పగబట్టిన ప్రకృతి.. పాలకుల నిర్లక్ష్యంతో కుదేలైపోతున్న అన్నదాతలు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పగబట్టిన ప్రకృతి.. పాలకుల నిర్లక్ష్యంతో కుదేలైపోతున్న అన్నదాతలు..

పగబట్టిన ప్రకృతి.. పాలకుల నిర్లక్ష్యంతో కుదేలైపోతున్న అన్నదాతలు..

Written By news on Wednesday, April 17, 2013 | 4/17/2013

* పగబట్టిన ప్రకృతి.. పాలకుల నిర్లక్ష్యంతో కుదేలైపోతున్న అన్నదాతలు..
* కరెంటు చార్జీల పేరుతో రక్తం పిండుతున్న రాష్ట్ర ప్రభుత్వం
* అప్పులు కట్టాలంటూ వేధిస్తున్న బ్యాంకు అధికారులు
* రైతుల ఇళ్లకు నోటీసులు.. అప్పులు కట్టకుంటే ఆస్తులు జప్తు చేస్తామంటూ బెదిరింపులు
* ఈ పాలకులకు మానవత్వం లేదని షర్మిల మండిపాటు 

 పాలకుల పాపం.. ప్రకృతి ప్రకోపం కలిసి రైతుల ఉసురు తీస్తోంది. ఆరుగాలం కష్టపడ్డా పెట్టుబడి ఖర్చులు కూడా రాక అన్నదాతలు నిండా అప్పుల్లో కూరుకుపోయారు. అదునులో కురవని వర్షాలు ఓవైపు.. అకాల వర్షాలు మరోవైపు రైతన్న వెన్ను విరిచాయి. మూడుపూటలా తిండికే గడవని దుస్థితి.. ప్రతి పల్లెలో ఇదే దైన్యం. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన సర్కారు.. కనికరం లేకుండా వారి రక్తం పిండుతోంది.

పంట రుణాలు, కరెంటు బిల్లులు కట్టాలంటూ వెంటబడి తరుముతోంది. అచ్చంగా చంద్రబాబు హయాం తరహాలోనే అధికారులు పల్లెలపై దాడులు చేసి రైతులను పోలీసు స్టేషన్లలో పెడుతున్నారు. కరెంటు బిల్లుల కోసం రైతులను, వారి భార్యలను పోలీసు స్టేషన్లకు ఈడ్చి, మహిళల మంగళసూత్రాలను సైతం తాకట్టు పెట్టిస్తున్న దారుణాలు కొనసాగుతుండగానే.. ఇప్పుడు బ్యాంకు అధికారులు పల్లెల మీద పడుతున్నారు. పంట రుణాలు వడ్డీతో సహా కట్టాల్సిందేనని, లేదంటే ఆస్తులు జప్తు చేసి వేలం వేస్తామంటూ నోటీసులిస్తున్నారు. 

దిక్కుతోచని రైతన్నలు బ్యాంకు నోటీసులు తెచ్చి షర్మిలకు చూపించి కన్నీరుమున్నీరుగా విలపించారు. మంగళవారం మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఇవే దయనీయ దృశ్యాలు కనిపించాయి. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో రైతన్న కన్నీటి వెతలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎలాంటి అధికారిక ప్రకటనలు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం కేవలం అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇస్తూ... రైతుల నుంచి అనుకున్న విధంగా ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తోంది. మంగళవారం కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని పల్లెల్లో పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ కష్టాలను షర్మిలతో చెప్పుకున్నారు.

ఈ పాలకులకు ప్రజల కష్టాలు తెలియవు: ప్రజల సమస్యలు విన్న అనంతరం షర్మిల స్పందించారు. కొద్దిసేపు వారితో మాట్లాడారు. ‘‘ఈ పాలకులకు మనసు, మానవత్వం అనేది లేనే లేదు. ప్రజల రక్తం పిండైనా పన్నులు వసూలు చేయాలని చూస్తున్నారు. ఇది వైఎస్సార్ రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వమే కానీ వైఎస్సార్ ప్రభుత్వం కాదు. ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్‌ను అర్థం చేసుకోలేదు. ఆయనను అర్థం చేసుకొని ఉంటే వైఎస్సార్ తెచ్చిన సంక్షేమ పథకాలను యథాతథంగా అమలు చేసి ప్రజల పక్షాన నిలబడేవారు. వైఎస్సార్ సువర్ణయుగంలో ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచలేదు. కానీ ఇప్పుడున్న పాలకులకు ప్రజల కష్టాలు, కన్నీళ్లు తెలియవు.

ఏం చేసైనా ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలనే లక్ష్యంతోనే ఉన్నారు. మీకు ఒక్క మాట మళ్లీ చెప్తున్నా... త్వరలోనే జగనన్న బయటికి వస్తారు. రాజన్న రాజ్యం స్థాపిస్తారు. ఆ రాజన్న రాజ్యంలో రైతేరాజు. ప్రతి అవ్వా.. తాతలకు ఇప్పుడున్న రూ.200 వృద్ధాప్య పింఛన్‌ను జగనన్న రూ.700 చేస్తారు. మహిళలకు, రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు. వికలాంగులు వాళ్లంతట వాళ్లే చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రోత్సహించి వాళ్ల కాళ్ల మీద నిలబడేలా చేస్తారు..’’ అని షర్మిల ప్రజలకు భరోసా ఇచ్చారు. మంగళవారం 122వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం చెరువు మాధవరం గ్రామం నుంచి ప్రారంభమైంది. 

అక్కడ్నుంచి మునగపాడు, సున్నంపాడు, తెల్లదేవరపాడు, గంగినేని మీదుగా దుగ్గిరాలపాడు వరకు సాగింది. ఈ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 14.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,652.4 కి.మీ. యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు జోగి రమేష్, పేర్ని నాని, జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబు, నేతలు ఎంవీఎస్ నాగిరెడ్డి, గౌతంరెడ్డి, స్థానిక నాయకులు కాజా రాజ్‌కుమార్, అప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, వేజెండ్ల శివకుమార్, కె.గురువయ్య, షకీల బేగ్ తదితరులున్నారు.

అంత అప్పు ఎలా కట్టాలమ్మా?
మునగపాడు గ్రామానికి చెందిన శీలం పాపిరెడ్డి అనే రైతు షర్మిలతో తన గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘అమ్మా.. మూడేళ్ల కింద రూ.3 లక్షల పంట రుణం తీసుకుంటే అదిప్పుడు రూ.6 లక్షలు అయింది. అప్పులు కట్టమని బ్యాంకోళ్లు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. లేకుంటే పొలం జప్తు చేస్తామని ఇంటికి నోటీసులు అతికించి వెళ్లారు. మూడేళ్ల నుంచి మామిడి తోట మీద పెట్టిన పెట్టుబడి కూడా పూడలేదు. గత ఫిబ్రవరిలో కురిసిన వర్షంతో మామిడి కాయలకు మంగు తెగులు సోకింది. ఈ కాయలను కోసుకొని మార్కెట్‌కు పోతే టన్నుకు రూ.2,000 మించి ధర పడటం లేదమ్మా. అంత అప్పు ఎలా కట్టాలమ్మా..’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దిగుబడి ఉన్నా మునక్కాయలకు గిట్టుబాటు ధర లేదని రైతు నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

గంగినేని గ్రామంలో రచ్చబండలో రమణమ్మ అనే మహిళా రైతు ఉద్వేగంగా తన బాధలు చెప్పుకున్నారు. ‘‘అమ్మా.. 2 ఎకరాల్లో మొక్కజొన్న వేశాం. బోరులో నీళ్లున్నాయి. కరెంటు లేక ఎకరంన్నర ఎండిపోయింది. 3 గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేదు. అది కూడా మూడు, నాలుగుసార్లు ఇస్తున్నారు. వైఎస్సార్ ఉన్నప్పుడు ఉచిత విద్యుత్తు వచ్చింది. రూపాయి కూడా బిల్లు కట్టలేదు. ఇప్పుడు రెండు నెలలకు కలిపి వ్యవసాయానికి కూడా రూ.350 బిల్లు పంపిస్తున్నారు. వైఎస్సార్ ఉన్నప్పుడు రూ.5,000 నుంచి రూ.6,500 వరకు పలికిన పత్తి ఇప్పుడు రూ.3,300 మించడం లేదు. రైతులంతా పత్తి అమ్ముకున్నాక క్వింటాల్ పత్తి ధర రూ.4,800 చేశారు. ఈ ధర ఎవరి కోసం పెంచారో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పాలి. మమ్ములను ముంచి దళారులను మేపుతారా..’’ అని ఆమె ప్రశ్నించారు. 

ఈనెల 22న ఖమ్మం జిల్లాలోకి..
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈనెల 22న ఖమ్మం జిల్లాలోకి ప్రవేశిస్తుందని పాదయాత్ర సమన్వయకర్త తలశిల రఘురాం, పార్టీ నాయకులు కేకే మహేందర్‌రెడ్డి ప్రకటించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని గండ్రాయి గ్రామం దాటాక కృష్ణా జిల్లాలో పాదయాత్రను పూర్తిచేసి.. మధిర నియోజకవర్గం వల్లభి గ్రామం మీదుగా షర్మిల ఖమ్మం జిల్లాలోకి అడుగుపెడతారని వారు చెప్పారు. జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాల్లో 200 కిలోమీటర్ల మేర నడుస్తారని, యాత్ర దాదాపు 15 రోజుల పాటు కొనసాగుతుందని వివరించారు.
Share this article :

0 comments: