పోరు కొనసాగిస్తాం ,9న రాష్ట్ర బంద్‌తోపాటు ప్రజా బ్యాలెట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోరు కొనసాగిస్తాం ,9న రాష్ట్ర బంద్‌తోపాటు ప్రజా బ్యాలెట్

పోరు కొనసాగిస్తాం ,9న రాష్ట్ర బంద్‌తోపాటు ప్రజా బ్యాలెట్

Written By news on Monday, April 8, 2013 | 4/08/2013


వైఎస్సార్ సీపీ నేత కొణతాల ధ్వజం
ప్రజల నుంచి వచ్చిన నాయకుైడె తే.. వారి కష్టాలు తెలిసేవి..
దీక్ష విరమించినా..పోరాటం కొనసాగిస్తాం
విద్యుత్‌పై ప్రతిపక్షాల ఆందోళనను సీఎం ఎగతాళి చేస్తున్నారు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి పరిష్కరించలేకపోగా అహంకారపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ విమర్శించారు. ఓవైపు కరెంటు చార్జీలు తగ్గించాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుంటే.. మరోవైపు ముఖ్యమంత్రి దాన్ని ఎగతాళి చేయడంతోపాటు నవ్వులాటలా చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ ప్రజాప్రతినిధులు దీక్షలు విరమించినా విద్యుత్‌పై పోరాటం మాత్రం కొనసాగిస్తామన్నారు. 9న రాష్ట్ర బంద్‌తోపాటు ప్రజా బ్యాలెట్‌నూ నిర్వహిస్తామన్నారు. ‘ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరించలేకపోయినా అధికారంలో ఉన్నాం.. చిత్తశుద్ధితో ఆ దిశగా ప్రయత్నం చేయాలనే స్పృహ కూడా కిరణ్‌కు లేదు. ప్రజల నుంచి వచ్చిన నాయకుడికైతే వారి కష్టాలు తెలుస్తాయి. దొడ్డిదారిన ఎవరో నియమిస్తే పదవిలోకి వచ్చే వారికి వారి బాధలు తెలియవు’ అని అన్నారు. వీరికి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ పదవులను కాపాడుకోవడానికే సమయం సరిపోతోంది తప్ప.. ప్రజల గురించి ఆలోచించే తీరిక ఎక్కడిదని కొణతాల అన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అనే సామెత కిరణ్ సర్కారు విషయంలో అక్షరాలా నిజం అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజలు భరిస్తారనుకుంటే.. పొరపాటే..

తాము ఏం చేసినా ప్రజలు భరిస్తారనుకుంటే అది పొరపాటే అవుతుందని కొణతాల అన్నారు. ‘వారు రోజూ వీధుల్లోకి రానంత మాత్రాన మౌనంగా ఉన్నారులే అని అనుకోవద్దు. సమయం వచ్చినపుడు వారు కచ్చితంగా తమ చేతిలో ఉన్న ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని తీసుకుని, తగిన రీతిలో బుద్ధి చెబుతారు’ అని హెచ్చరించారు. సమస్య ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ఓ అధికారి కానీ, మంత్రిగానీ ముందుకు రావడం లేదని.. పైగా కరెంటు సరఫరా లేక.. ఒక్క ఎకరా కూడా ఎండిపోదంటూ అసెంబ్లీలో ఎగతాళిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘విలేకరుల సమావేశాల్లో సీఎం కూడా ఎంత అహంకారంగా మాట్లాడుతున్నారో చూశాం. కిరణ్ పాలన అంతా చంద్రబాబునాయుడు ప్రభుత్వం-2 పాలన మాదిరిగా ఉంది. విద్యుత్ విషయంలో ప్రతిదానికీ వైఎస్‌ను నిందిస్తున్న బాబు తన హయాంలో షార్ట్ గెస్టేషన్ ప్రాజెక్టులకు పీపీఏలు కుదుర్చుకున్నారు. వాటి వల్ల జరిగిన నష్టం అంతాఇంతా కాదు. వైఎస్ హయాంలో ప్రైవేటు రంగంలో ఒక్క పీపీఏనైనా కుదుర్చుకున్నట్లు చెప్పగలరా?’ అని కొణతాల సవాలు విసిరారు.

‘రాష్ట్ర ఆదాయం ఈ ఏడాది రూ.43 వేల కోట్లు పెరిగినా.. విద్యుత్ రంగానికి ఇచ్చిన సబ్సిడీ మాత్రం గతేడాది కన్నా కేవలం రూ.200 కోట్లే పెరిగింది. దీన్ని బట్టే ప్రభుత్వం ఎంత చిన్నచూపు చూస్తోందో అర్థమవుతోంది’ అని అన్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చెప్పేవారని.. కానీ కిరణ్ మాత్రం అహంకారంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. రాష్ర్టంలో కరువు కాటకాలు వచ్చినా నేనేం చేయాలని ముఖ్యమంత్రి అంటున్నార ని.. కరెంటు పోతే మాత్రం ఆ వైఫల్యం వైఎస్‌పై నెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. గత మూడేళ్లుగా విద్యుత్ చార్జీలు పెంచలేదని ఈ ఏడాదే పెంచామని ముఖ్యమంత్రి భ్రమలు కల్పిస్తున్నారని.. అది నిజం కాదన్నారు. రాష్ట్రంలో బొగ్గు, గ్యాస్ సరఫరా లేక దాదాపు 3 వేల మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు ఉత్పత్తి లేక వృథాగా ఉన్నాయని.. కనీసం ఈ విషయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి గ్యాస్ సాధించుకోవాలన్నారు.

యూపీఏకు సీబీఐ రక్షణ కవచం

యూపీఏకి సీబీఐ రక్షణ కవచంగా మారిందని కొణతాల ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీబీఐ ఎలాంటిదో.. యూపీఏ దాన్నెలా తన ప్రత్యర్థులపై ఉసిగొల్పుతుందో ఎస్పీ అధినేత ములాయం సింగే చెప్పారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ బొమ్మను గతంలో కేంద్ర మంత్రి పురందేశ్వరి కూడా తన ఫ్లెక్సీలో వైఎస్‌తోపాటుగా ప్రచురించి, ప్రచారం చేసుకున్నారని.. అప్పుడు లేని అభ్యంతరం బాలకృష్ణకు ఇప్పుడెందుకు వచ్చిందని కొణతాల ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. 
Share this article :

0 comments: