చీకటి ఒప్పందాలు వారివే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చీకటి ఒప్పందాలు వారివే

చీకటి ఒప్పందాలు వారివే

Written By ysrcongress on Friday, March 15, 2013 | 3/15/2013

కన్నడ పత్రిక ‘విజయవాణి’ కథనం కొత్తేమీ కాదు
ఏడాది క్రితమే ‘విజయ కర్ణాటక’లో వచ్చింది
రెండు జాతీయ పార్టీలకు గాలి విరాళాలిచ్చినట్టు ఆ పత్రిక పేర్కొంది
దాన్నే మక్కికి మక్కి కాపీ కొట్టిన విజయవాణి
వైఎస్ పేరును మాత్రం అదనంగా జోడించింది
దాన్ని పట్టుకుని కేశవ్ అండ్ కో పూనకాలు
జగన్ బెయిల్‌ను అడ్డుకోవడమే లక్ష్యం 
సీబీఐ పాత్ర కూడా అభ్యంతరకరం
బాబు, కేశవ్, కాలువలకే గాలి ముడుపులు
ఆయనతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు
వైఎస్‌పై తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారు

గాలి జనార్దనరెడ్డితో టీడీపీ నేతలు చీకటి ఒప్పందాలు చేసుకుని, ఆరోపణలను మాత్రం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిపై చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బి.గుర్నాథరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్‌కు గాలి జనార్దనరెడ్డి రూ.500 కోట్లు ఇచ్చారన్న టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కర్ణాటకకు చెందిన విజయవాణి పత్రికలో ఇటీవల వచ్చిన కథనం కొత్తదేమీ కాదని, 2012లో ‘విజయ కర్ణాటక’ పత్రిక రాసినదేనని అన్నారు. ‘‘రెండు జాతీయ పార్టీలకు గాలి విరాళాలు ఇచ్చారని మాత్రమే విజయ కర్ణాటక తన కథనంలో పేర్కొంది. పైగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రస్తావన అందులో ఎక్కడా లేదు. అదే కథనాన్ని మక్కికి మక్కి ఇచ్చిన విజయవాణి, దానికి వైఎస్ పేరును మాత్రం కొత్తగా జోడించింది. దాన్ని పట్టుకుని కేశవ్ సహా తెలుగు దేశం నాయకులు పూనకం వచ్చిన వారిలాగా ఊగిపోయారు. నానా హంగామా చేశారు’’ అంటూ దుయ్యబట్టారు. గుర్నాథరెడ్డి గురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

‘‘పాత కథనాల ఆధారంగా కేశవ్ ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? వారి వద్ద ఉన్న ఆధారాలేమిటి? రాష్ట్ర ప్రజల మన్ననలను చూరగొని రెండోసారి అధికారంలోకి వచ్చిన వైఎస్‌పై నిరాధార ఆరోపణలు చేసి ఆయన ప్రతిష్ట దెబ్బతీయడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికీ బురద అంటించజూస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు. అసలు సీబీఐ విచారణ వివరాలు టీడీపీకి ఎలా అందుతున్నాయో తమకు అర్థం కావడం లేదన్నారు. సీబీఐ స్వయంగా టీడీపీకి చెప్పి మరీ ఇలా చేయిస్తోందేమోనంటూ అనుమానం వ్యక్తం చేశారు. పైగా ఈ విషయాలు మీడియాకు ఎలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలో ఎల్లో మీడియాలో అబద్ధపు రాతలు రాయించడం, వాటిపై టీడీపీ నేతలు విలేకరుల సమావేశాలు పెట్టడం, మళ్లీ వాటినే అసెంబ్లీలో ప్రస్తావించడం గతంలో జరిగేది. 

ఇప్పుడు కర్ణాటకలోనూ అదే తంతు జరుగుతోంది. అక్కడి అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని మన రాష్ట్రానికి అంటగడుతూ అందులో వైఎస్‌పై ఆరోపణలు చేస్తూ వార్తలు రావడమేమిటి? కర్ణాటకలో జనార్దనరెడ్డి రూ.2,500 కోట్ల మేరకు అక్రమ మైనింగ్ చేసి, అందులో రూ.500 కోట్ల దాకా రెండు జాతీయ పార్టీలకు ఇచ్చారంటున్నారు కదా! జాతీయ పార్టీలంటే కాంగ్రెస్, బీజేపీలే కదా! ఈ విషయాన్ని టీడీపీ వారు ఎందుకు ప్రస్తావించడం లేదు?’’ అంటూ నిలదీశారు. జగన్ బెయిల్ పిటిషన్ కొద్ది రోజుల్లో విచారణకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప వాటిలో ఏ మాత్రం వాస్తవాలు లేవని స్పష్టం చేశారు. సత్యదూరమైన ఆరోపణలు చేసే నీచ సంస్కృతి విడనాడక పోతే తాము టీడీపీ నేతల బండారాన్ని బజారులో పెడతామని హెచ్చరించారు.

చీకటి ఒప్పందాలు వారివే

వాస్తవానికి గాలి జనార్దనరెడ్డితో చీకటి ఒప్పందాలు చేసుకున్నది టీడీపీ నేతలేనని గుర్నాథరెడ్డి చెప్పారు. ‘‘పయ్యావుల కేశవ్, టీడీపీ మాజీ ఎంపీ కాలువ శ్రీనివాసులు ఇద్దరూ 2009 ఎన్నికలకు ముందు బెంగళూరు రేస్‌కోర్సులోని వెస్ట్ ఎండ్ హోట ల్‌లో గాలి జనార్దనరెడ్డిని కలిసి మంతనాలు జరపడం వాస్తవం కాదా? దీనిపై మా వద్ద పక్కా రుజువులున్నాయి. అంతేకాదు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, గాలి జనార్దనరెడ్డి విదేశాల్లో కలుసుకున్నట్టు కూడా మా వద్ద రుజువులున్నాయి. వారిద్దరూ మరో ఇద్దరు వ్యక్తుల సమక్షంలో కలుసుకున్నారు. బాబు, జనార్దనరెడ్డిల పాస్‌పోర్టులను పరిశీలించినా ఈ విషయం వెల్లడవుతుంది. దీన్ని మేం నిరూపిస్తాం’’ అంటూ గుర్నాథరెడ్డి సవాలు విసిరారు. ‘గాలి జనార్దనరెడ్డిని టీడీపీ నేతలు ఫలానా చోట కలుసుకున్నారని, ముడుపులు తీసుకున్నారని మేము నేరుగా ఆరోపణలు చేస్తున్నాం. ఇందుకు వారు ఏం సమాధానం చెబుతారు’ అని సూటిగా ప్రశ్నించారు. జగన్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నపుడల్లా ఇలాంటి ఆరోపణలు చేయడం టీడీపీ నేతలకు అలవాటైపోయిందని మండిపడ్డారు. వారందరికీ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని తీవ్రంగా హెచ్చరించారు. మూడున్నరేళ్ల క్రితం మరణించిన వైఎస్ తిరిగొచ్చి ఎలాగూ సమాధానం చెప్పుకోలేరనే టీడీపీ నేతలు ఇలాంటి ఆరోపణలకు తెగబడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఏ ఆధారాలూ లేకపోయినా, సమాధానం చెప్పలేరని తెలిసి కూడా వైఎస్‌పై ఆరోపణలు చేస్తున్న కేశవ్, కాలువ, బాబులు జనార్దనరెడ్డి నుంచి తీసుకున్న ముడుపుల మాటేమిటని ప్రశ్నించారు.
Share this article :

0 comments: