షర్మిల సవాల్ కు స్పందన ఏది? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల సవాల్ కు స్పందన ఏది?

షర్మిల సవాల్ కు స్పందన ఏది?

Written By news on Friday, April 26, 2013 | 4/26/2013

Written by Nagarjuna On 26/4/2013 20:12:00 PM

http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=61390&Categoryid=28&subcatid=0
విమర్శల పేరుతో నోరుపారేసుకోవడం మన రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు, మంత్రులకు అలవాటైపోయింది. ప్రత్యర్థులను నోటికి వచ్చినట్లు విమర్శిస్తుంటారు. అందులో వాస్తవాస్తవాలను అసలు పట్టించుకోరు. లక్ష మందికిపైగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న జ్ఞానం కూడా ఉండదు. ప్రజా ప్రతినిధిగా ఏం మాట్లాడ వచ్చో, ఏమి మాట్లాడ కూడాదో కూడా వారికి తెలియదు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉందిగదా అని ఏదిబడితే అది మాట్లాడితే ఎలా? అవతల వారి పరువు మర్యాదలను, గౌరవాన్ని మరిగణనలోకి తీసుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా నోరు పారేసుకుంటే ఎలా? ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి మాట్లాడే మాటలకు ఎంత విలువ ఉండాలి? ఎంత విశ్వసనీయత ఉండాలి? ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారనుకుంటే ఎలా? జనం ఏమైనా పిచ్చివాళ్లా? లేక వారిని పిచ్చివారని అనుకుంటారా? చివరికి మంత్రులు, అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఏ విధమైన సాక్ష్యాధారాలు చూపకుండా అర్ధంపర్ధంలేని విధంగా ఆరోపణలు చేయడానికి అలవాటుపడిపోయారు.

ఖమ్మం జిల్లాలోని బయ్యారం ఇనుప ఖనిజం గనులు, ‘రక్షణ స్టీల్స్’కు సంబంధించి కొందరు మంత్రులు, కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు ఏమాత్రం ఆధారాలు లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. దివంగ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడి బయ్యారం గనులను తన అల్లుడు బ్రదర్ అనీల్ కు చెందిన రక్షణ స్టీల్స్ అనే సంస్థకు లీజ్ కు ఇచ్చారని ఆరోపించారు. కోట్ల రూపాయల విలువైన ఖనిజసంపదను తక్కువకు లీజుకు ఇచ్చారని కూడా విమర్శించారు. ఈ ఆరోపణలకు సంబంధించి వారు ఏ ఒక్క ఆధారం చూపలేదు. రక్షణ స్టీల్స్ ఒప్పందం రద్దు చేసినప్పటికీ వారు ఆరోపణలు చేయడం మాత్రం మానలేదు. బ్రదర్ అనిల్‌ ఖండించినా వారు కారుకూతలు ఆపలేదు.


‘రక్షణ స్టీల్స్'తో తన భర్త అనిల్ కు సంబంధంలేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం వల్లభి గ్రామంలో ఈ నెల 22న జరిగిన బహిరంగ సభలో తెలిపారు. సంబంధం ఉందని నిరూపిస్తే అదే రోజు పాదయాత్ర ఆపి ఇంటికి వెళ్లిపోతానని, నిరూపించలేకపోతే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పదవులకు రాజీనామా చేసి ఇంటికెళ్లిపోతారా? అని సవాల్ కూడా విసిరారు. బయ్యారంలో ఖనిజాన్ని తవ్వుకొనే హక్కు వైఎస్ ఆర్ రక్షణ స్టీల్స్‌కు ఇవ్వలేదు. ఆ ఖనిజాన్ని ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎండీసీనే తవ్వాలని ఆయన ఆకాంక్షించారు. బయ్యారానికి సమీపంలోని వరంగల్ జిల్లా రాజోలి గ్రామంలో ఉక్కు కర్మాగారం పెట్టాలని సంకల్పించారు. ఆ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు, గిరిజనులకు ఉపాధి కల్పించాలన్నది ఆయన లక్ష్యం అని చెప్పారు.

సవాల్ షర్మిల మాటల్లోనే... ఖమ్మం జిల్లాలోని బయ్యారం ఇనుప ఖనిజం గనులతో, రక్షణ స్టీల్స్‌తో నాకు గాని, నా భర్తకు గాని సంబంధం లేదు. ఇదే మాట ఇప్పటికి అనేకమార్లు స్పష్టంగా చెప్పాం. అయినా కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ నేతలు పదేపదే అవే ఆరోపణలు చేస్తున్నారు. బయ్యారం గనులు, రక్షణ స్టీల్స్ ఒప్పందం రద్దు చేసి రెండేళ్లకు పైనే అవుతుంది. రద్దు చేసింది కూడా అప్పుడు మా పక్షాల ఉన్న, ఇప్పుడూ మా పార్టీలోనే ఉన్న అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి. దాన్ని రద్దు చేసి ఇన్ని రోజులైనా, వైఎస్ ఆర్ నాకు కట్నం కింద ఇచ్చారని, రక్షణ స్టీల్స్ నాదని, నా బినామీలే ఉన్నారని ఈ నాయకులు ఈ రోజుకూ ప్రచారం చేస్తున్నారు. ఈ ఆరోపణలు ఒకటి, రెండుసార్లు కాదు ఇప్పటికి 100 సార్లు చేసుంటారు. ప్రతిసారీ వీళ్లకు సమాధానం ఇస్తూనే ఉన్నాం. అయినా ‘దున్నపోతు మీద వాన పడ్డట్టు’ ఉంది కానీ వాళ్ల మట్టి బుర్రలకు ఎక్కడంలేదు. ఈ పార్టీ నాయకులందరికీ, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు సవాల్ చేస్తున్నాను. చంద్రబాబు గారూ! ఇంకొకసారి బయ్యారం గనులను వైఎస్ ఆర్ అల్లునికి, కూతురుకు కట్టబెట్టారని అనే ముందు నా సవాల్‌ను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వైఎస్ ఆర్ బిడ్డగా నేను సవాల్ చేస్తున్నాను. బయ్యారం గనుల్లో, రక్షణ స్టీల్స్‌లో నాకు భాగం ఉంది అని చంద్రబాబుగారు నిరూపించగలిగితే, అదే రోజున నేను పెట్టేబేడా సర్దుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పి, పాదయాత్ర ముగించి ఇంటికి వెళ్లిపోతాను. నిరూపించలేకపోతే మీరు మీ పార్టీకి, మీ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతారా? సమాధానం చెప్పాలి. నా మీద ఆరోపణలు చేస్తున్న ఎవరెవరైనా సరే నా సవాల్‌ను స్వీకరిస్తారా? అని ఆమె అడిగారు.

వాస్తవం: ఖమ్మం జిల్లా బయ్యారంలోని ఇనుప ఖనిజం తక్కువ రకంది అయినప్పటికీ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ అక్కడ ఉక్కు కర్మాగారం నెలకొల్పాలని తలచారు. దాదాపు పది వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భావించారు. ఆ ఉద్దేశంతోనే గ్లోబల్ టెండర్లను ఆహ్వానించారు. ఇక్కడ లభించేది తక్కువ రకం ఇనుప ఖనిజం అయినందున ఏ కంపెనీ ఆసక్తి చూపలేదు. కోట్లకు కోట్ల రూపాయలు విలువైన ఖనిజం అక్కడ ఉందని చెప్పిన తెలుగుదేశంలోని బడా నేతలు కూడా అటువైపు చూడలేదు. ఒక్క రక్షణ స్టీల్స్ సంస్థ మాత్రమే ముందుకు వచ్చింది. బయ్యారం గనులకు ఏపీఎండీసీ యజమానిగా ఉంటూ వెలికితీసిన ఇనుప ఖనిజాన్ని మాత్రమే రక్షణ స్టీల్ ఫ్యాక్టరీకి ఇవ్వాలన్న ఒప్పందం మాత్రమే వైఎస్ హయాంలో కుదిరింది. ఆ ఒప్పందానికి సంబంధించి జిఓ 69/2000 విడుదల చేశారు. రక్షణ స్టీల్స్‌కు లాభాలొస్తే అందులో 20 శాతం నిధులు స్థానిక ప్రాంత అభివృద్ధి కోసం వెచ్చించాలన్న నిబంధన కూడా ఆ ఒప్పందంలో ఉంది. ఖమ్మం లేదా పక్కనున్న వరంగల్ జిల్లాలో రక్షణ స్టీల్స్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కూడా ఆ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ తరువాత రోశయ్య ప్రభుత్వం ఏపీఎండీసీకి ఆ భూములు ఇచ్చింది. 56 వేల హెక్టార్లలో ఏపీఎండీసీకి తవ్వకాలకు అనుమతిస్తూ రోశయ్య ప్రభుత్వం 2010 జూన్ 30న జిఓ విడుదల చేసింది.

రక్షణ స్టీల్స్ బ్రదర్ అనిల్‌దేనని నోటికొచ్చినట్లు మాట్లాడినవారు ఇప్పుడు షర్మిల సవాలుపై నోరు మెదపడంలేదు. వారి ఆరోపణలు నిజమైతే ఎందుకు స్పందించడంలేదు? అవన్నీ ఉత్తుత్తి ఆరోపణలేనని తేలిపోయింది. ఏ విధమైన సాక్ష్యాధారాలు లేవని కూడా తేలిపోయింది. ఏ ఆధారంలేకుండా ప్రజలకు ఎందుకు అబద్దాలు చెప్పారు? చెప్పిన అబద్దమే వందసార్లు చెబితే ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారా? మంత్రులు కూడా టిడిపి వారికి వంతపాడారు. రక్షణ స్టీల్స్ ఒప్పందం ఎలా జరిగిందో, ఎవరితో జరిగిందో, ఆ ఒప్పందంలోని వివరాలు ఏమిటో ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు తెలియదా? వారు కూడా అలా మాట్లాడటం ఏమిటి? ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలను రాజకీయంగానే ఎదుర్కోవాలి. వ్యక్తిగత ఆరోపణలకు దిగడం, ప్రత్యర్ధుల పరువు మర్యాదలకు భంగం కలిగించడం మంచిపద్దతికాదు. ఈ విధమైన అసత్యాలను మాటిమిటికి ప్రచారం చేయడం భావ్యంకాదు. అబద్దాలు చెప్పి ప్రజలను నమ్మించాలనుకోవడం మంచిదికాదు. ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనుకోవడం, వారికి ఏమీ తెలియదనుకోవడం అవివేకం. ఎప్పుడు ఎవరికి ఎలా బుద్ది చెప్పాలో ప్రజలకు బాగా తెలుసు.
Share this article :

0 comments: