జగన్‌ను జైల్లోనే ఉంచే కుట్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ను జైల్లోనే ఉంచే కుట్ర

జగన్‌ను జైల్లోనే ఉంచే కుట్ర

Written By news on Tuesday, April 16, 2013 | 4/16/2013

- అందుకే ఆనం రాక్షస రాగం 
- ఆయన్ను తమ్ముడే వెలేశాడు: అంబటి
- వైఎస్ పెట్టమంటే మంత్రులు సంతకం చేశారా?
- బుద్ధి తక్కువై చేశారా, లేక బుద్ధి లేకా?
- మోపిదేవిని అరెస్టు చేస్తారు.. 
- ధర్మాన, సబితలను చేయరా?
- సీబీఐని ప్రభావితం చేస్తున్న కిరణ్, ఆనం, బొత్స
- అందుకు వారిని అరెస్టు చేయాలని డిమాండ్ 

 హైదరాబాద్: ‘‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎక్కువ కాలం జైల్లో పెట్టాలనే దురుద్దేశంతోనే మంత్రులు చిత్ర విచిత్ర వాదనలు చేస్తున్నారు. అందుకే... వైఎస్ రాజశేఖరరెడ్డి చెబితేనే మంత్రులు సంతకాలు చేశారని, వారికేమీ తెలియదని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాక్షస రాగం ఆలపించారు’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆనం ఎత్తుకున్న ఆ రాగాన్నే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి పార్థసారథి కూడా ఆలపిస్తున్నారని విమర్శించారు. 

‘‘ఆ 26 జీవోలపైనా వైఎస్ పెట్టమంటేనే మంత్రులు సంతకాలు చేశారనే విషయం ఆయన మరణించిన 3 ఏళ్ల 8 మాసాల 10 రోజులకు గుర్తుకొచ్చిందా? అది కూడా హోంమంత్రి సబితను నిందితురాలిగా పేర్కొంటూ ఆమె పేరును సీబీఐ చార్జిషీట్‌లో చేర్చాక, ఆమె రాజీనామాకు సిద్ధపడిన తరుణంలోనే గుర్తుకు వచ్చిందా?’’ అని ఆనంను అంబటి సూటిగా ప్రశ్నించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జీవోలను జారీ చేసిన మంత్రుల్లో ముగ్గురిని సీబీఐ నిందితులుగా చేర్చడం, మరో ముగ్గురు మాత్రం స్వేచ్ఛగా విధులు నిర్వహించడం విచిత్రంగా ఉందన్నారు. 

‘‘మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణారావును ఇదే కారణంతో మోసం చేసి, గొంతు కోసి బలిపశువును చేశారు. ఆయన కూడా మిగతా మంత్రుల్లా సంతకాలు చేసిన వారే కదా అని ఆయన అభిమానులు వాపోతున్నారు. వైఎస్ చెబితేనే సంతకాలు చేశారని ఆనం అంటున్నారే తప్ప, సీబీఐ నిందితులుగా పేర్కొన్న ధర్మాన ప్రసాదరావు గానీ, సబిత గానీ ఎక్కడా ఆ మాట అనలేదు. జీవోల జారీ మంత్రివర్గ సమష్టి నిర్ణయమనే వారు చెబుతున్నారు. మరికొందరు మంత్రులు కూడా ఇదే మాట అంటున్నారు. సుప్రీంకోర్టుకు మంత్రులు సమర్పించిన అఫిడవిట్‌లో కూడా, ‘మా శాఖల నుంచి జారీ అయిన 26 జీవోల్లో ఎలాంటి తప్పులూ లేవు. 

సచివాలయ నిబంధనల మేరకే ఇచ్చాం. మేం చూసే సంతకాలు పెట్టాం. అది సమష్టి బాధ్యత’ అని స్పష్టం చేశారు. కానీ బొత్స, పార్థసారథి వంటి వారు మాత్రం అందుకు భిన్నమైన వైఖరిని ఎందుకు అవలంబిస్తున్నారో కాంగ్రెసే జవాబు చెప్పాలి. జగన్‌ను ఎక్కువ కాలం జైల్లో ఉంచాలనే దుర్బుద్ధితోనే కదా ఇలా మాట్లాడుతున్నది! వైఎస్ చెబితే సంతకాలు పెట్టామంటున్నారంటే.. అసలు మంత్రులకు బుద్ధి తక్కువై పెట్టారా? బుద్ధి లేక పెట్టారా? అసలు వీరు చదువుకున్నారా, లేదా?’’ అని ప్రశ్నించారు. సీబీఐ చాలా వివక్షపూరితంగా దర్యాప్తు చేస్తోందని అంబటి సోదాహరణంగా చెప్పుకొచ్చారు. ‘‘మోపిదేవి చేసిన పాపమేమిటి? సబిత, ధర్మాన చేసిన పుణ్యమేమిటి? మోపిదేవిని ఎందుకు అరెస్టు చేశారు? మిగతా ఇద్దరినీ అరెస్టు చేయకుండా, సమన్లు జారీ చేస్తే చాలంటూ సీబీఐ అధికారులు ఎందుకు మెమో సమర్పించారు? ఏమిటీ వివక్ష? వారికి ఎక్కడి నుంచి ఆదేశాలందుతున్నాయి?’’ అని ప్రశ్నించారు. మోపిదేవి మాదిరిగానే మిగతా ఐదుగురు మంత్రులను కూడా బలి పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కూడా అంబటి అభిపాయ్రపడ్డారు. 

‘‘ప్రభుత్వం బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోంది. జీవోలన్నీ చట్టబద్ధమైనవేనని సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లలో మంత్రులు చెప్పారు. కానీ ఇప్పుడు కొందరు మంత్రులేమో, ‘మా మంత్రులు తెలియక సంతకాలు చేశారు’ అని అంటున్నారు. ‘అవి తప్పుడు జీవోలు, వైఎస్ బలవంతం మీదే వాటిపై సంతకం చేశాం’ అని మోపిదేవి మాదిరిగానే ఆ మంత్రులతో కూడా తప్పుడు ప్రకటన చేయించజూస్తున్నారు. తద్వారా మిగతా ఐదుగురు మంత్రులను కూడా బలి చేయడానికే ఇలా వ్యవహరిస్తున్నారు’’ అని విమర్శించారు.

ప్రజల శతఘు్నలకు బలవుతారు!
జగన్‌కు పద్నాలుగేళ్లు శిక్ష పడుతుందని సీఎం కిరణ్, ఉరేయాలని ఆనం మాట్లాడటం సీబీఐని, న్యాయస్థానాలను ప్రభావితం చేయడానికేనని ఆరోపించారు. అందుకు కిరణ్, ఆనం, బొత్సలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జగన్‌ను ఉరేయాలి, వెలేయాలంటూ ఆనం చేసిన వ్యాఖ్యలపై అంబటి మండిపడ్డారు. ఆ మాటలన్న మర్నాడే ఆనంను ఆయన సొంత తమ్ముడే వెలేశారని గుర్తు చేశారు. ఇక ఉరేసే రోజు కూడా వస్తుందన్నారు. ‘మీ బెదిరింపులకు భయపడో, మీ ప్రలోభాలకు లొంగో సీబీఐ ఇష్టం వచ్చినట్టు దర్యాప్తు చేయవచ్చు. చంద్రబాబు మీ అధికారాన్ని కాపాడవచ్చు. కానీ 2014లో మాత్రం ప్రజల కోపాగ్నికి, వారి శతఘు్నలకు మీరు బలికాక తప్పదు. అప్పుడు మిమ్మల్ని సీబీఐ గానీ, సోనియాగానీ, బాబు గానీ కాపాడలేరు’ అంటూ హెచ్చరించారు. 

జనం ఓటుతో బుద్ధి చెప్పారు
వైఎస్సార్‌సీపీలో చేరుతున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పాలన్న బొత్స వ్యాఖ్యలను అంబటి తీవ్రంగా తప్పుబట్టారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బాగా బుద్ధి చెప్పారని, ఓటు గుద్ది మరీ చెప్పారని గుర్తు చేశారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్‌ను ఉల్లంఘించిన 9 మంది కాంగ్రెస్, ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి వెంటనే ఉప ఎన్నికలు వచ్చేలా చేస్తే ప్రజలు ఎవరికి బుద్ధి చెబుతారో అర్థమవుతుందన్నారు. రేషన్ కార్డులు తగ్గించాలని వైఎస్సే చెప్పారన్న మంత్రి డి.కె.అరుణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పథకాలన్నీ వైఎస్‌వేనని 2009 సెప్టెంబర్‌లో అరుణ చెప్పిన పత్రికా క్లిప్పింగును విలేకరులకు ప్రదర్శించారు. 

జగన్ రాజకీయాలు చేయొద్దా?
‘‘జగన్ శిక్ష పడిన ఖైదీ కాదు. కేవలం విచారణలో ఉన్న ఖైదీ మాత్రమే. ఇది తెలియని కొందరు పిచ్చికుక్కల్లా ‘ఆయన జైల్లోంచి రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ మొరుగుతున్నారు’’ అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జగన్ ఎందుకు రాజకీయాలు చేయకూడదు? ఆయన రాజకీయాలు చేయొద్దని ఏ చట్టం చెబుతోంది? ఆయన్ను ఎవరైనా కలవవచ్చు, మాట్లాడవచ్చు. ఆయనకు ఆ హక్కుంది. కాదని ఎవరైనా నిరూపించమనండి’’ అని సవాలు విసిరారు. టీడీపీ నేతలు ఆనంను ప్రశంసిస్తుండటాన్ని ప్రస్తావించగా ‘టీడీపీకి నచ్చేలా ఆనం మాట్లాడతారు. చంద్రబాబుకు నచ్చేలా కిరణ్ చేస్తారు. మంత్రివర్గానికి నచ్చేలా బాబు నడుస్తూంటారు. కిరణ్ కుర్చీని బాబు మోస్తారు. వారివి కుమ్మక్కు రాజకీయాలు’ అన్నారు.
Share this article :

0 comments: