పెంచింది 6,344 కోట్లు..తగ్గించింది 830 కోట్లే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పెంచింది 6,344 కోట్లు..తగ్గించింది 830 కోట్లే

పెంచింది 6,344 కోట్లు..తగ్గించింది 830 కోట్లే

Written By news on Friday, April 5, 2013 | 4/05/2013

తాటాకు తీసుకుని... ఈతాకు ఇచ్చినట్టుగా ఉంది ప్రభుత్వ వ్యవహారం. విద్యుత్ చార్జీల పెంపుతో (2013-14 ఆర్థిక సంవత్సరానికి) ప్రజలపై ఏకంగా రూ.6,344 కోట్ల భారం మోపిన ప్రభుత్వం కేవలం రూ.830 కోట్ల సబ్సిడీతోనే సరిపుచ్చింది. అంటే పెంచిన చార్జీల్లో కేవలం 13.08 శాతం మాత్రమే తగ్గించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అంటే ఇంకా 86.92% భారం ప్రజలపైనే ఉందన్నమాట. వాస్తవం ఇలావుంటే ప్రజలపై ఒక్క పైసా భారం పడనివ్వబోమని సీఎం ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రజలను, పరిశ్రమలను దెబ్బకొడుతున్న సర్దుబాటు చార్జీలు, ఎడాపెడా విధిస్తున్న కోతల గురించి ప్రభుత్వం ప్రస్తావించకపోవడం గమనార్హం. చితికిపోయిన చిన్నపరిశ్రమలపైనా ప్రభుత్వం కనికరం చూపలేదు. చిన్న చిన్న బడ్డీకొట్లకు ప్రభుత్వ ప్రకటన సాంత్వన చేకూర్చలేదు. పెపైచ్చు మొత్తం 2 కోట్ల 55 లక్షల మంది వినియోగదారుల్లో 2 కోట్ల 16 లక్షల మందికి చార్జీలు పెంచలేదని... ఇంకా ఎవరైనా మాట్లాడితే పెట్టుబడిదారుల తరఫున మాట్లాడినట్టేనని సీఎం వ్యాఖ్యానించడాన్ని కూడా విద్యుత్‌రంగ నిపుణులు తప్పుబడుతున్నారు. 

నెలకు 200 యూనిట్లు దాటి వినియోగించే గృహ వినియోగదారులందరూ పెట్టుబడిదారులేనా అని వారు నిలదీస్తున్నారు. వాస్తవానికి ఈఆర్‌సీ రూ.3,037.5 కోట్ల భారం మాత్రమే మోపాలని భావిస్తే.. ఈఆర్‌సీపై ఒత్తిడి తెచ్చి మరీ ప్రభుత్వం ఆ భారాన్ని ఏకంగా రూ.6,344.76 కోట్లకు పెంచింది. అంటే అదనంగా రూ.3 వేల కోట్లకుపైగా భారాన్ని పెంచిన ప్రభుత్వం.. ఇంతాచేసి ఇప్పుడు రూ.830 కోట్లు మాత్రమే తగ్గించిందని విశ్లేషిస్తున్నారు. ఇలావుండగా పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, కుటీర పరిశ్రమలు, పంచాయతీలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితరాలపై మోపిన సుమారు రూ.5,514 కోట్ల భారం కూడా వస్తువుల రేట్ల పెరుగుదల రూపంలో చివరకు ప్రజలపైనే పడుతుంది. గృహ వినియోగదారులపై పడిన రూ.2 వేల కోట్ల భారంలో రూ.830 కోట్లను మినహాయించినా రూ.1,170 కోట్ల భారం మిగిలే ఉంది.

భారం పెంచిన సర్కారు: విద్యుత్ చార్జీలను ఈఆర్‌సీనే నిర్ణయిస్తుందని సీఎం పదే పదే ప్రకటించారు. వాస్తవానికి ప్రభుత్వ వ్యవహారశైలి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. 2013-14లో ఏకంగా రూ.12,723 కోట్ల మేరకు చార్జీలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ఈఆర్‌సీని డిస్కంలు కోరాయి. కానీ రూ.3,297.26 కోట్ల పెంపునకే ఈఆర్‌సీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే రీ-లిక్విఫైడ్ నేచురల్ గ్యాసు (ఆర్-ఎల్‌ఎన్‌జీ) కొనుగోలుకు అంగీకరించాలని పట్టుబట్టిన ప్రభుత్వం... ఈఆర్‌సీపై ఏకంగా కేంద్ర విద్యుత్ చట్టాన్ని కూడా ప్రయోగించింది. ఫలితంగా 4 నెలలు 2,430 మిలియన్ యూనిట్ల (243 కోట్ల యూనిట్లు) విద్యుత్‌ను ఆర్-ఎల్‌ఎన్‌జీ ద్వారా కొనుగోలు చేసేందుకు ఈఆర్‌సీ అనుమతించింది. దీంతో యూనిట్‌కు ఏకంగా రూ.12.50 చొప్పున రూ.3,037.5 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ కారణంగానే ప్రజలపై భారం రూ.6,344.76 కోట్లకు పెరిగింది. ఇందులో రూ.830 కోట్లను మాత్రమే సబ్సిడీగా భరించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. అంటే రూ.3,037.5 కోట్లలో రూ.830 కోట్లు తీసివేస్తే రూ.2,207.5 కోట్ల భారం కేవలం ప్రభుత్వం వల్లే ప్రజలపై పడిందన్నమాట. వాస్తవం ఇలావుంటే ప్రభుత్వం భారీగా చార్జీల భారం తగ్గించినట్టు మాట్లాడడం విడ్డూరం. 

కుటీర పరిశ్రమలు కుదేలే..!: కుటీర పరిశ్రమలపై ప్రభుత్వం కనికరం చూపలేదు. స్వర్ణకారులు, వడ్రంగి, మరమగ్గాలు, ధోబీఘాట్లు, బొమ్మలు, సబ్బులు, అగర్‌బత్తీలు, క్యాండిల్, పచ్చళ్ల తయారీ యూనిట్లతో పాటు ఫినాయిల్ తయారీ వంటివన్నీ కుటీర పరిశ్రమలకిందకు వస్తాయి. అయితే వీరికి చార్జీల తగ్గింపునకు ప్రభుత్వం కనీసం ప్రయత్నించలేదు. కుటీర, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు గత రెండేళ్లలో వరుసగా రెండుసార్లు ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచింది. ఫలితంగా యూనిట్ విద్యుత్ చార్జీ ధర రూ. 1.80 నుంచి ఏకంగా రూ. 3.75కి పెరిగిపోయింది. అంటే కేవలం గత రెండేళ్లలోనే వీటికి విద్యుత్ చార్జీలను 108.3 శాతం మేరకు ప్రభుత్వం పెంచిందన్నమాట. వీటికితోడుగా విధిస్తున్న సర్దుబాటు చార్జీలతో రాష్ట్రంలోని కాటేజీ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మూసివేత దశకు చేరుకున్నాయి. ప్రభుత్వం తాజాగా పెంచిన చార్జీల వల్ల కేవలం కాటేజీ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపైనే ఏకంగా రూ.300 కోట్ల మేరకు అదనపు భారం పడనుంది. రాష్ట్రంలో 25 వేల కుటీర పరిశ్రమల సంబంధిత కనెక్షన్లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి లక్షమంది జీవనం సాగిస్తున్నారు.

మేమూ పెట్టుబడిదారులమేనా: చిన్నచిన్న పాన్‌షాప్‌లు, జిరాక్స్ మిషన్లు వంటి చిన్నతరహా వాణిజ్య సంస్థలపై చార్జీల తగ్గింపులో ప్రభుత్వం కనికరం చూపలేదు. చిన్న చిన్న షాపులు నడుపుకుంటున్న తాము పెట్టుబడిదారులం ఎంతమాత్రమూ కాదని వారు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం 50 యూనిట్లలోపు చిన్నతరహా వాణిజ్య సంస్థలకు యూనిట్‌కు రూ.3.85 చార్జీ ఉండగా... తాజాగా రూ.5.40 మేరకు పెంచారు. ఇక 50 యూనిట్లు దాటితే మొదటి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.6.63 వసూలు చేయనున్నారు. అదేవిధంగా 51-100 యూనిట్లకు యూనిట్‌కు రూ. 7.38 చొప్పున వసూలు చేయనున్నారు.

101-300 యూనిట్లకు యూనిట్‌కు 8.13 చొప్పున వసూలు చేయనున్నారు. ఇక 301-500 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 8.63, 500 యూనిట్లపైన రూ. 9.13 మేర వసూలు చేయనున్నారు. అంటే 50 యూనిట్లు దాటి వినియోగించే చిన్నతరహా వాణిజ్య సంస్థలకు 50 యూనిట్ల వరకు టెలిస్కోపిక్ విధానాన్ని ఎత్తివేశారన్నమాట. ఇది చిరు వ్యాపారులపై భారీ భారం మోపనుంది. మరోవైపు విద్యుత్ కోతల వల్ల చిన్నతరహా పరిశ్రమలన్నీ ఇప్పటికే మూసివేత దశకు చేరుకున్నాయి. ఆర్డర్లన్నీ ఆగిపోతున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. వీటికి విద్యుత్ చార్జీలను తగ్గించకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ చిన్న, మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య (ఎఫ్‌ఎస్‌ఎంఈ) అధ్యక్షుడు ఏపీకే రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. 
Share this article :

0 comments: