పాదయాత్ర తర్వాత వారి సంఖ్య 74 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాదయాత్ర తర్వాత వారి సంఖ్య 74

పాదయాత్ర తర్వాత వారి సంఖ్య 74

Written By news on Saturday, April 27, 2013 | 4/27/2013

* పాదయాత్రకు ముందు టీడీపీకి 90 మంది ఎమ్మెల్యేలు.. పాదయాత్ర తర్వాత వారి సంఖ్య 74కు చేరింది
* వైఎస్సార్ నాడు మండే ఎండలో పాదయాత్ర చేశారు...
* ప్రజల కష్టాలు చూసి చలించిపోయారు
* చంద్రబాబు రోడ్డు కింద.. దారిని నీళ్లతో తడిపి నడిచారు
* దొంగలు పడే వేళ పల్లెలన్నీ నిద్రపోయాక పాదయాత్ర చేస్తున్నారు

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘2009లో టీడీపీకి 90 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. చంద్రబాబు పాదయాత్ర మొదలు పెట్టి, ముగించే సమయానికి 74 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. 90 మంది ఎమ్మెల్యే సంఖ్య 74కు చేరింది. అంటే చంద్రబాబు గారు పాదయాత్ర ముందుకు చేశారా.. వెనక్కి చేశారా? పాదయాత్ర తో పార్టీ ముందుకు వెళ్లిందో, వెనక్కి పోయిందో ఆ పార్టీ నాయకులే చెప్పాలి. 

ఇదే పాదయాత్రలో ఆయన ప్రజలను వెన్నుపోటు పొడిచారు. ఇదే పాదయాత్రలో టీడీపీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. మాటల్లో విశ్వసనీయత, చేతల్లో నమ్మకం లేని చంద్రబాబు ఎన్ని వేల కిలోమీటర్లు నడిచినా ప్రయోజనం ఉండదని అన్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శుక్రవారం ఖమ్మం నియోజకవర్గంలో సాగింది. ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

ఏసీ బస్సులో, నెత్తి మీద ఫ్యానుతో బాబు యాత్ర..
వైఎస్సార్ మే నెలలో.. మండే ఎండలో పాదయాత్ర చేసి చూపించారు. చంద్రబాబు గారు శీతాకాలంలో పాదయాత్ర మొదలుపెట్టి.. మేలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని, పాదయాత్రను అర్ధంతరంగా నిలిపివేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగాల్సిన పాదయాత్రను రేపు (శని వారం) విశాఖ జిల్లాలోనే నిలిపివేస్తున్నారట. వైఎస్సార్ పాదయాత్ర చేసినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కనీస పోలీసు భద్రత కూడా వైఎస్సార్‌కు కల్పించలేదు. ఇప్పుడు చంద్రబాబు కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగానే పాదయాత్ర చేస్తున్నారు. ఆయనకు మాత్రం ఈ ప్రభుత్వం జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత కల్పించి సగౌరవంగా పంపింది.

వైఎస్సార్ పాదయాత్ర చేసినప్పుడు ప్రజల మధ్య గడపాలని టెంటులో పడుకున్నారు. కానీ చంద్రబాబు గారు ఏసీ బస్సుల్లో గ డుపుతూ.. నెత్తి మీద ఒక ఫ్యాను పెట్టుకొని మరీ పాదయాత్ర చేస్తున్నారు. ఆయన పాదయాత్ర అంతా రోడ్డు మీద కంటే రోడ్డు కిందనే ఎక్కువగా సాగింది. ఈయన గారి పాదయాత్రకు ఒక జేసీబీ భూమిని తవ్వితే, ఒక రోడ్డు రోలర్ మళ్లీ ఆ భూమిని చదును చేసి, దాని మీద లక్షల లీటర్ల నీళ్లను ట్యాంకర్ల ద్వారా తెచ్చిపోసి.. దారిని తడిపి మరీ పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్ర చేసిన గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేవు కానీ.. ఈయన నడవటానికి రోడ్డు మీద నీళ్లు పోయించుకున్నారు. వృథాగా రోడ్డు పాలు చేసిన నీటిని దాహార్తి ఉన్న గ్రామాలకు ఇచ్చి ఉంటే కనీసం చంద్రబాబుకు పుణ్యమైనా దక్కి ఉండేది.

ఎవరి కష్టాలు తెలుసుకోవడానికి..?
అర్ధరాత్రి ‘వస్తున్నాం... మీకోసం’ అని దొంగలు అంటారు. ఈ చంద్రబాబు పాదయాత్ర కూడా చీకట్లోనే సాగుతోంది. ఎండిపోయిన పంటలు చూడాలన్నా.. ప్రజల కష్టాలు తెలుసుకోవాలన్నా వెలుగుపూట పల్లెలోకి, ప్రజల్లోకి వెళ్లాలి. చంద్రబాబేమో చీకటి వేళలో గ్రామాలు నిద్రపోయాక ఎవరిని పలకరించడానికి, ఎవరి కష్టాలు తెలుసుకోవడానికి పాదయత్ర చేశారో అర్థం కావడంలేదు. వైఎస్సార్ పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి ఎంతగానో చలించిపోయారు. కానీ చంద్రబాబు చీకట్లో యాత్ర చేసి ప్రజల కష్టాలను, కన్నీళ్లను చూడలేకపోయారు. ఆయనకు ప్రజల కష్టాలతో పని లేదు. ఆయనకు కావాల్సింది రికార్డులు. అందుకే నడచిన 50 రోజులకు, 100 రోజులకు, 150 రోజులకు, 200 రోజులకు కేకులు కట్ చేసుకొని సంబరాలు చేసుకున్నారు.

500.. 1,000..1,500 .. 2,000 కిలోమీటర్లకు పైలాన్లు కట్టుకుంటున్నారు. మాటపై నిలబడే అలవాటు లేదు కనుక ఇష్టమొచ్చిన వాగ్దానాలు చేశారు. మద్యం ధరలు బాగా పెరిగిపోయాయని బాబు బాధపడుతున్నారు. సీఎం అయితే మద్యం ధరలు తగ్గించి సరసమైన ధరలకే అమ్ముతామని వాగ్దానం చేశారు. తక్కువ ధరకు ఎక్కువ మద్యం తాగొచ్చని చెబుతున్నారంటే ఆయన ఏ రకం నాయకుడో అర్థం కావడం లేదు. ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు... ఈ ప్రభుత్వం కాలర్ పట్టుకొని నిలదీయాల్సి ఉంది, కానీ అవేవీ పట్టించుకోకుండా అవిశ్వాసం సమయంలో కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారు.

శుక్రవారం132వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం నియోజకవర్గం పెద్దతండా నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి ఖమ్మం జిల్లా కేంద్రంలో సాగింది. జెడ్పీ సెంటర్‌లో షర్మిల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మొదట ఖమ్మం బస్టాండ్ సెంటర్‌లో సభ నిర్వహించాలని అనుకున్నప్పటికీ పోలీసులు అనుమతించ లేదు. అక్కడ్నుంచి పెవిలియన్ గ్రౌండ్‌లోకి మార్చాలని ప్రయత్నించగా.. అక్కడ మున్సిపల్ అధికారులు అడ్డుపడ్డారు. 

చివరికి మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ సెంటర్‌లో సభ పెట్టారు. అక్కడి నుంచి షర్మిల పాకబండలోని మమత మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 9 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం 11.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 1782.7 కి.మీ. యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో మచ్చా శ్రీనివాసరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, గట్టురామచంద్రరావు, బానోతు మదన్‌లాల్, యడవెల్లి కృష్ణ, చంద లింగయ్య దొర, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి, మట్టా దయానంద్, సాధు రమేష్‌రెడ్డి, మెండెం జయరాజ్ తదితరులున్నారు.
Share this article :

0 comments: