జీవోలు అక్రమమంటే.. మంత్రులెందుకు బయట ఉన్నారో ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జీవోలు అక్రమమంటే.. మంత్రులెందుకు బయట ఉన్నారో ?

జీవోలు అక్రమమంటే.. మంత్రులెందుకు బయట ఉన్నారో ?

Written By news on Monday, April 15, 2013 | 4/15/2013

వైఎస్ మిమ్మల్ని సొంత తమ్ముడిలా చూసుకున్నారు.. మంత్రిని చేసి రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు
ఇప్పడు మీరు కనీస కృతజ్ఞత కూడా మరచి నీచంగా మాట్లాడుతున్నారు
వైఎస్, జగన్ దోషి అని నిర్ధారించడానికి మీరెవరు?
జీవోల్లో తప్పు లేదంటే.. జగన్‌ను ఎందుకు జైల్లో పెట్టారు?
జీవోలు అక్రమమంటే.. మంత్రులెందుకు బయట ఉన్నారో ఆనం, బొత్స చెప్పాలి
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ ఆదివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 120, కిలోమీటర్లు: 1,623.7

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని వైఎస్సార్ సొంత తమ్ముడిలా చూసుకున్నారు. మంత్రిని చేశారు.. రాజకీయ భవిష్యత్తును ఇచ్చారు. ఈ రోజు అదే రామనారాయణరెడ్డి కనీస కృతజ్ఞత కూడా మరిచిపోయి నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. వైఎస్సార్ దోషి అట... ఆయన కుటుంబాన్ని వెలివేయాలట.. జగన్‌మోహన్‌రెడ్డిని ఉరితీయాలని ఆయన అంటున్నారు. జీవోల గురించి మంత్రులకు తెలియదు, వారిని అరెస్టు చేయకూడదంటూ ఆనం.. మంత్రులను వెనుకేసుకొస్తున్నారు. మరి ఏ రోజూ సెక్రటేరియట్‌లో జగనన్న అడుగుపెట్టలేదు. ఏ ఒక్క రోజూ ఈ పని తనకు చేసి పెట్టమని ఏ ఒక్క మంత్రికీఫోసి చేసి అడగలేదు. మరి జీవోలతో ఏ సంబంధం లేని జగనన్నను ఏకంగా ఉరి తీయాలని అంటున్నారు అంటే అసలు మీరు మనుషులేనా? మీకంటూ ఒక మనస్సాక్షి ఉందా? మీ లాంటి మనిషిని చూసే కావచ్చు ‘కృతజ్ఞతలేని మనిషికన్నా కుక్క మిన్న’ అని మన పెద్దలు అన్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. 

‘‘బతికితే వైఎస్సార్‌లా బతకాలి. మనిషి వెళ్లిపోయిన తరువాత కూడా ఆ మనిషి కోసం ప్రాణాలు అర్పించేటంత ప్రజాభిమానాన్ని సంపాదించుకోవాలి. ఆనం రామనారాయణరెడ్డి మాదిరిగా బతికుండగానే మొఖం మీద ఉమ్మి వేయించుకునేలా బతకకూడదు. బతికితే జగన్‌మోహన్‌రెడ్డిలా ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క మాట మార్చే రామనారాయణరెడ్డిలాగా, ఆయనకు వంతపాడుతున్న మంత్రుల్లాగా ఊసరవెల్లిలా, అవకాశవాదుల్లా బతకడం దండగ’’ అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికీనిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో సాగింది. మైలవరంలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

అహం పెరిగిపోయింది..

‘‘జగన్‌మోహన్‌రెడ్డిని 14 ఏళ్లు జైల్లో పెడతారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గతంలో తీర్పు చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణేమో ఆనం మాట్లాడిన మాటల్లో చాలా వాస్తవం ఉందని సమర్థించారు. అసలు వైఎస్సార్, జగనన్న దోషి అని నిర్ధారించడానికి మీరు ఎవరు? మనిషికి అహంకారం పెరిగిపోయినప్పుడు తానే దేవుడని అనుకుంటాడట. రామనారాయణరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఈ రోజు ఇదే పరిస్థితిలో ఉన్నారు. వైఎస్సార్, జగనన్నలను దోషి అని విమర్శిస్తున్న ప్రతి నాయకునికీ సమాధానం చెప్తున్నా.. వీళ్లిద్దరూ దోషులని ఏ కోర్టూ నిర్ధారించలేదు. రూ. లక్షల కోట్లు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టలేదని, ఆయన నిర్దోషి అని ఏ కోర్టూ చెప్పలేదు. బొత్స మాఫియా డాన్ కాదని, ఆయన నిర్దోషి అని ఏ కోర్టూ చెప్పలేదు. కేంద్ర మంత్రి చిరంజీవి బంధువుల ఇంట్లో దొరికిన రూ. 70 కోట్ల సక్రమమేనని, ఆయన దోషి కాదని ఏ కోర్టూ చెప్ప లేదు. కాకుంటే వీళ్లకున్న నక్కజిత్తుల తెలివితో వారి మీద ఏ కేసులూ పెట్టకుండా, ఎలాంటి విచారణా జరపకుండా మేనేజ్ చేసుకునే తెలివి మాత్రం పుష్కలంగా ఉంది. శిశుపాలుడి పాపాలన్నీ పండి అంతకు అంత అనుభవించి పోయాడు. ఒక రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజున మీ పాపం పండి మీరు కూడా అనుభవిస్తారు.

అప్పుడు వేడుక చూసి ఇప్పుడు చిందులా?

వైఎస్సార్ 30 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి సేవలు చేశారు. తన రెక్కల కష్టం మీద రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన బతికి ఉన్నప్పుడు ఇంద్రుడు, భగీరథుడు అని పొగిడిన వాళ్లే ఈ రోజు ఉచ్చనీచాలు లేకుండా వైఎస్సార్‌ను విమర్శిస్తున్నారు. చనిపోయిన తరువాత రాజీవ్ గాంధీ పేరు బోఫోర్స్ కేసు నుంచి తొలగించారు. ఆదే వైఎస్సార్ పేరును ఆయన మరణించిన తరువాత ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. వైఎస్సార్ ఇచ్చిన పదవులు అనుభవిస్తున్న ఈ మంత్రులంతా ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేరుస్తుంటే వేడుక చూసినట్లు చూశారు. ఈ రోజేమో.. అదే మంత్రుల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో చేరుస్తుంటే ఈ నాయకులంతా చిందులు తొక్కుతున్నారు.

మంత్రులు తప్పు చేశారా? చేయలేదా?

నిజంగానే వైఎస్సార్ అవినీతికి పాల్పడి ఉంటే ఆ రోజు ఈ నాయకులంతా ఎందుకు గొంతు విప్పలేదో సమాధానం చెప్పండి ఆనం రామనారాయణరెడ్డీ అని అడుగుతున్నా. వైఎస్సార్ తప్పు చేసి ఉంటే మీరెందుకు అప్పుడు మాట్లాడలేదు? ఆయన వెళ్లిపోయిన తరువాత ఇప్పుడెందుకు నిందలు వేస్తున్నారో సమాధానం చెప్పండి అని ఆనం, బొత్సలను అడుగుతున్నా. జీవోలను ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ రూల్స్ ప్రకారం జారీ చేస్తారు. ఇష్టమొచ్చినట్లు ఒక ముఖ్యమంత్రి జీవోలు జారీ చేయడానికి వీల్లేదు. సంబంధిత మంత్రులు, సంబంధిత కార్యదర్శులు కలిసి వాటిని జారీ చేస్తారు. ‘మాకు ఏమీ తెలియకుండానే సంతకాలు పెట్టాం, ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టాం, మాకు చట్టాలు, విధానాలు తెలియదు’ అని ఒక మంత్రి అంటున్నారు అంటే ఆ మంత్రికి కనీసం మంత్రిగా ఉండే అర్హత కూడా లేదు. 

ఆనం మీరు చెప్పండి.. ఆ జీవోలు సక్రమమే అయితే మీ మంత్రులు తప్పు చేయనట్టు. ఆ జీవోలు అక్రమమే అయితే ఆ మంత్రులు కచ్చితంగా తప్పు చేసినట్టు. ఇవి సక్రమమైన జీవోలైతే అర్హులకు నిబంధనల ప్రకారం ప్రాజెక్టు భూ కేటాయింపులు జరిగి ఉంటాయి. అప్పుడు.. మీరు ఆరోపిస్తున్నట్లు.. వారు జగనన్నకు ఎందుకు మేలు చేయాలనుకుంటారు? వారి నుంచి జగనన్న మేలు పొందకున్నా.. ఈ రోజు ఆయన్ను 10 నెలలుగా జైల్లో బంధించారు? అలా కాకుండా ఈ జీవోలు అక్రమమే అయితే వాటికి బాధ్యులైన మీ మంత్రులు ఈ రోజు ఎందుకు బయట తిరుగుతున్నారో ఆనం, బొత్స సమాధానం చెప్పాలి.’’

12.3 కిలోమీటర్ల మేర యాత్ర

పాదయాత్ర120వ రోజు ఆదివారం షర్మిల కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం చంద్రాల నుంచి నడక ప్రారంభించారు. గణపవరం అడ్డరోడ్డు, వెల్వడం మీదుగా మైలవరానికి చేరారు. జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ వేలాది మంది నల్ల బ్యాడ్జీలు ధరించి ఇక్కడి సభకు తరలి వచ్చారు. వారిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. మైలవరం శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.30కు చేరుకున్నారు. మొత్తం 12.3 కిలోమీటర్లు నడిచారు. యాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు జోగి రమేశ్, కొడాలి నాని, పేర్ని నాని, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ నేతలు సామినేని ఉదయభాను, వసంత నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు జేష్ట రమేశ్ బాబు, జలీల్ ఖాన్, వంగవీటి రాధ, మేకాప్రతాప్ అప్పారావు, ఎం. రత్నబోసు, ఎం.ప్రసాదరాజు స్థానిక నాయకులు కాజా రాజ్‌కుమార్, అప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, వంగవీటి శంతన్ కుమార్, దూలం నాగేశ్వర్‌రావు, అపోలో డాక్టర్ సీఎస్ రెడ్డి తదితరులున్నారు.

ఆనం గారూ.. మీకిదే సవాల్!

‘‘నిజంగానే జగనన్న రూ. లక్ష కోట్లు సేకరించే ఉంటే, అవినీతికి పాల్పడే మనస్తత్వం జగనన్నకు ఉంటే, ఈ రోజు ఆ డబ్బు తీసుకొని ఏ విదేశాలకో వెళ్లి స్థిరపడిపోతారుగానీ తండ్రి ఆశయాల కోసం ప్రజాసేవ అంటూ ఇన్నేసి అష్టకష్టాలు పడతారా? ఒక్క రోజు గనుక జగనన్న ఈ మంత్రుల మాదిరిగా విలువలు, విశ్వసనీయతను పక్కన పెడితే చంద్రబాబులా జగనన్న మీద కూడా కేసులు ఉండేవి కాదు. చిరంజీవిలాగా తన పార్టీని కూడా అమ్మేసుకుంటే ఈ పాటికి జగనన్న ఏ మంత్రో అయిపోయే వారు, లేకుంటే గులాంనబీ ఆజాద్ చెప్పినట్టు ముఖ్యమంత్రి కూడా అయ్యేవారు. బయ్యారం గనులతో మాకు సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్పినా.. పదేపదే మాకు సంబంధం ఉందీ అంటున్నారు. ఆనం గారూ! బయ్యారం గనులతో మాకు సంబంధం ఉంది అని మీరు నిరూపిస్తే, ఇక్కడికిక్కడే నేను సామాన్లు సర్దుకొని, మీకు, ప్రజలకు క్షమాపణలు చెప్పుకొని పాదయాత్ర మానేసి ఇంటికి వెళ్లిపోతాను. కానీ బయ్యారం గనులతో మాకు సంబంధం ఉంది అని మీరు నిరూపించలేకపోతే మాకు క్షమాపణ చెప్పి, మీ పదవికి రాజీనామా చేసే ధైర్యం మీకు ఉందా? అని సవాల్ చేస్తున్నా. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు పోతే ప్రజలు ఎవరిని వెలివేస్తారన్నది అప్పుడు మీకు అర్థమవుతుంది.’’
- షర్మిల
Share this article :

0 comments: