వ్యవ‘సాయం’ కనికట్టు ,పేరుకే ప్రత్యేక బడ్జెట్... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వ్యవ‘సాయం’ కనికట్టు ,పేరుకే ప్రత్యేక బడ్జెట్...

వ్యవ‘సాయం’ కనికట్టు ,పేరుకే ప్రత్యేక బడ్జెట్...

Written By ysrcongress on Tuesday, March 19, 2013 | 3/19/2013

వ్యవసాయానికి రూ. 25,962 కోట్ల కేటాయింపులంటూ గొప్పలు
జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి పద్దుల కే రూ. 19,428.79 కోట్లు
ఇవి మినహాయిస్తే వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 6,127 కోట్లే
అంటే మొత్తం బడ్జెట్‌లో వ్యవసాయం వాటా 3.80 శాతం మాత్రమే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (4.01 శాతం)తో పోల్చుకుంటే తగ్గిన వాటా
బ్యాంకు రుణాలను కూడా బడ్జెట్‌లో జమచేసే చౌకబారు ఎత్తుగడ
మార్కెట్ ఆలంబన నిధికి రూ. 100 కోట్ల విదిలింపులు
రైతులకు మేలు చేసే అంశాలేవీ లేవన్న నిపుణులు

 రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన వార్షిక బడ్జెట్ ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 4.01 శాతం ఉండగా, అది వచ్చే ఏడాదిలో (2013-14) 3.08 శాతానికి తగ్గింది. వ్యవసాయ మంత్రి ప్రవేశపెట్టిన ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ లెక్కల ప్రకారమైతే వ్యవసాయ, అనుబంధ రంగాలకు (జలయజ్ఞం, ఉచిత విద్యుత్ తదితర పెద్ద పద్దులు కలిపి) కేటాయింపులు గత ఏడాది కన్నా 24 శాతం అధికంగా ఉన్నాయి. 

ఈ రెండిటి మధ్య తేడా తెలుసుకుంటే ‘ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్’ పేరుతో రాష్ట్రప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేసిన కనికట్టు అర్థమైపోతుంది. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ తీసుకొస్తున్నామంటూ రెండు, మూడు నెలలుగా ఊదరగొట్టిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు ‘బడ్జెట్ కాని బడ్జెట్‌ను’ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇది బడ్జెట్ కాదని, వార్షిక కార్యాచరణ ప్రణాళికగా సవరించి చదువుకోమని కోరుతూ వ్యవసాయ శాఖమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ధోరణిలోనే మంత్రి ప్రసంగం కొనసాగింది. ఈ సాంకేతిక అంశాన్ని అటుం చితే, 2013-14 బడ్జెట్‌లో రైతులకు కానీ, వ్యవసాయ రంగానికి కానీ చెప్పుకోదగ్గ మేలు చేసే అంశాలేమీ లేవని వ్యవసాయ రంగ నిపుణులు నిర్ద్వంద్వంగా పేర్కొంటున్నారు. 

జలయజ్ఞం, ఉచిత విద్యుత్, అడవులు.. వగైరా పద్దులను తీసేసి వాస్తవంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు జరిపిన కేటాయింపులను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ ప్రభుత్వానికి రైతులపై ప్రేమ పెరిగిందో... తగ్గిందో తేటతెల్లమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ దాదాపు రూ.1 లక్షా 40 వేల కోట్లు. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాల కేటాయింపులు రూ.5,605 కోట్లు (4.01 శాతం). వచ్చే ఏడాదికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ దాదాపు రూ.1 లక్షా 60 వేల కోట్లు. ఇందులో వ్యవసాయ అనుబంధ రంగాల కేటాయింపు రూ.6,127 (జలయజ్ఞం లాంటివి మినహాయిస్తే..) కోట్లు (3.80 శాతం) మాత్రమే. పెరిగిన వార్షిక బడ్జెట్ దామాషాలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేటాయిపులు చేయకపోగా అంకెల గారడీ చేసి ప్రభుత్వం గత బడ్జెట్‌కన్నా ఈ ఏడాది 24 శాతం అధిక కేటాయింపులు చేశామని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజానీకాన్ని మాయ చేసే ప్రయత్నం చేసిందనే అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతోంది. ఉచిత విద్యుత్, జలయజ్ఞం లాంటి పెద్ద పద్దులన్నీ కలిపి వ్యవసాయ బడ్జెట్‌ను రూ.25,962 కోట్లుగా ప్రభుత్వం చూపింది. ఇందులో రూ.8,267.41 కోట్లు ప్రణాళికేతర (సిబ్బంది జీత భత్యాలు వగైరా) వ్యయం.

రుణపరపతి లక్ష్యం రూ.72 వేల కోట్లు.. 

ఈ ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రుణ పరపతి లక్ష్యం రూ.72 వేల కోట్లుగా పేర్కొన్నారు. వ్యవసాయ మంత్రి కన్నా ఈ మొత్తాన్ని కూడా బడ్జెట్‌లో కలిపేసి గొప్పలు చెప్పే ప్రయత్నం చేశారు. రూ.72 వేల కోట్ల రుణాల్లో కనీసం రూ.60 వేల కోట్లయినా పంట రుణాలు ఉంటాయి. రూ.60 వేల కోట్లకు 4 శాతం వడ్డీ లెక్కేస్తే, బ్యాంకు రుణాలకు వడ్డీ మాఫీ కింద ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ.2,400 కోట్లు అవుతుంది. అయితే కేవలం రూ.500 కోట్లే కేటాయించడాన్ని బట్టి ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది.

మొక్కుబడి ‘ఆలంబన’..!

ప్రస్తుత బడ్జెట్‌లో ఏదన్నా కొత్త అంశం ఉందంటే అది ‘మార్కెట్ ఆలంబన నిధి’. రైతుకు కనీస మద్దతు ధర కూడా రాని పరిస్థితుల్లో మార్కెట్‌లో జోక్యం చేసుకునేందుకు కేటాయించిన నిధి ఇది. ఇందుకోసం కనీసం రూ.3,000 కోట్లు కేటాయించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అయితే ప్రభుత్వం ఈ నిధికి కేవలం రూ.100 కోట్లు కేటాయించింది. ఈ సంవత్సరం కనీస మద్దతు ధర లభించక సగటున క్వింటాలుకు రూ.500 చొప్పున రాష్ట్ర పత్తి రైతులు రూ.2,వేల కోట్లు నష్టపోయారు. రాష్ట్ర రైతాంగాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య ‘గిట్టుబాటు ధర’. ఇంతటి ప్రాధాన్యత ఉన్న సమస్య పరిష్కారానికి రూ.100 కోట్లు విదిలించడమంటే చిత్తశుద్ధి లేకపోవడమే అన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

కేంద్ర నిధుల వాటానే ఎక్కువ...

వ్యవసాయ యాంత్రీకరణ, సోలార్ పంపుసెట్ల ఏర్పాటు, ఉద్యానవన శాఖ కేటాయింపులు వగైరా పద్దుల్లో ప్రభుత్వం చూపిన లెక్కల్లో సింహ భాగం కేంద్ర నిధులే. సోలార్ పంపుసెట్ల ఏర్పాటుకు 30 శాతం కేంద్రం సబ్సిడీ ఇస్తే, 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన 50 శాతం రైతు భరించాలి. ఈ పద్దుకింద బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్రం వాటా రూ.90 కోట్లు ఉంటే రాష్ట్ర వాటా రూ.60 కోట్లు మాత్రమే. ఇలాగే పలు పథకాల్లో కూడా కేంద్ర నిధుల వాటా గణనీయంగా ఉంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్‌కేవీవై) కింద రూ.724.41కోట్లు కేటాయిస్తే ఇందులో 80 శాతం నిధులు కేంద్రానివే. కేంద్ర వాటాగా వచ్చే నిధులు, ఉచిత విద్యుత్, జలయజ్ఞం పద్దులే కాకుండా బ్యాంకులు ఇచ్చే రుణాల మెత్తాన్ని కూడా కలుపుకుని ఈ వార్షిక వ్యవసాయ బడ్జెట్‌లో కేటాయింపులు రూ.98,940 కోట్లని, ఇది గత బడ్జెట్ కన్నా 24 శాతం అధికమని వ్యవసాయ శాఖమంత్రి తన బడ్జెట్ ప్రసంగానికి ముక్తాయింపు ఇచ్చారు. ఈ విషయమై వ్యవసాయ శాఖలోనే ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. ‘నాకు, మా దొరకు కలిసి 100 జతల ఎద్దులున్నాయి.’అన్న సామెత ఇప్పుడు గుర్తుకొస్తోంద ంటూ వ్యాఖ్యానించారు.

వైఎస్ ప్రస్తావన లేని వ్యవసాయ ‘ప్రత్యేకం’ 

వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రగతి సాధించాలంటే ప్రత్యేక బడ్జెట్ ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తన ప్రసంగంలో చెప్పారు. అందుకే మొదటిసారిగా వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామన్నారు. అయితే రైతు శ్రేయస్సు కోసం ఉచిత విద్యుత్, పావలా వడ్డీ, జలయజ్ఞం వంటి వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును మాత్రం ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. వైఎస్ హయాంలో చేపట్టిన రైతు సంక్షేమ పథకాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ‘మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో’ అంటూ... కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో చేపట్టిన కార్యక్రమాల ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం ‘కిరణ్‌కుమార్ రెడ్డిగారి ప్రభుత్వంలో’ అని పేర్కొంటూ కన్నా తన ప్రసంగాన్ని కొనసాగించారు. 2013-14లో నాణ్యమైన విత్తనాల సరఫరా, పొలంబడి, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్‌కేవీవై), జాతీయ వ్యవసాయ బీమా పథకం, జాతీయ ఆహార భద్రత మిషన్, పావలా వడ్డీ రుణాలు, వడ్డీలేని పంట రుణాలు, వ్యవసాయంలో యాంత్రీకరణ, ఇన్‌పుట్ సబ్సిడీలు ప్రభుత్వ ప్రాధాన్య అంశాలుగా పేర్కొన్నారు. 

వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయింపులివీ..

వ్యవసాయ యాంత్రీకరణకు రూ.450 కోట్లు
సోలార్ విద్యుత్‌కు రూ.150 కోట్లు
సబ్సిడీపై విత్తన సరఫరాకు రూ.308 కోట్లు
జాతీయ వ్యవసాయ బీమా పథకానికి రూ.410 కోట్లు
వడ్డీలేని రుణాలకు రూ.500 కోట్లు, పావలా వడ్డీకి రూ.60 కోట్లు
వర్షాధార వ్యవసాయాభివృద్ధికి రూ.2903.50 కోట్లు
ఉద్యానవన పంటల అభివృద్ధికి రూ.517.42 కోట్లు

పశుసంవర్ధక శాఖకు ప్రణాళికా వ్యయం కింద రూ.269.57 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.654.58 కోట్లు.

మత్స్య శాఖకు ప్రణాళికా వ్యయం కింద రూ.184.35 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.57.16 కోట్లు.
అటవీ శాఖకు ప్రణాళికా వ్యయం కింద రూ.134.49 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.398.17 కోట్లు.
సహకార శాఖకు ప్రణాళికా వ్యయం కింద రూ.6.87 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.190.61 కోట్లు.
జలయజ్ఞం పనులకు ప్రణాళికా వ్యయం కింద రూ.13,804 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.874.68 కోట్లు

పట్టు పరిశ్రమాభివృద్ధికి ప్రణాళికా వ్యయం కింద రూ.79.20 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.122.40 కోట్లు.

ధాన్యం గిడ్డంగుల నిర్మాణానికి రూ.41.77 కోట్లు
ఆగ్రో ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రూ.120 కోట్లు

చక్కెర రంగానికి ప్రణాళికా వ్యయం కింద రూ.52.05 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.57.93 కోట్లు.
ఉచిత విద్యుత్‌కు రూ.3,621.99 కోట్లు
16 జిల్లాల్లో నాణ్యమైన వ్యవసాయ విద్యుత్ అందించేందుకు రూ.1,154.80 కోట్లు
మార్కెట్ ఆలంబన నిధి కింద రూ.100 కోట్లు
ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధికి రూ.589.04 కోట్లు
Share this article :

0 comments: