తగ్గిస్తారా.. దిగిపోతారా ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తగ్గిస్తారా.. దిగిపోతారా ?

తగ్గిస్తారా.. దిగిపోతారా ?

Written By news on Thursday, April 4, 2013 | 4/04/2013

* మైనారిటీ సర్కారుకు ఇంత విద్యుత్ భారం మోపే దమ్ము ఎక్కడిది?
* విపక్షాల అనైక్యత వల్లే కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది: రాఘవులు 
* విజయమ్మ దీక్షకు లెఫ్ట్ సంఘీభావం 
* వైఎస్సార్ కాంగ్రెస్ దీక్షా శిబిరాన్ని సందర్శించిన వామపక్షాల నేతలు 
* సర్కారు దిగిరావాలంటే ప్రతిపక్షాల ఐక్యపోరాటాలే మార్గమన్న నాయకులు 
* కాంగ్రెస్ ప్రభుత్వం భూస్థాపితమయ్యే సమయం ఆసన్నమైందని వ్యాఖ్య
* వామపక్షాలతో కలిసి పోరాడేందుకు సిద్ధమని స్పష్టంచేసిన విజయమ్మ 

బుధవారం కరెంటు సత్యాగ్రహం వేదికపై ప్రసంగిస్తున్న రాఘవులు. చిత్రంలో విజయమ్మ, వామపక్ష నేతలు వెంకటరెడ్డి, అజీజ్‌పాషా, గాదె దివాకర్, జానకిరామ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు 

 ‘‘ప్రస్తుత కిరణ్‌కుమార్‌రెడ్డిది మైనారిటీ ప్రభుత్వం. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేదు. ప్రతిపక్షాల మధ్య అనైక్యత కారణంగా కాంగ్రెస్‌కు మెజారిటీ లేకపోయినా పరిపాలన కొనసాగిస్తోంది. మైనారిటీలో ఉన్న సర్కారుకు.. ప్రజలపై ఒకేసారి రూ. 6,500 కోట్ల విద్యుత్ భారం మోపే దమ్ము, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చాయి?’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పెంచిన విద్యుత్ చార్జీలు మొత్తం రూ. 6,500 కోట్లు తగ్గిస్తారా.. లేదా అధికారం నుంచి దిగిపోతారా అనేది సీఎం కిరణ్ తేల్చుకోవాలి’’ అని హెచ్చరించారు. పెంచిన విద్యుత్ చార్జీలను మొత్తం తగ్గించే వరకూ కరెంటు పోరు ఆగదని స్పష్టం చేశారు. కరెంటు చార్జీల పెంపుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సత్యాగ్రహం పేరుతో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం రెండో రోజుకు చేరుకుంది.

బుధవారం పది వామపక్ష రాజకీయ పార్టీల నేతలు దీక్షా శిబిరానికి వచ్చి.. విజయమ్మ సహా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల దీక్షకు సంఘీభావం ప్రకటించారు. హైదరాబాద్ ఆదర్శ్‌నగర్‌లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దనున్న సత్యాగ్రహం దీక్షా శిబిరానికి వామపక్షనేతలు బి.వి.రాఘవులు, వై.వెంకటేశ్వరరావు (సీపీఎం), అజీజ్‌పాషా (సీపీఐ), గాదె దివాకర్ (న్యూ డెమోక్రసీ), జానకిరాములు (ఆర్‌ఎస్‌పీ), దయానంద్ (ఫార్వర్డ్ బ్లాక్), వెంకటరెడ్డి (ఎంసీపీఐ-యూ) తదితరులు సందర్శించారు. 

అనంతరం దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి వారు ప్రసంగించారు. పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకునే విషయంలో మొండెద్దులాగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం దిగొచ్చేలా చేసేందుకు.. ప్రతిపక్షాల ఐక్య పోరాటాలే శరణ్యమని పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యమంలో వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టే కార్యక్రమాలకు వామపక్షాల సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. వామపక్షాల మద్దతుకు విజయమ్మ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ చార్జీలు తగ్గించేంత వరకు వామపక్ష పార్టీలతో కలిసి పనిచేద్దామని జగన్‌బాబు చెప్పారని, అందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గతంలో విద్యుత్ ఉద్యమాల్లో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి వామపక్షాలతో కలిసి ఉధృతంగా పోరాడిన విషయాన్ని ఈ సందర్భంగా విజయమ్మ గుర్తుచేశారు. 

చార్జీలు మొత్తం తగ్గిస్తారా.. దిగిపోతారా?: రాఘవులు
అసెంబ్లీలో మెజారిటీలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారం భారీగా విద్యుత్ చార్జీలు పెంచే దమ్ము, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు సూటిగా ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి ప్రతిపక్షాల మధ్య అనైక్యతను అధిగమించి కాంగ్రెస్ భరతం పట్టేందుకు సిద్ధ్దంగా ఉండాలన్నారు. ‘‘విద్యుత్ చార్జీలను పునఃసమీక్షిస్తానని సీఎం కిరణ్ చెప్తున్నారు. గతేడాది కూడా విద్యుత్ చార్జీలు రూ. 4,500 కోట్లు పెంచి తీవ్ర అసంతృప్తి ఎదురయ్యేసరికి కేవలం రూ. 173 కోట్లు మాత్రమే తగ్గించారు. ఎంగిలి మెతుకులు వేసినట్లు వేస్తున్నారు. ఈసారి కూడా గతేడాది మాదిరి చేస్తామంటే సహించేది లేదు. మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఇక్కడ ఎవరూ లేరు. పెంచిన విద్యుత్ చార్జీలు మొత్తం రూ. 6,500 కోట్లు తగ్గిస్తారా.. లేదా అధికారం నుంచి దిగిపోతారా అనేది సీఎం కిరణ్ తేల్చుకోవాలి’’ అని స్పష్టం చేశారు. 

పిరికిపందలా పారిపోతున్నారు... 
శాసనసభా సమావేశాలు నిర్వహించేందుకు కిరణ్ ప్రభుత్వం భయపడుతోందని రాఘవులు వ్యాఖ్యానించారు. ‘‘అసెంబ్లీ సమావేశాలు ఏప్రిల్ 22 నుంచి జరుగుతాయని మొదట చెప్పారు. తీరా ఇప్పుడు మే మొదటి వారంలో అంటున్నారు, అది కూడా జరుగుతాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. శాసనసభా సమావేశాలు నిర్వహిస్తే కిరణ్ ప్రభుత్వానికి చరమ గీతం పాడుతారని కాంగ్రెస్‌కు భయం పట్టుకుంది. అందుకే పిరికిపందల్లా పారిపోతున్నారు. వీళ్లు ఎక్కడిదాకా పారిపోతారు? ఢిల్లీదాకా పోతారా! లేక బంగాళా ఖాతం దాకా పారిపోతారా? లేక కాంగ్రెస్ పార్టీని మొత్తం ప్రపంచం నుంచి తీసుకెళ్తారా?’’ అని రాఘవులు ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలపై చర్చించకుండా పారిపోతే కుదరదని, అలాగే చేస్తే ఆ పార్టీని ప్రజలే భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. 

పేద, ధనిక వర్గాలకు తేడా తెలియదా? 
‘‘చార్జీలు ధనవంతులపైనే వేశాం పేదవారికి కాదని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అంటున్నారు. ఎవరు ధనవంతులో, పేదవారెవో కూడా బొత్సకు తెలియదా? గృహ అవసరాల కోసం వినియోగించే విద్యుత్ మొదటి శ్లాబ్ అంటే మొదటి 50 యూనిట్లు వినియోగించే వారిపై 79 శాతం చార్జీలు పెంచారు. వంద యూనిట్ల లోపు వారిపై 73 శాతం పెంచారు. అదే 500 యూనిట్ల పైబడి వినియోగించే వారికి కేవలం 18 శాతం పెంచారు. చార్జీల పెంపుదల ఈ విధంగా ఉంటే బొత్సకు పేద, ధనిక వర్గాల భేదం కూడా తెలియదా?’’ అని రాఘవులు సూటిగా ప్రశ్నించారు. 

9న బంద్‌ను జయప్రదం చేయాలి... 
ప్రస్తుతం విద్యుత్‌పై ఒక్క పైసా పెంచాల్సిన అవసరం లేదన్నారు. బయట మార్కెట్‌లో యూనిట్ విద్యుత్ ఆరు రూపాయలకే దొరుకుతుంటే.. గ్యాస్ కొనుగోళ్ల పేరుతో రూ. 12 వెచ్చిస్తున్నారని రాఘవులు దుయ్యబట్టారు. రెగ్యులేటరీ కమిషన్ మీద ఒత్తిడి చేసి లొంగదీసుకొని చార్జీల భారాన్ని దానిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోబోమని స్పష్టంచేశారు. ఈ నెల తొమ్మిదిన వామపక్షాలు బంద్‌కు పిలుపిచ్చాయని.. దానికి వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతిచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘తండోపతండాలుగా తరలివస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులకు కూడా మనవి చేస్తున్నా. తొమ్మిదిన చేపట్టే బంద్‌ను జయప్రదం చేయాలి. బస్సులు, ఆటోలు, పరిశ్రమలతో పాటు అన్ని వర్గాలు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వం దిగిరావాలి’’ అని రాఘవులు పిలుపునిచ్చారు. 

ఆంధ్రప్రదేశ్‌ను అంధేరాప్రదేశ్‌గా మార్చారు... 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధేరాప్రదేశ్‌గా మార్చిన ఘనత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికే దక్కుతుందని సీపీఐ నేత అజీజ్‌పాషా ఎద్దేవా చేశారు. విద్యుత్ ఉద్యమంలో ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించి సీఎం కిరణ్ మెడలు వంచాలని పిలుపునిచ్చారు. సీఎం కిరణ్ పేదల కరెంటుపై భారం వేసి ప్రైవేట్ కంపెనీలకు దోచి పెడుతున్నారని న్యూడెమోక్రసీ నేత గాదె దివాకర్ ధ్వజమెత్తారు. 

గ్యాస్‌ను రిలయన్స్‌కు, బొగ్గును ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టి ప్రజలపై ఇష్టానుసారంగా చార్జీలు వడ్డిస్తున్నారని మండిపడ్డారు. ‘‘కేజీ బేసిన్‌లోని డీ6లో బ్రహ్మాండమైన గ్యాస్ నిక్షేపాలున్నాయి. రిలయన్స్‌ను అడిగే నాథుడే లేరు. వారిని ప్రశ్నిస్తే మంత్రి పదవులు పోతాయ్. అంతేకాదు కొంతమంది ప్రాణాలు పోయే ప్రమాదం తలెత్తింది’’ అని ఆరోపించారు. కిరణ్ ప్రభుత్వం గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అవలంబించిన దుర్మార్గమైన విధానాలనే కొనసాగిస్తోందని ఎంసీపీఐ (యూ) నేత వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు పట్టిన గతే కిరణ్‌కు పడుతుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ధృతరాష్ట్రుని పాలన నడుస్తోందని.. కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచుకు చేరుకుందని ఆర్‌ఎస్‌పీ నేత జానకిరాములు దుయ్యబట్టారు.
 పెంచిన విద్యుత్ చార్జీలను పూర్తిగా తగ్గించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విజయమ్మ ఆరోగ్యం బుధవారం మధాహ్నం వరకు నిలకడగా ఉండగా సాయంత్రం నుంచి తలనొప్పితో బాధపడుతున్నారు. సైఫాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఉస్మానియా ఆసుపత్రి నుంచి డా.తిరుపతిరెడ్డి నేతృత్వంలో వచ్చిన వైద్య బృందం దీక్ష చేస్తున్న వారందరికీ మధ్యాహ్నం, రాత్రి వేళల్లో రెండు దఫాలుపరీక్షలు నిర్వహించారు. విజయమ్మ తలనొప్పితో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. విజయమ్మ బీపీ 110-70 , పల్స్ 72గా నమోదైనట్టు తెలిపారు. రక్తంలో చక్కెర పరిమాణం కూడా సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు తేలింది. అలాగే.. దీక్షలో ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలకు రక్తంలో చక్కెర పరిమాణం తగ్గిపోయిందని వైద్యులు తెలిపారు. షుగర్ లెవల్ పడిపోయిన వారిలో తానేటి వనిత, పేర్ని నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సుజయకృష్ణ రంగారావు, గొట్టిపాటి రవికుమార్ ఉన్నారు.

ఇదిలావుంటే.. మంగళవారం ప్రారంభమయిన ఈ ఆమరణ దీక్షలో విజయమ్మతో సహా 30 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బుధవారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వై.బాలనాగిరెడ్డి, బూచేపల్లి శివప్రసాదరెడ్డి శిబిరానికి వచ్చి దీక్షలో కూర్చున్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఎన్‌టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి కూడా దీక్ష చేస్తున్న వారికి మద్దతు ప్రకటించారు.
Share this article :

0 comments: