జ(గ)నాభిప్రాయమే కీలకం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జ(గ)నాభిప్రాయమే కీలకం!

జ(గ)నాభిప్రాయమే కీలకం!

Written By news on Saturday, April 6, 2013 | 4/06/2013


Written by MK On 6/4/2013 13:40:00 PM(sakshi)
వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ సహా తొమ్మిది పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయని ప్రముఖ ఆంగ్ల వారపత్రిక ‘ఇండియా టుడే’ విశ్లేషించింది. ‘ఎన్నికల తర్వాత సంకీర్ణ సర్కారు ఏర్పాటే లక్ష్యంగా రెండు ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే మిత్రుల అన్వేషణలో పడ్డాయి. ఎన్నికల అనంతరం బలమైన కూటమిగా అవతరించడానికి కావాల్సిన సంఖ్యా బలాన్ని కూడగట్టుకునే కసరత్తును ఆరంభించాయి’ అని పేర్కొంటూ పత్రిక తాజా సంచిక ముఖచిత్ర కథనం ప్రచురించింది. ఈ 9 పార్టీలు ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించడమే గాక కేంద్రంలో సర్కారు ఎవరిదనేది ఆ పక్షాల సారథులే నిర్ణయిస్తారన్నది కథనం సారాంశం. జాతీయ రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న ములాయంసింగ్ యాదవ్, మాయావతి, శరద్ పవార్, ఎం.కరుణానిధి, జె.జయలలిత, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, నితీశ్ కుమార్, జగన్‌మోహన్‌రెడ్డిలను ప్రస్తావిస్తూ ముఖచిత్ర కథనంలో వారి ఫొటోలను ప్రచురించారు. జాతీయ రాజకీయ విశ్లేషకుల్లో మారిన దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ, వైఎస్సార్‌సీపీని బలమైన రాజకీయ శక్తిగా గత రెండేళ్లలో పలు మీడియా కథనాలు పలుసార్లు అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఈ పరంపరలోనే ‘ఇండియాటుడే’ తాజా కథనం ఉండటం గమనార్హం.

అనామకుడు బాబు!

దేశంలోని ఏడు ప్రధాన రాష్ట్రాలకు చెందిన 9 మంది రాజకీయ ప్రముఖులే కేంద్రంలో ఎన్నికల తర్వాత రాజకీయాలను శాసిస్తారని, ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున జగన్ ఆ భూమికను పోషిస్తారని కథనంలో పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని పదేపదే చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేరు కూడా ఈ కథనంలో లేదు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రాల నుంచి పాలక, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలిద్దరి ప్రస్తావనా కథనంలో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం కేవలం వైఎస్సార్‌సీపీని, జగన్‌ను మాత్రమే ప్రస్తావించారు.

యువ సంచలనం!

రాష్ట్రాలవారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్, యూపీ, బీహార్, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో తొమ్మిది రాజకీయ పార్టీలు కీలక శక్తులుగా ఉన్నాయని కథనం వివరించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, యూపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, మహారాష్ట్ర నుంచి ఎన్సీపీ అధినేత, కేంద్ర మంత్రి శరద్ పవార్, బీహార్ నుంచి జనతాదళ్ (యునెటైడ్) అగ్ర నేత, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, తమిళనాడు నుంచి అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జె.జయలలిత, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి, పశ్చిమ బెంగాల్ నుంచి ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఒడిశా నుంచి బిజూ జనతాదళ్ సారథి, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లను కేంద్ర రాజకీయాల్లో నిర్ణాయక పాత్రధారులుగా కథనం అభివర్ణించింది. వీరిలో మిగతా ఎనిమిది మందీ దీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతూ సంకీర్ణ రాజకీయాల్లో ఆరితేరిన ఉద్ధండులు కాగా జగన్ ఒక్కరే నవ యువ సంచలనం కావడం గమనార్హం.

బలీయ శక్తి!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత బలీయమైన రాజకీయ శక్తిగా శరవేగంగా ఎదుగుతోందని ఇండియాటుడే తాజా ముఖచిత్ర కథనం పేర్కొంది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో పార్టీ చాలా పటిష్టంగా కన్పిస్తోందని వివరించింది. తెలంగాణలో కాంగ్రెస్ ఓటర్లు క్రమేపీ వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్ వైపు మళ్లుతున్నారని విశ్లేషించింది. ఈ ప్రాంతంలో పలువురు ప్రముఖ నాయకులు ఇప్పటికే వైఎస్సార్‌సీపీలో చేరారని ప్రస్తావించింది. ‘‘జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ నిరాకరించి 2012 మే 27 నుంచీ జైల్లోనే ఉంచినా.. కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు ఎమ్మెల్యేలతో పాటు యువ ఔత్సాహిక నేతలు ఆయనను కలిసేందుకు భారీ సంఖ్యలో చంచల్‌గూడ జైలు ముందు బారులు తీరుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనువుగా మలచుకోవడంలో టీడీపీతో పాటు ఇతర అన్ని పార్టీల కంటే వైఎస్సార్‌సీపీయే చాలా ముందుంది’’ అంటూ విశ్లేషించింది. ‘‘జగన్ జరిపిన విసృ్తత ఓదార్పు యాత్రను ఆయన అరెస్టు ద్వారా ప్రభుత్వం నిరోధించింది. అయినా, తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అసంపూర్తిగా వదిలిన అజెండాను పూర్తి చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చేందుకు తన సోదరి షర్మిలను జగన్ నియోగించారు. ఆ మేరకు ఆమె అత్యంత కష్టతరమైన పాదయాత్ర సాగిస్తున్నారు’’ అని పేర్కొంది.

నూతన చారిత్రిక దశ!

వాస్తవానికి ‘ఇండియాటుడే’ ముఖ చిత్ర కథనం ఓ కొత్త చారిత్రిక దశను పరోక్షంగా ప్రస్తావించింది. ఆరున్నర దశాబ్దాలుగా నిత్యం పరిణామానికి గురవుతూ వస్తున్న మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇప్పుడు ఓ కొత్త దశకు చేరుకుంది. నెహ్రూ, ఇందిర, జయప్రకాష్ నారాయణ్ (లోక్ నాయక్) తదితరుల కాలం ఇప్పుడు చరిత్రలో ఉజ్వల ఘట్టంగా మాత్రమే మిగిలింది. బహుశా ఇకముందు మన దేశానికి జాతీయ స్థాయిలో కేంద్రీకృత నాయకత్వం గానీ, సారథ్యంగానీ ఉండకపోవచ్చు. ఈ పరిస్థితి ఒక్కనాడే వచ్చిపడింది కాదు. వాస్తవానికి లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, వీపీ సింగ్, ఐకే గుజ్రాల్, దేవె గౌడ, పీవీ, మన్మోహన్ సింగ్ లాంటి నేతలు ప్రధాన మంత్రులు కాగలగడం చూస్తేనే మన ప్రజాస్వామ్యం తీరుతెన్నుల్లో వచ్చిన మార్పు కళ్లకు కడుతుంది. ఇన్నాళ్లకు ఇది తిరుగులేని ధోరణిగా స్థిరపడింది. ప్రాంతీయ స్థాయిలో జనహృదయ విజేతలుగా ఆవిర్భవించే నేతలే ఇకపై జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తారు. ‘ఇండియా టుడే’ కథనం సైతం ఇదే విషయం చెప్తోంది. నిజానికి ఈ క్రమం 1960 దశకం చివర్లోనే మొదలయింది. సోషలిస్ట్ దార్శనికుడు రామ్ మనోహర్ లోహియాను ఈ క్రమానికి మంత్రసానిగా చెప్పవచ్చు. దక్షిణ భారత దేశంలో పుట్టిన సంస్కరణ ఉద్యమాలూ, ఉత్తర భారత దేశంలో తలెత్తిన నూతన చేతనా ఈ క్రమాన్ని చెక్కుతూ పోయాయి. ఈవీఆర్ నుంచి ఎంజీఆర్ వరకూ, కర్పూరీ ఠాకూర్ నుంచి మాయావతి వరకూ, ఎన్టీర్ నుంచి వైఎస్సార్ వరకూ ఎందరో జనహృదయ విజేతలు ఈ క్రమం లోతుగా వేళ్లూనుకోడానికి కారకులయ్యారు. తాజాగా ఈ జాబితాలో చేరిన తెలుగు నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇండియా టుడే కథనం ఆ మాటే చెప్తోంది.
- See more at: http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=60390&Categoryid=28&subcatid=0#sthash.iUAwMXkI.dpuf
Share this article :

0 comments: