3వ రోజుకు వైఎస్సార్‌సీపీ సత్యాగ్రహ దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 3వ రోజుకు వైఎస్సార్‌సీపీ సత్యాగ్రహ దీక్ష

3వ రోజుకు వైఎస్సార్‌సీపీ సత్యాగ్రహ దీక్ష

Written By news on Friday, April 5, 2013 | 4/05/2013


 విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహం పేరుతో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారం నాటికి మూడో రోజుకు చేరింది. దీక్షలో పాల్గొన్న పలువురు నేతల ఆరోగ్యం మూడో రోజు సాయంత్రానికి క్షీణించింది. దీక్షలో ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు వైద్యులు పలు దఫాలుగా వైద్య పరీక్షలు నిర్వహించారు. కొందరు నేతలు నీరసంగా కనిపించారు. గురువారం సైఫాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఉస్మానియా ఆస్పత్రి నుంచి డాక్టర్ తిరుపతిరెడ్డి నేతృత్వంలో వచ్చిన వైద్య బృందం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించింది. 

కొందరు ఎమ్మెల్యేల రక్తపోటులో హెచ్చుతగ్గులు నమోదయ్యాయని, మరికొందరి రక్తంలో చక్కెరలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయని వైద్యులు వెల్లడించారు. వారికి వెంటనే వైద్య సహాయం అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్టీ శాసనసభ పక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి, తానేటి వనిత షుగర్ లెవల్స్ బాగా పడిపోయాయి. వారిద్దరి రక్తంలో చక్కెర పరిమాణం 56 ఎం.జిగా నమోదైంది పేర్ని నాని రక్తంలో చక్కెర 66 ఎం.జిగా నమోదైంది. ఎన్.అమరనాథరెడ్డి షుగర్ లెవల్స్ పడిపోగా బీపీ కూడా బాగా తగ్గింది. షుగర్ స్థాయిలు పడిపోయిన వారిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు,ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, గొల్ల బాబూరావు, సుజయకృష్ణ రంగారావు, పేర్ని నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గొట్టిపాటి రవికుమార్, జోగి రమేష్ ఉన్నారు. ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిలను ఆస్పత్రికి తరలిస్తామని సైఫాబాద్ ఏసీపీ రాంనర్సింహారెడ్డి మధ్యాహ్నం కోరగా అందుకు విజయమ్మ అంగీకరించలేదు. విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించేదాకా దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేయడంతో అధికారులు వెనుదిరిగారు. విజయమ్మ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
Share this article :

0 comments: