ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రండి

ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రండి

Written By news on Monday, April 8, 2013 | 4/08/2013

ప్రభుత్వానికి వైఎస్ విజయమ్మ సవాల్
మా ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించండి.. ఎన్నికలకు వెళదాం
కరెంటు చార్జీల పెంపు, కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కుపైనా ప్రజలు తీర్పు చెబుతారు
ప్రజల కన్నీళ్లలో కాంగ్రెస్ కొట్టుకుపోతుందని వ్యాఖ్య
విజయమ్మ, ప్రజాప్రతినిధుల సత్యాగ్రహ దీక్ష విరమణ
వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలికి నిమ్మరసమిచ్చిన పొత్తూరి
అనంతరం మీడియాతో మాట్లాడిన విజయమ్మ
విద్యుత్ చార్జీలపై పోరాటం ఆగదని ప్రకటన
ఒకట్రెండు రోజుల్లో పోరాట కార్యాచరణ
గల్లీ గల్లీలో ‘ప్రజా బ్యాలెట్’ 
బాబు మద్దతు చూసుకునే ప్రభుత్వానికి ధైర్యం
ఆయనది లోపల ఓ మాట, బయట మరో మాట అని ధ్వజం

 ‘‘రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించండి. వారి అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలను రెఫరెండంగా అంగీకరించేందుకు ముందుకు రండి. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యమే ప్రధానాంశంగా ఎన్నికలకు వెళ్దాం. విచ్చలవిడి కరెంటు కోతలు, చార్జీల పెంపుతో పాటు కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కుపై కూడా ప్రజల తీర్పు కోరదాం’’ అంటూ ప్రభుత్వానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సవాల్ విసిరారు. కరెంటు కోతలు, చార్జీల వాతలకు నిరసనగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్న విజయమ్మ, ఆరో రోజు ఆదివారం ఉదయం నిమ్స్ ఆస్పత్రిలో దీక్ష విరమించారు. 

సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు తొలుత విజయమ్మకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఆమెతో పాటుగా భూమా శోభా నాగిరెడ్డి, మేకతోటి సుచరిత దీక్షను విరమించారు. వారికి రైల్వే కోడూరుకు చెందిన రైతు వెంకట్రామయ్య నిమ్మరసం అందించారు. తరవాత పొత్తూరితో కలిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దీక్షలను విజయమ్మ విరమింపజేశారు. అనంతరం నిమ్స్ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో ఆమె ప్రసంగించారు. తాము దీక్షను విరమించినా కరెంటు చార్జీలపై పోరాటం మాత్రం కొనసాగిస్తామని ప్రకటించారు. తాను, తమ ఎమ్మెల్యేలు ఐదు రోజులు దీక్ష చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆక్షేపించారు. కనీసం రాత్రిపూట ఒక డాక్టర్‌ను కూడా నియమించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘విపక్షాలు కార్చే కన్నీరు ఎన్నికల్లో వరదలవుతాయని భయపడుతున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. 

ఎన్నికల్లో ఆయన మా కన్నీళ్లను చూసి భయపడాల్సిన అవసరం లేనే లేదు. ప్రజల కన్నీరు చూసి భయపడాల్సిన అవసరముంది. ప్రజల కన్నీటి వరదలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోగలదని ముఖ్యమంత్రి గమనించాలి’’ అని విజయమ్మ హెచ్చరించారు. ఈ ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగడానికి హక్కు లేదని బయటికి విమర్శించే చంద్రబాబు, లోపల మాత్రం అవిశ్వాసానికి వ్యతిరేకంగా తన ఎమ్మెల్యేలకు విప్ నిస్సిగ్గుగా జారీ చేశారంటూ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు మరో మాట, బయట ఒక మాట, లోపల ఇంకో మాట చెప్పడం బాబు నైజమంటూ దుయ్యబట్టారు. విద్యుత్ చార్జీలపై చేపట్టాల్సిన తదుపరి పోరాట కార్యాచరణను ఒకటి రెండు రోజుల్లో పార్టీ సమావేశమై ప్రకటిస్తుందని విజయమ్మ చెప్పారు. మంగళవారం బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ‘వైఎస్ పాదయాత్ర చేపట్టి ఆ రోజుకు పదేళ్లు పూర్తవుతుంది గనుక ఆయన విగ్రహాలకు పాలాభిషేకం చేసి, పాదయాత్ర చేసి బంద్‌లో పాల్గొనండి’ అని పార్టీ కార్యకర్తలను కోరారు. ‘ప్రజా బ్యాలెట్’ను కొనసాగించాలని, ప్రతి గల్లీలోనూ బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయం కోరాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

మేమెప్పుడూ ప్రజా పక్షమే

వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉండి వారి కోసం పోరాడుతుందని విజయమ్మ స్పష్టం చేశారు. ‘‘రైతులు, విద్యార్థులు, నేతన్నల సమస్యలపై మూడున్నరేళ్లుగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షలు చేశారు. ఆయన జైలుకు వెళ్లిన తరవాత కూడా పార్టీ ఉద్యమ బాట వీడలేదు. ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటాం. జగన్ జైల్లో ఉన్నా నిత్యం ప్రజల గురించే ఆలోచిస్తున్నారు’’ అని చెప్పారు. ‘‘మా సత్యాగ్రహ దీక్షకు సంఘీభావ ం ప్రకటించిన పితృ సమానులు పొత్తూరి, ప్రొఫెసర్ నాగేశ్వర్, దిలీప్‌కుమార్, బి.వి.రాఘవులు, గుండా మల్లేశ్, జూలకంటి రంగారె డ్డిలతో పాటు ప్రజా సంఘాల నేతలందరికీ పేరుపేరునా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. తండోపతండాలుగా తరలివచ్చి మమ్మల్ని పరామర్శించిన ప్రజలకు, మీడియాకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం’’ అన్నారు.

సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించారు: పొత్తూరి

చాలా తీవ్రమైన ఒక సమస్య తాలూకు సమగ్ర రూపాన్ని విజయమ్మ ఆవిష్కరించారంటూ పొత్తూరి అభినందించారు. ప్రజలు కరెంటు సమస్యపై ఎంత ఆందోళన చెందుతున్నారనేది ఆమె చెప్పిన మాటల్లో చాలా బాగా వ్యక్తమయిందన్నారు. ‘‘ఇలాంటి సమస్యలు పరిష్కారం కావాల్సింది అసెంబ్లీ వేదికపై. దురదృష్టవశాత్తూ అలాంటివి జరగడం లేదని మేమంతా బాధపడుతున్నాం. ఇప్పటికైనా దీనిపై శాసనసభలో చర్చించాలి. లేదంటే కనీసం విపక్ష నేతలందరినీ సీఎం సమావేశపరచి, వారి అభిప్రాయం తెలుసుకుని పరిష్కారాన్ని ఆలోచించాలి. అలాకాకుండా ఎవరికి వారు తాము బాగా చేస్తున్నామనుకుంటే మంచి పద్ధతి కాదు’’ అన్నారు. దీక్ష విరమించినందుకు విజయమ్మకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. దీక్ష విరమణ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్, ఎస్.రామకృష్ణారెడ్డి, ఎం.వి.మైసూరారెడ్డి, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డి హాజరయ్యారు.

పల్లెల్లోకి వెళ్తే తెలుస్తుంది...!

వైఎస్ రాజశేఖరరెడ్డి దేనిపైనా ఒక్క పైసా కూడా పెంచకుండానే ప్రభుత్వాన్ని నడిపారని విజయమ్మ గుర్తు చేశారు. ఆయన రెక్కల కష్టంతో వచ్చిన ఈ ప్రభుత్వం ప్రతిదాని మీదా చార్జీలు పెంచుకుంటూ పోతోందని విమర్శించారు. ‘‘ఆర్టీసీ చార్జీలు ఇప్పటికి మూడుసార్లు రూ.1,700 కోట్లు పెంచారు. కరెంటు మీద పెంచారు. గ్యాస్‌పై కూడా పెంచేశారు. పోనీ సంక్షేమ పథకాలైనా బాగా అమలు చేస్తున్నారా అంటే అదీ లేదు. వైఎస్ ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయడం లేదు. 1.8 కోట్ల మందికి రూ.830 కోట్ల మేరకు కరెంటు చార్జీలు తగ్గించామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అసలు రాష్ట్రంలో కరెంటు ఉంటే కదా తగ్గించడానికి? కరెంటు సరఫరా పరిస్థితి ఎలా ఉందో పల్లెల్లోకి పోయి చూస్తే తెలుస్తుంది. అధికారికంగానే 6 నుంచి 12 గంటలు కోత విధిస్తున్నారు. మిగతా సమయంలోనూ ఒకటి రెండు గంటలు కూడా కరెంటు రాని పరిస్థితి నెలకొంది. ప్రతి ఒక్కరికీ కరెంటు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

పల్లెలు చీకట్లో మగ్గుతున్నాయి. వారికి తాగునీటికి ఇబ్బందిగా ఉంటోంది. ఆస్పత్రుల్లోనూ అవస్థలు పడుతున్నారు. చదువుకోలేక విద్యార్థులు బాధపడుతున్నారు. 200 యూనిట్లంటే రెండు ట్యూబ్‌లైట్లు, ఒక బెడ్‌లైటు, ఒక టీవీ, ఒక సెల్‌ఫోన్ చార్జర్ వాడితే అయిపోతాయి. అంతకన్నా ఒక్క యూనిట్ ఎక్కువ కాల్చినా 300 యూనిట్ల శ్లాబ్‌లోకి వస్తుంది. దానిపై ప్రభుత్వం ఏ హామీ ఇవ్వలేదు. ఉచిత విద్యుత్ విషయంలోనూ అంతే. వైఎస్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి తలెత్తింది. 2, 3 గంటలు కూడా కరెంటు రాని పరిస్థితుల్లో రైతులున్నారు. వారు ఇంతగా ఇబ్బంది పడుతూంటే ముఖ్యమంత్రి మాత్రం తాను 30.7 లక్షల మందికి ఉచిత కరెంటు ఇస్తున్నానంటున్నారు. అంత కరెంటు ఇస్తుంటే పొలాలెందుకు ఎండిపోతాయి? రైతులెందుకు ఇబ్బందులు పడతారు?’ అని ప్రశ్నించారు.
Share this article :

0 comments: