మహిళలకు భద్రత కరువు: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మహిళలకు భద్రత కరువు: విజయమ్మ

మహిళలకు భద్రత కరువు: విజయమ్మ

Written By news on Saturday, April 13, 2013 | 4/13/2013

తెనాలిలో సునీల కుటుంబానికి పరామర్శ
- స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా రక్షణ ఏది?
- చట్టాలున్నా, సరైన పాలకుల్లేకే సమస్యలు 

 ‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లయినా నేటికీ మహిళలకు భద్రత లేకుండా పోతోంది. వయసుతో సంబంధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు, అరాచకాలు జరుగుతున్నాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. శాంతిభద్రతలు ఇంతగా పతనావస్థకు చేరుకోవటం బాధనిపిస్తోందని, చట్టాలున్నా నడిపించగలిగే పాలకులు లేకనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయని చెప్పారు. 

నడిరోడ్లపై మద్యంషాపులకు అనుమతులు ఇవ్వటంవల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయన్నారు. గుంటూరు జిల్లా తెనాలి నడిబొడ్డులో బార్ అండ్ రెస్టారెంటు ఎదుట మద్యం మత్తులో కొందరు యువకులు రోడ్డుపై యువతిని వేధించడం, ప్రతిఘటించినందుకు ఆమె తల్లి సునీలను లారీ కిందకు తోసేసి చంపడం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని శుక్రవారం సాయంత్రం విజయమ్మ పరామర్శించారు. సునీల భర్త బాబూరావు, కుమార్తెలను పలకరించారు. దురంతం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం అక్కడే విలేకరులతో మాట్లాడారు.

ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రిని, హోంమంత్రిని కోరుతున్నట్టు చెప్పారు. బాధిత కుటుంబానికి తప్పక న్యాయం చేయాలంటూ అసెంబ్లీలో వాళ్ల తరఫున మాట్లాడతానని హామీ ఇచ్చారు. ‘‘ఈ అమ్మాయిని చూస్తుంటే చాలా చాలా బాధనిపిస్తోంది. ఆడవాళ్లు అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టని గాంధీ అన్నారు. కానీ అది నేటికీ వచ్చినట్టు అన్పించటం లేదు. ఎందుకంటే ఏ రోజు చూసినా ఇలాంటి ఘోరాలే వార్తల్లో కనిపిస్తున్నాయి. యువతులకు, మహిళలకు భద్రత లేకుండా పోతోంది. తెనాలి ఘటనే దీనికి నిదర్శనం. షాపింగ్‌కు వెళ్లి వస్తున్న యువతిపై.. ఎంతోమంది జనం, కన్నతల్లి చూస్తుండగానే ఇలాంటి అఘాయిత్యం జరిగిందంటే ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. 

తన తల్లికి న్యాయం చేయాలని, కారకులను కఠినంగా శిక్షించాలని ఆ అమ్మాయి అడుగుతోంది. బాధ్యులు ఎంతటి అధికారంలో ఉన్నవారైనా సరే, కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌సీపీ తరపున కోరుతున్నాం’’ అన్నారు. ఇటీవలే శ్రాగ్వి అనే 8 నెలల పాప కిడ్నాపింగ్‌కు గురైన వైనాన్ని విజయమ్మ ప్రస్తావించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలున్నాయో లేదో కూడా తెలియడం లేదన్నారు. ‘‘నడిరోడ్లపై మద్యం షాపులకు లెసైన్సులివ్వడం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.5,000 కోట్లున్న ఎక్సైజ్ ఆదాయం ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రూ.10 వేల కోట్లకు పెరిగింది. ఢిల్లీ దారుణం తర్వాత నిర్భయ చట్టం వచ్చింది. ఇంకా చాలా చట్టాలున్నాయి. కానీ సరిగా నడిపించగలిగే పాలకులు లేకే సమస్యలన్నీ వస్తున్నాయి’’ అన్నారు.

అమ్మను కాపాడుకోలేకపోయా...: అమ్మను కాపాడుకోలేకపోయానంటూ సునీల కుమార్తె మౌనిక విలపించింది. ‘‘అమ్మ నా దగ్గరకొచ్చిందని చూసుకోలేదు. నన్ను రక్షించమంటూ అప్పటికే కేకలు వేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. అంతలోనే అమ్మ వచ్చింది. నన్ను వేధిస్తున్న వాళ్లను ప్రశ్నించింది. అంతలోనే వాళ్లు అమ్మను లారీ కిందకు తోసేశారు’’ అంటూ కన్నీరుమున్నీరైంది. విజయమ్మ ఆమె కంటనీరు తుడిచి ధైర్యం చెప్పారు. వైఎస్సార్‌సీపీ తరఫున అండగా ఉంటామని హామీఇచ్చారు.
Share this article :

0 comments: