బేరం ఎంతకు కుదిరింది? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బేరం ఎంతకు కుదిరింది?

బేరం ఎంతకు కుదిరింది?

Written By news on Thursday, March 14, 2013 | 3/14/2013

- అందుకే అవిశ్వాసానికి తెలుగుదేశం పార్టీ దూరం
- బాబు ఇంటి పేరు నయవంచన.. ప్రజలు ఆయన్ను నిలదీయాలి
- {పతిసారీ కాంగ్రెస్ ప్రభుత్వాలను బాబే కాపాడుతున్నారు 

 ‘‘ముఖం మీద ఉమ్ముతున్నా అవిశ్వాసానికి మద్దతివ్వబోమంటూ చంద్రబాబు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా చెప్తున్నారు. ఛీ ఛీ చంద్రబాబు అని అసహ్యించుకుంటున్నా వైఖరి మారదా? ప్రజా కంటక ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టవు? సీఎం కిరణ్‌తో బేరం ఎంతకు కుదిరింది? అందిన ముడుపులెన్ని’’ అంటూ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బాబు ఇంటి పేరు నయవంచన అని.., మోసం, దగా అసలు పేరు అని విమర్శించారు. బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వ్యతిరేకత, తెలుగువారి ఆత్మగౌరవం పునాదులపై పుట్టిన టీడీపీ చరిత్రలోనే ఇంత అనైతికమైన, హీనాతిహీనమైన నిర్ణయాల్లేవని చెప్పారు. 

బాబు వంటి థర్డ్ రేట్ రాజకీయ నాయకుడి చేతిలోనే టీడీపీ దాని పునాదులను పక్కనబెట్టి కాంగ్రెస్ ముందు మోకరిల్లిందని వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పటిదాకా అవిశ్వాసం తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ మేము అసెంబ్లీలో నోటీసు ఇవ్వలేదు. ప్రధాన ప్రతిపక్షం అనే పౌరుషం ఉంటే అవిశ్వాసంపై చంద్రబాబే ముందుకొచ్చి ప్రకటన చేయాలి. మేమే మద్దతిస్తాం. లేకుంటే మేమే పెడతం. మీరు మద్దతిస్తే ఏంది? కాంగ్రెస్‌ను కాపాడాల్సిన అవసరం ఏంది? దీని వెనుక కారణాలు ఏమిటి? కుట్రలు ఏమి ఉన్నయి? ఎన్ని ముడుపులు అందినయి? దేనికి ఆశపడుతున్నవు? ఎవరికి భయపడుతున్నవు? ఇంత నీచంగా, హీనాతిహీనంగా దిగజారిన, దిక్కుమాలిన బతుకు చంద్రబాబుకు అవసరమా’’ అని అన్నారు.

సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారీ కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలను చంద్రబాబు కాపాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతుంటే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందని అన్నారు. నాటి పౌరుషం, ఛాయలు, స్ఫూర్తి ఈ టీడీపీలో లేవన్నారు. కాంగ్రెస్ టీడీపీగా పేరు మార్చుకోవాలని అన్నారు. ‘‘ఇది టీడీపీ చేసిన చారిత్రక తప్పిదం. ఆ పార్టీ చరిత్రలో కాంగ్రెస్ కాళ్లపై పడిన సంఘటనలున్నయా? టీడీపీ పరువు పోయింది. దుర్మార్గమైన, హేయమైన చర్య. అవిశ్వాసానికి మద్దతునివ్వకుంటే కాంగ్రెస్‌ను తిడుతున్నట్లుగా ఇంకా బూటకపు మాటలను ఎవరు నమ్ముతరు? నక్కజిత్తుల నటన ఎవరికోసం’ అని ప్రశ్నించారు. పాదయాత్రలో ఉన్న చంద్రబాబును ఆంధ్రా ప్రజలు నిలదీయాలని విజ్ఞప్తి చేశారు.

బాబు రంగు బయటపడింది: ఈ అసెంబ్లీ సమావేశాల్లో కచ్చితంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని చెప్పారు. బీజేపీ, సీపీఐ, సీపీఎం వంటి జాతీయ పార్టీలతోపాటు లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ్ కూడా అవిశ్వాసానికి మద్దతిస్తున్నారని తెలిపారు. వీరితో అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి 30 మంది సంఖ్యాబలం సరిపోతుందన్నారు. అవిశ్వాసం పెడితే ఎవరి రంగు ఏమిటో బయటపడుతుందని ముందుగానే చెప్పామని, చంద్రబాబు రంగు బయట పడిందని అన్నారు. ఊసరవెల్లి కూడా సిగ్గుపడే విధంగా పచ్చిగా, నగ్నంగా చంద్రబాబు రంగులు మార్చారని వ్యాఖ్యానించారు. ‘వస్తున్నా.. మీకోసం.. చస్తున్నా మీ కోసం అంటూ తిరుగుతున్న చంద్రబాబుకు ప్రజల సమస్యలేమీ కనపడలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పొద్దున లేచినప్పటినుండి కాంగ్రెస్‌ను తిడుతున్నట్లు బాబు నటిస్తున్నారని అన్నారు. ప్రజా కంటక ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎందుకు అవిశ్వాసం పెట్టరని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్‌ను కొడవళ్లతో, గొడ్డళ్లతో నరకండని చెప్తున్నడు. అవిశ్వాసం పెడితే గోటితో పోయేదానికి కొడవళ్లతో నరకడం వంటి ఆటవిక చర్యలెందుకు? కాంగ్రెస్‌పై తొడగొడుతున్నడు కదా! పడగొడదాం రమ్మంటే ఎందుకు రాడు? కాంగ్రెస్‌ను చంద్రబాబు ఎందుకు కాపాడుతున్నడు? చిదంబరంతో బాబు చీకట్లో ఒప్పందం చేసుకున్నడు. కేసులు పెట్టొద్దంటూ చిదంబరం కాళ్లపై పడ్డడు. దానికి ప్రతిఫలంగా ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో మెజారిటీ లేని సమయంలో ముగ్గురు టీడీపీ ఎంపీలను ఢిల్లీలో ఉన్నా హాజరుకాకుండా రుణం తీర్చుకున్నడు. చంద్రబాబు అక్రమాలపై విచారణ జరగకుండా కోర్టులకు పోయి స్టేలు తెచ్చుకున్నడు. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని టీఆర్‌ఎస్ చెబితే రాత్రికి రాత్రే సీఎం కిరణ్‌తో బేరం కుదుర్చుకున్నడు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని నిర్లజ్జగా, నిస్సిగ్గుగా చెప్తున్నడు. ఛీ ఛీ చంద్రబాబు, థూథూ చంద్రబాటు అంటూ ప్రజలు ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నరు. 

బాబు ముఖంమీదనే ఉమ్ముతున్నా మారడా’’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘టీఆర్‌ఎస్‌ను తోకపార్టీ అని అంటున్నడు. ప్రతిపక్ష పార్టీని ఇలాగే పిలుస్తారా? 2009లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు తొండం పార్టీలాగా కనిపించిందా? చంద్రబాబు సంస్కారానికి వీటిని వదిలేస్తాను’’ అని అన్నారు. ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేస్తే పక్క రాష్ట్రాల నుండి కరెంటును కొంటామని ట్రాన్స్‌కో అధికారులు చెప్పినట్లు కేసీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల రాష్ట్రమంతా చీకట్లోకి పోయే పరిస్థితి ఉందన్నారు.

Share this article :

0 comments: