జనం కష్టాలు తెలిసిన డాక్టర్ వైఎస్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనం కష్టాలు తెలిసిన డాక్టర్ వైఎస్

జనం కష్టాలు తెలిసిన డాక్టర్ వైఎస్

Written By news on Sunday, April 28, 2013 | 4/28/2013

* పేదవారికి కూడా కార్పొరేట్ వైద్యం అందించారు
* ప్రతిభావంతులకు ఉన్నత విద్య అందించాలని ఫీజుల పథకం తెచ్చారు
* కానీ ఈ ప్రభుత్వం వైఎస్ పథకాలన్నింటికీ తూట్లు పొడుస్తోంది
* ప్రజల పక్షాన నిలవాల్సిన చంద్రబాబేమో.. ప్రభుత్వ పక్షాన నిలుస్తున్నారు
‘సాక్షి’ ప్రతినిధి, ఖమ్మం: ‘‘వైఎస్సార్ స్వతహాగా వైద్యుడు.. ప్రజల నాడి ఏంటో, ప్రజల కష్టాలు ఏమిటో ఆయనకు బాగా తెలుసు. వైఎస్సార్ స్వతహాగా డాక్టర్ కావడంతో పేదలకు అందాల్సిన ఆరోగ్యం గురించి ఆలోచన చేశారు. ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలను అమలు చేసి చూపించారు. పేదవారికి కూడా కార్పొరేట్ వైద్యాన్ని చేరువలోకి తెచ్చారు. రూ. లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగానే నిరుపేదలకు అందించారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ‘‘మనకు ఉన్న ప్రధాన వనరులు మానవ వనరులు. ప్రపంచ జనాభాలో మన దేశ జనాభా 17 శాతం.. జనాభా దేశానికి భారం కాదు. మానవ శక్తిని సరిగా వినియోగించుకుంటే భారత్‌ను శక్తిమంతమైన దేశంగా మార్చవచ్చని వైఎస్సార్ అనుకున్నారు. అందుకోసం పేదలను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు వైఎస్సార్ పరితపించారు.

ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే ఆలోచనతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ తుంగలో తొక్కుతోంది’’ అని విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం ఖమ్మం నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా ఆమె మమత మెడికల్ కళాశాలలో డెంటల్, మెడికల్ విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలు విన్న షర్మిల ఆ తరువాత కొద్దిసేపు ఇంగ్లిష్‌లో ప్రసంగించారు.

గ్రామీణుల కోసం ట్రిపుల్ ఐటీలు..
‘‘గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారు. ఈ ట్రిపుల్ ఐటీల ద్వారా ఇవాళ అనేక మంది విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పథకం వల్ల లబ్ధి పొందిన అనేక మంది విద్యార్థులు ఇప్పుడు ఉన్నత ఉద్యోగాలు చేస్తూ గుర్తింపు పొందారు. ప్రస్తుత ప్రభుత్వం రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం నుంచి ముఖ్యమైన వ్యాధులను తొలగించారు. క్రమంగా ఈ పథకాన్ని ప్రజలకు దూరం చేయాలని ఈ పాలకులు ప్రయత్నిస్తున్నారు. ప్రజల పక్షాన నిలబడాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబేమో.. ప్రభుత్వ పక్షాన నిలబడుతున్నారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రతి పథకానికీ జీవం పోస్తారు’’ అని షర్మిల భరోసా ఇచ్చారు.

13.3 కిలోమీటర్ల మేర యాత్ర..: 

పాదయాత్ర 133వ రోజు శనివారం షర్మిల ఖమ్మం నియోజకవర్గం పాకబండ నుంచి నడక ప్రారంభించారు. అక్కడ మమత మెడికల్ కాలేజ్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అక్కడి నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్డు మీదుగా ఖానాపురం, కైకొండయగూడెం క్రాస్ రోడ్డు, పాండురంగాపురం, బల్లేపల్లి, రఘునాథపాలెం మీదుగా నడుచుకుంటూ శివాయిగూడెం చేరుకున్నారు. ఇక్కడే ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.45 గంటలకు చేరుకున్నారు.

మొత్తం 13.3 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,796 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో మచ్చా శ్రీనివాసరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, బానోతు మదన్‌లాల్, స్థానిక నాయకులు మట్టా దయానంద్, నంబూరి రామలింగేశ్వరరావు, సాధు రమేష్‌రెడ్డి, మెండెం జయరాజ్, భానోత్ పద్మావతి తదితరులున్నారు. 

తొలి ఏడాది ఫీజు ఇప్పటి వరకు రాలేదు

‘‘మేం అండర్ గ్రాడ్యుయేషన్ చేసే సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎప్పటికప్పుడు వచ్చేది. ఇప్పుడు నేను ఎండీ రెండో సంవత్సరం చదువుతున్నా.. మొదటి సంవత్సరం ఫీజు కూడా ఇప్పటి వరకు రాలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుకుంటున్నాం. రీయింబర్స్‌మెంట్ సకాలంలో రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.’’
- జ్యోత్స్న,
ఎండీ అనస్తీషియా సెకండ్ ఇయర్ 


135 వ్యాధులను తొలగించడం దారుణం
‘‘పేదవారికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం నుంచి 135 వ్యాధులను తొలగించింది. ప్రభుత్వ చర్యతో పేదవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు ఉండవు, సౌకర్యాలు ఉంటే వైద్యులు ఉండరు... అయినా ముఖ్యమైన 135 వ్యాధులను తొలగించడం దారుణం.’’
- డాక్టర్ ఆనంద్‌కుమార్, మమత మెడికల్ కాలేజ్ 

హైదరాబాద్ వెళ్లమంటున్నారు
‘‘రెగ్యులర్‌గా వచ్చే వ్యాధులైన డయాలసిస్, అపెండిసైటిస్, ల్యాప్రోస్కోపిక్‌కు సంబంధించిన వ్యాధులను ఆరోగ్యశ్రీ నుంచి తొలగించారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే డయాలసిస్‌కు సంబంధించి వారానికి వెయ్యిమంది వస్తుంటారు. వీరికి ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు లేవు. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలానికి చెందిన వారికి 24 గంటల నొప్పి(అపెండిసైటిస్) వచ్చి ఆపరేషన్ అవసరమైతే హైదరాబాద్ వెళ్లమంటున్నారు. ఇలా అయితే పేదలకు ఎలా వైద్యం అందుతుంది?’’
- కిషన్, డిప్యూటీ సూపరింటెండెంట్, మమత మెడికల్ కాలేజీ 

వైఎస్సార్ కాలం రామరాజ్యం
‘‘దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రం రామరాజ్యంలా ఉండేది. ఆయన మరణించిన తర్వాత రాష్ట్రంలో రావణరాజ్యం లాంటి పాలన సాగుతోంది. అందరికీ విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. ఆయన కాలంలో రాష్ట్రం అంతటా సుభిక్షంగా ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మా కష్టాలు తీరుతాయి.’’
- సి.హెచ్.శిరీష, ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్
Share this article :

0 comments: