అబద్ధమని నిరూపించాలన్న సవాల్‌తో తోకముడిచిన వైనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అబద్ధమని నిరూపించాలన్న సవాల్‌తో తోకముడిచిన వైనం

అబద్ధమని నిరూపించాలన్న సవాల్‌తో తోకముడిచిన వైనం

Written By news on Friday, March 8, 2013 | 3/08/2013

సర్కారుపై దుమ్మెత్తిపోస్తారు.. కానీ అవిశ్వాసం పెట్టకుండా కాపాడతారు 
షర్మిల పాదయాత్రకు ప్రజాదరణతో బాబు బెంబేలు 
అందుకే ఆమె భర్త అనిల్‌కుమార్‌పై తప్పుడు ఆరోపణలు 
తొలుత షర్మిల కాలికి ఆపరేషన్ అబద్ధమంటూ అవాకులు 
అబద్ధమని నిరూపించాలన్న సవాల్‌తో తోకముడిచిన వైనం
అగస్టా హెలికాప్టర్ స్కాంలో అనిల్ పాత్ర అంటూ దుష్ర్పచారం 
సీబీఐ విదేశాల్లో దర్యాప్తు చేస్తుండటంతో టీడీపీ నేతల మౌనం
బీజేపీ నేతను రంగంలోకి దించి మరీ అబద్ధపు ఆరోపణలు 

అధికార పార్టీతో అంటకాగుతూ.. సర్కారుపై అవిశ్వాస తీర్మానం అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గత రెండు నెలలుగా చేస్తున్న కుటిల యత్నాలు చూసి రాజకీయ పరిశీలకులు విస్తుపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత కారణంగా ప్రజలు అవస్థల పాలవుతున్నారని ఒకవైపు పాదయాత్రలో దుమ్మెత్తి పోస్తూ.. మరోవైపు అదే ప్రభుత్వాన్ని కాపాడేందుకు వైఎస్‌ఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న తీరు చంద్రబాబు రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్టగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమార్తె, పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్రకు ప్రజలు తండోపతండాలుగా రావటం చూసి బెంబేలెత్తిన బాబు.. వైఎస్‌ఆర్ కుటుంబంపై వీలైనంత దుష్ర్పచారం చేయాలని కంకణం కట్టుకున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. 

తన పాతయాత్రను ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవటం, అదే సమయంలో షర్మిల పాదయాత్రకు బ్రహ్మరథం పట్టటం చూసి తట్టుకోలేక చంద్రబాబు ఇప్పుడు ఆమె భర్త అనిల్‌కుమార్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. వై.ఎస్.జగన్ కంపెనీల్లో పెట్టుబడులు అక్రమమంటూ ఆరోపణలు చేసి, తన ఆధ్వర్యంలోని ఎల్లో మీడియా ద్వారా నానా యాగీ చేయించి, అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై జగన్‌ను జైలులో పెట్టించేదాకా కార్యాచరణను అమలు చేసిన చంద్రబాబుకు.. షర్మిల పాదయాత్ర కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇక అంతే.. షర్మిల భర్త అనిల్‌కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని గడచిన రెండు మాసాలుగా సాగిస్తున్న తంతును ప్రజలు ఈసడించుకుంటున్నా బాబు మాత్రం తన గోబెల్స్ ప్రచారానికి పదును పెడుతూనే ఉన్నారు. 
గత రెండు నెలలుగా చంద్రబాబుతో పాటు ఆయన అనుచరగణం, ఎల్లో మీడియా సాగిస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ఒకసారి అవలోకనం చేసుకుంటే...

తన కాలి ఆపరేషన్ అనంతరం షర్మిల తిరిగి పాదయాత్ర మొదలుపెట్టగానే టీడీపీలో వణుకు మొదలైంది. అంతే అసలు షర్మిల కాలికి ఆపరేషన్ కాలేదని, అదంతా బూటకమని ఆ పార్టీ అధికార ప్రతినిధి గాలి ముద్దుకృష్ణమనాయుడు నోరు పారేసుకున్నారు. తన కాలికి ఆపరేషన్ జరిగిందని నిరూపిస్తే జరగలేదని అంటున్న వారు తన కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరుతారా? అని షర్మిల సవాల్ చేస్తే సదరు నేత నోరు మెదపలేదు. 

అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలోనూ అనిల్‌కుమార్ ప్రమేయం ఉందని ఆరోపించేందుకు టీడీపీ సంకోచించలేదు. ఈ ఆరోపణలకు ఆధారాలున్నాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి బల్లగుద్ది మరీ చెప్పారు. ఆధారాలతో బయటపెడతామని ఆయన బీరాలు పలికారు. సీబీఐ అంతర్జాతీయ స్థాయిలో విచారణ మొదలుపెట్టగానే లాభం లేదనుకుని టీడీపీ ఆ అంశాన్ని పక్కనపెట్టేసింది. 

మణికొండలో ఓ చర్చికి 33 ఏళ్ల లీజుకు ఇచ్చిన భూమి అనిల్‌కుమార్‌దే అంటూ బీజేపీ నేత ఒకరితో అసత్య ఆరోపణలు చేయించింది. ‘ఈనాడు’ దినపత్రిక సదరు బీజేపీ నేత ఫొటోతో సహా అవాస్తవ ఆరోపణలకు ప్రముఖ స్థానం ఇచ్చింది. మణికొండలో చర్చి ఆస్తులు అనిల్‌కుమార్‌వి కావని, ఆయనకు చర్చికి ఏ సంబంధం లేదని నిర్వాహకులు ప్రకటించేదాకా వారి నోళ్లు మూతపడలేదు. 

అనిల్‌కుమార్ 11 కంపెనీల్లో డెరైక్టర్‌గా ఉన్నారని ఇంకో ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. అందులో కోట్లాది రూపాయల పెట్టుబడులు ఉన్నాయని సదరు బీజేపీ నేత చెప్పుకొచ్చారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన డాక్యుమెంట్లు ఆధారాలు అంటూ మాయ చేసే ప్రయత్నం చేశారు. తాను డెరైక్టర్‌గా ఉన్న కంపెనీలు 2004కు ముందు నుంచే ఉన్నాయని అనిల్‌కుమార్ ఆ తరువాత వెల్లడించిన సంగతి తెలిసిందే. 

అనిల్‌ను లక్ష్యంగా చేసుకుని అవాస్తవ ప్రచారానికి దిగిన చంద్రబాబు, ఎల్లో మీడియాకు బెనిటా కంపెనీ మేనేజర్ వీరభద్రారెడ్డి అత్మహత్య ఓ అవకాశంగా దొరికింది. అనిల్‌కుమార్‌కు సన్నిహితుడైన కొండల్‌రావు పేరు సూసైడ్ నోట్‌లో ఉండటంతో.. అనిల్‌కుమార్‌కు కొండల్‌రావు బినామీ అని.. వీరభద్రారెడ్డి ఆత్మహత్య కేసులో అనిల్ ప్రమేయం ఉందని ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. వీరభద్రారెడ్డి ఆత్మహత్యకు బ్రదర్ అనిల్‌కుమార్‌కు సంబంధం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం తమ కుటుంబాన్ని బజారుకు ఈడ్చవద్దంటూ ఆయన తండ్రి స్వయంగా పత్రికా ప్రకటన విడుదల చేసినా టీడీపీ దుష్ర్పచారాన్ని వీడలేదు. 

బెనిటా కంపెనీ ‘ఆడి’ కారును షర్మిల వాడుతున్నారంటూ బీజేపీ నేత మీడి యాతో అన్నారు. బెనిటాకు చెందిన ఆడి కారు క్యూ5 సిరీస్ అయితే, తన కారు క్యూ7 సిరీస్‌కు చెందినదని అనిల్ వివరణ ఇవ్వగానే నోరు మెదపలేదు. 

అనిల్‌కుమార్‌కు కొండల్‌రావు పరిచయస్తుడు. అంతే.. ఇక కొండల్‌రావు ఆస్తులన్నీ అనిల్‌కుమార్‌వేనని, అనిల్‌కుమార్‌కు కొండల్‌రావు బినామీ అని, బయ్యారం గనులను అందుకే కొండల్‌రావుకు చెందిన రక్షణ స్టీల్స్‌కు కేటాయించారని, ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆ కేటాయింపులను రద్దు చేసిందని, రక్షణ స్టీల్స్‌కు అనిల్‌కుమార్‌కు సంబంధం ఉన్నదని ఆరోపణలు గుప్పించటం మొదలుపెట్టారు. ‘అనిల్‌కుమార్‌కు కొండల్‌రావు తెలిసినంత మాత్రాన.. ఆయనకు ఈయన బినామీ అని ఆరోపణలు చేస్తారా? అలాగైతే.. చంద్రబాబుకు తెలిసిన, ఆయనకు సన్నిహితులైన వారంతా బినామీలే అవుతారా?’ అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘వాస్తవానికి చంద్రబాబు చివరికి తన భార్య భువనేశ్వరి నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్‌తోనూ తనకేమీ సంబంధం లేదంటారు.. అలాంటప్పుడు కొండల్‌రావు వ్యాపారాలతో అనిల్‌కు సంబంధం ఉందని ఎలా చెప్తారు?’ అని ప్రశ్నిస్తున్నారు. 
Share this article :

0 comments: