షల నుంచి రూ. 88 లక్షలకు పెంచారు.

నల్లగొండ పట్టణంలోని అద్దంకి బైపాస్ రోడ్డులో ఎకరా పొలం రిజిస్ట్రేషన్ విలువను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. నల్లగొండ పట్టణ సరిహద్దులో జాతీయ రహదారి వెంబడి కొన్ని ప్రాంతాల్లో ఎకరా విలువను రూ.3 లక్షల నుంచి ఏకంగా రూ.20 లక్షలకు పెంచారు. ఇదే ప్రాంతంలోని అనపర్తిలో ఎకరా విలువను రూ.10 లక్షల నుంచి రూ.24 లక్షలకు పెంచారు.

వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని ద్వారకా నగర్‌లో గజం ఇంటి స్థలం విలువను రూ.5,000 నుంచి రూ.10,000 కు పెంచారు. జిల్లాలోని రాజంపేట మండలం మన్నూరులో ఎకరా వ్యవసాయ భూమి మార్కెట్ విలువను రూ.1.1 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. ఇదే ప్రాంతంలో హైవే పక్కనున్న వ్యవసాయ భూమి ఎకరా విలువను రూ.4.85 లక్షల నుంచి రూ.10 లక్షలకు సవరించారు!

హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్, ఎల్లారెడ్డిగూడల్లో చదరపు గజం స్థలం రిజిస్ట్రేషన్ విలువ రూ.47,000 నుంచి ఏకంగా రూ.60,000కు పెరగనుంది! గ్రీన్‌ల్యాండ్స్‌లో రూ.33,000 నుంచి రూ.44,000కు పెరుగుతోంది.

తిరుపతి అర్బన్ ప్రాంతంలోని కొరమేరగుంట గ్రామంలో ఎకరా భూమి రిజిస్ట్రేషన్ విలువను రూ.10 లక్షల నుంచి ఏకంగా రూ.40 లక్షలకు పెంచారు!

చిత్తూరులోని ప్రకాశం హైవేలో సెంటు (48.4 చదరపు గజాలు) విలువను రూ.15 వేల నుంచి రూ.26 వేలకు పెంచారు
వాల్మికిపురం మండలం గండబోయినపల్లిలో ఎకరా రూ.1.15 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచారు
తిరుపతి పరిసరాల్లో అపార్ట్‌మెంట్లకు సంబంధించి చదరపు అడుగు విలువను రూ.800 నుంచి రూ.1,200కు పెంచారు
విశాఖలోని మద్దిలపాలెంలో చదరపు గజం విలువ రూ.15 వేల నుంచి రూ.30 వేలకు పెరిగింది. జగదాంబ సెంటర్ ప్రాంతంలో రూ.30 వేల నుంచి రూ.40 వేలకు, సీతమ్మధారలో రూ.25 వేల నుంచి రూ.35 వేలకు పెరిగింది.
Share this article :

0 comments: