ఇంకా ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇంకా ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారు?

ఇంకా ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారు?

Written By news on Tuesday, April 16, 2013 | 4/16/2013

జగన్ సంస్థల్లో పెట్టుబడుల కేసులో సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ వాదనలు
గుజరాత్ మాజీ మంత్రి అమిత్‌షా కేసులో సుప్రీం కోర్టు ఇదే స్పష్టంచేసింది 
ప్రస్తుతం సీబీఐ వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగ విరుద్ధం, చట్టవిరుద్ధం
త్వరగా దర్యాప్తు చేసి ఒకే చార్జిషీట్ వేస్తామని సుప్రీంకు చెప్పారుగా?
ఆ హామీని నెరవేర్చరా? ఏడు నెలలుగా సీబీఐ ఏం దర్యాప్తు చేస్తోంది?.. రాజ్యాంగం సీబీఐకి వర్తించదా? సుప్రీంకోర్టును సీబీఐ ధిక్కరించవచ్చా?
పెండింగ్‌లో ఉన్న ఏడు అంశాల్లో ఒక్క దాల్మియాపైనే చార్జిషీట్ వేశారు.. తుది చార్జిషీటు ఎందుకు వేయలేదు? సీబీఐని కోర్టు ఈ ప్రశ్న అడగాలి
దర్యాప్తు పూర్తయ్యాకే అభియోగాలు నమోదు చేయాలంటోంది చట్టం.. జగన్‌మోహన్‌రెడ్డి కేసులో ఇంకా 6 అంశాల్లో దర్యాప్తు పెండింగ్‌లో ఉంది
దర్యాప్తు పెండింగ్‌లో ఉండగా అభియోగాలను నమోదు చేస్తారా? ఎవరి ప్రయోజనాల కోసం ఈ ఆత్రుత?
జగన్‌ను ఎక్కువ కాలం జైల్లో ఉంచటానికే దర్యాప్తులో సీబీఐ జాప్యం.. ఈ ప్రక్రియ ఆపకపోతే మరోసారి చట్టపరంగా తప్పు చేసినట్లవుతుంది
ప్రత్యేక కోర్టుకు విన్నవించిన సాయిరెడ్డి తరఫు న్యాయవాది
హైదరాబాద్: 
ఒకే తరహా నిందారోపణలపై వేరువేరు చార్జిషీట్లు వేయటం సరికాదని, ఒకే చార్జిషీటు వేయాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ పేర్కొన్నారు. మొదటి చార్జిషీట్ తర్వాత దాఖలు చేసే వాటిని.. దానికి అనుబంధ చార్జిషీట్‌లుగా మాత్రమే గుర్తించాలన్నారు. ఈ మేరకు గుజరాత్ హోంశాఖ మాజీ మంత్రి అమిత్‌షా కేసులో సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ఆయన సోమవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి నివేదించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి దాఖలైన కేసులో దర్యాప్తు పూర్తయ్యే వరకూ అభియోగాల నమోదు ప్రక్రియను చేపట్టరాదని కోరుతూ సీఆర్‌పీసీ సెక్షన్ 309 కింద ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం ఆయన ఈ వాదన వినిపించారు. సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట వాదనలు వినిపించిన సుశీల్‌కుమార్.. అమిత్‌షా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధానంగా ప్రస్తావించారు. 

‘‘ఈ కేసులో మొదట ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. దాని కింద అరెస్టు చేశారు. చార్జిషీటు కూడా వేశారు. చార్జిషీటు వేశాక అమిత్ షాకు బెయిలు మంజూరయింది. దీంతో మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. మరో చార్జిషీటు దాఖలు చేశారు. అయితే ఒకే నేరానికి సంబంధించి ఒకే చార్జిషీటు దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ ఈ నెల 8న సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించింది’’ అని వివరించారు. జగన్‌మోహన్‌రెడ్డి కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, దర్యాప్తు పూర్తయ్యాకే అభియోగాలు నమోదు చేయాలని చట్టం స్పష్టంగా చెప్తోందని ఆయన పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తికాకుండా అభియోగాల నమోదు ప్రక్రియను ప్రారంభిస్తే మరోసారి చట్టపరంగా తప్పు చేసినట్లవుతుందన్నారు. ‘‘అంతేకాదు. ఇది నిందితుల హక్కులను ఉద్దేశపూర్వకంగా హరించినట్లే. ఇదెంతమాత్రం న్యాయబద్ధం కాదు’’ అని స్పష్టంచేశారు. వేరువేరుగా చార్జిషీట్లు వేయటమనేది రాజ్యాంగంలోని 14, 20, 21వ అధికరణలకు విరుద్ధమని ఆయన విన్నవించారు. అలాగే సీఆర్‌పీసీ సెక్షన్ 223(డి) ప్రకారం కూడా ఇది చట్ట విరుద్ధమన్నారు. 

నిజానికి గతంలో జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ కూడా దాదాపు ఇలాంటి తీర్పునే ఇచ్చారు. ఆయన అరెస్టు అనేది ఎఫ్‌ఐఆర్‌కే వర్తిస్తుందని, ఆ ఎఫ్‌ఐఆర్ ప్రకారం ఎన్ని చార్జిషీట్లు వేసినా అన్నిట్లోనూ విడివిడిగా అరెస్టు చూపించాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పారు. ఒక అంశంలో చూపిన అరెస్టును మిగతా అంశాలకూ వర్తింపజేయాలని కూడా తీర్పునివ్వటం ఈ సందర్భంగా గమనార్హం. 
సుప్రీంకోర్టు తీర్పంటే సీబీఐకి లెక్కలేదా?

‘‘జగన్‌మోహన్‌రెడ్డి తన సంస్థల్లో పెట్టుబడుల కేసుకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై వాదనల సందర్భంగా సీబీఐ తరఫున అప్పటి అదనపు సొలిసిటర్ జనరల్ పరాశరన్ స్పష్టమైన హామీ (అండర్‌టేకింగ్) ఇచ్చారు. ఈ కేసులో ఇంకా మిగిలి ఉన్న ఏడు అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తిచేస్తామని, తుదిగా ఒకే చార్జిషీట్ దాఖలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇలా తుది చార్జిషీట్ దాఖలు చేస్తామని సీబీఐ అంగీకరించిన విషయాన్ని సుప్రీంకోర్టు గతేడాది అక్టోబరు 5న ఇచ్చిన ఉత్తర్వుల్లో కూడా పేర్కొంది. కానీ సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని సీబీఐ ఉల్లంఘించింది. తుది చార్జిషీట్ దాఖలు చేసిన అనంతరం బెయిలు కోసం జగన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న ఈ కోర్టు గతంలో జగన్ బెయిలు పిటిషన్‌ను కొట్టివేసింది. రాజ్యాంగంలోని 141వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలకు అందరూ బద్ధులై ఉండాలి. 

మరి ఈ అధికరణ సీబీఐకి వర్తించదా? పెండింగ్‌లో ఉన్న ఏడు అంశాలపైనా దర్యాప్తు పూర్తి చేసి ఒకే తుది చార్జిషీటు వేయాలని సుప్రీంకోర్టు చెప్పినా.. సీబీఐ ధిక్కరించింది. పెండింగ్‌లో ఉన్న ఏడు అంశాల్లో నాలుగో అంశమైన దాల్మియా సిమెంట్స్‌పై మాత్రమే సీబీఐ ఈ నెల 8న చార్జిషీటు దాఖలు చేసింది. సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత సీబీఐకి లేదా? ఇది సర్వోన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించటం కాదా? సుప్రీంకోర్టు తీర్పు అంటే సీబీఐకి లెక్కలేదా?’’ అని సుశీల్‌కుమార్ గట్టిగా ప్రశ్నించారు. 

దర్యాప్తు త్వరగా పూర్తిచేస్తామని సుప్రీంకోర్టుకు చెప్పి ఏడు నెలలు గడిచిందని, ఈ ఏడు నెలలూ సీబీఐ ఏం చేసిం దని సుశీల్ ప్రశ్నించారు. ‘‘ఎందుకు తుది చార్జిషీట్ వేయటం లేదు? మేమేం సీబీఐ దయాదాక్షిణ్యాలను ఆశించటం లేదు. అది చట్టపరిధిలో వ్యవహరించాలని మాత్రమే అడుగుతున్నాం. ఎందుకలా చేయటం లేదు? దర్యాప్తు కోసం చట్టం నిర్దేశించిన నిబంధనలను ఎందుకు పాటించటం లేదు?’’ అని కోర్టు సుముఖంగా సీబీఐని సుశీల్ నిలదీశారు. 

15 చార్జిషీట్లు వేస్తే 15 ట్రయల్స్ చేస్తారా?

‘‘ఈ కేసులో సీబీఐ 15 చార్జిషీట్లు వేస్తే 15 తుది విచారణలు (ట్రయల్స్) చేస్తారా?’’ అని సుశీల్ ప్రశ్నించారు. ‘‘ఇది చట్టవిరుద్ధం. అన్ని చార్జిషీట్లలో ఒకే సాక్షిని చేర్చారు. అలాంటప్పుడు 15 సార్లు ఒకే సాక్షిని కోర్టుకు పిలుస్తారా? ఆయన్ను మేం ఎన్నిసార్లు ప్రశ్నించాలి? చట్టపరంగా ఇలాంటి ప్రక్రియకు అనుమతి లేదు. ఇదంతా జగన్ హక్కులను హరించేందుకే. ఇంకా ఈ కేసులో ఆరు అంశాలకు సంబంధించి దర్యాప్తు పెండింగ్‌లో ఉంది. అలాంటపుడు అభియోగాలను నమోదు చేయాల్సిన అవసరమేమొచ్చింది? అంత తొందరెందుకు? ఎవరి కోసం ఈ ఆత్రుత?’’ అని సుశీల్ నిలదీశారు. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో 71 మందిని సీబీఐ నిందితులుగా పేర్కొందని, వీరందరిపైన 120(బి) రెడ్ విత్ 420 సెక్షన్లను మోపిందని చెప్పారు. జగతి పబ్లికేషన్స్ షేరు విలువను రూ. 10 నుంచి రూ. 350కి పెంచారనేదే విజయసాయిరెడ్డిపై అన్ని చార్జిషీట్లలో ఉన్న అభియోగమని, అన్ని చార్జిషీట్లలోనూ దీనికిందే అభియోగాలు మోపారని, ఇవన్నీ ఒకే తరహా నిందారోపణనలని ఆయన వివరించారు. ఈ కేసులో తుది చార్జిషీట్ దాఖలు చేసి దర్యాప్తు పూర్తయిందని సీబీఐ స్పష్టం చేసేవరకూ అభియోగాల నమోదు ప్రక్రియను ఆపాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై తమ వాదనలు వినిపించేందుకు గడువు కావాలని సీబీఐ తరఫున డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ విజ్ఞప్తి చేయటంతో విచారణను కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. 

దాల్మియాపై చార్జిషీట్‌ను ఫైనల్‌గా భావించాలి

జగన్ సంస్థల్లో పెట్టుబడుల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సీబీఐ ఈ నెల 8న సమర్పించిన చార్జిషీట్‌ను తుది చార్జిషీట్‌గా పరిగణలోకి తీసుకోవాలని సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. గత అక్టోబర్ 5న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ నడుచుకునేలా ఆదేశాలు జారీచేయాలని, దాల్మియా సిమెంట్స్‌పై వేసిన చార్జిషీట్‌ను తుది చార్జ్‌షీట్‌గా భావించాలని కోరుతూ జగన్, సాయిరెడ్డిలు దాఖలు చేసిన మెమోలను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు సోమవారం విచారించారు. సుప్రీంకోర్టు ముందు సీబీఐ అంగీకరించిన ప్రకారం ఒకే తుది చార్జిషీట్ వేయాలని, ఈ మేరకు సీబీఐ వ్యవహరించనందున దాల్మియాపై చార్జిషీట్‌ను ఫైనల్‌గా భావించాలని కోరారు. అయితే ఈ మెమోలపై కౌంటర్లు దాఖలు చేసేందుకు గడువుకావాలని సీబీఐ కోరటంతో విచారణను కోర్టు ఈ నెల 24కు 
వాయిదా వేసింది. 


చార్జిషీట్లను కలిపి విచారించండి: జగన్ పిటిషన్లు

పెట్టుబడుల కేసులో సీబీఐ ఇప్పటి వరకు సమర్పించిన చార్జిషీట్లన్నిటినీ కలిపి సమష్టిగా (జాయింట్ ట్రయల్) తుది విచారణ ప్రారంభించాలని వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఆర్‌పీసీ సెక్షన్ 223 కింద సోమవారం కోర్టులో వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు. సీసీ నంబర్ 9, 10, 14 చార్జిషీట్లను కలిపి విచారించాలని కోరారు. ఈ పిటిషన్లపై కౌంటర్ల దాఖలకు సీబీఐ గడువు కోరటంతో విచారణను కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. 

ఇంకా ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారు?

వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని చట్టవిరుద్ధంగా ఎక్కువ కాలం జైల్లో ఉంచాలనే సీబీఐ తీవ్ర జాప్యం చేస్తోందని సుశీల్ దుయ్యబట్టారు. ‘‘అందుకే అది చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. జగన్‌ను జైల్లో పెట్టామని సంతోషిస్తూ.. బెయిల్‌ను అడ్డుకోవాలన్న కుట్రతో చార్జిషీట్లను ముక్కలు చేస్తోంది. ఒక ఎఫ్‌ఐఆర్‌కు ఒకే చార్జిషీట్ చేయాలని చట్టం స్పష్టంగా చెబుతోంది’’ అని సుశీల్ స్పష్టంచేశారు. ‘‘ముఖ్యమంత్రి హోదాలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి పలువురికి లబ్ధి చేకూర్చారని, లబ్ధిపొందిన వారు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనేదే సీబీఐ ఆరోపణ. 2004 నుంచి 2009 మధ్య ఈ కుట్ర జరిగినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. పెట్టుబడులు పెట్టిన వారందరినీ ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొంది. అయినా వేర్వేరు చార్జిషీట్లు వేస్తోంది. కానీ ఎన్ని చార్జిషీట్లు వేసినా తుది విచారణ (ట్రయల్) మాత్రం అన్నిటికీ కలిపి నిర్వహించాల్సిందే’’ అని కోర్టుకు విన్నవించారు. జగన్ కేసులో ఇంకా ఎంత కాలం దర్యాప్తు చేస్తారని సీబీఐని సుశీల్ ప్రశ్నించారు. ‘‘ఇప్పటికే దాదాపు 10 నెలలుగా జగన్ జైల్లో ఉన్నారు. ఇంకా ఎన్నాళ్లు ఉంచుతారు? ఇంకా ఎందరిని నిందితులుగా చేరుస్తారు? ఎన్ని చార్జిషీట్లు వేస్తారు? సీబీఐ ధోరణి చూస్తుంటే చట్టపరిధిలో దర్యాప్తు సాగటం లేదని ఇట్టే తెలుస్తోంది’’ అని సుశీల్‌కుమార్ సీబీఐ తీరును ఎండగట్టారు.
Share this article :

0 comments: